Monday, April 29, 2024

గోదారమ్మ కంఠంలో మహాగరళం

- Advertisement -
- Advertisement -

బాసర : దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన నదులలో ఒక్కటైన గోదావరి నీరు కలుషితమవుతుంది. బాసర సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక ఆల్కహాల్ ప్యాక్టరీ నుంచి ప్రమాదకర రసాయనాలను గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో పవిత్ర గోదావరి నది జలాలు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా ఉత్తర తెలంగాణకు ప్రాణాధారంగా ఉన్న గోదావరి నదికి మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలతో ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది.

మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలుకా బాలాపూర్ శివారులోని ఆల్కహాల్ ప్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు ఇతర రసాయనాలు కొన్నేళ్లుగా గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఆల్కహాల్ తయారుచేసినప్పుడు దాని నుండి వచ్చే వ్యర్థాలు రసాయనాలతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పెద్ద గుంతలలో ఏడాదిపాటు నిల్వ ఉంచుతారు.

ఏడాదికి సరిపోయే విధంగా ఈ గుంతలను ఇంకుడు గుంతులుగా ఏర్పాటు చేస్తారు. పూర్తిగా నిండిన వ్యర్థాలు, రసాయనాలను ప్యాక్టరీ యజమానులు ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వర్షాలు పడే సమయంలో గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ నుంచి సుమారు 5 నుంచి 8కిలో మీటర్ల కాలువల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ మీదుగా గోదావరి నదిలోకి వ్యర్థాలను మళ్ళిస్తూ కలుషితం చేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ట్రిపుల్ ఐటీకి , భక్తులకు ఇదే నీరు సరఫరా
సుమారు 150 గ్రామాల ప్రజలు గోదావరి నది నీటిని తాగు నీటిగా వినియోగిస్తున్నారు. ఆల్కహాల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు కలుస్తున్న గోదావరి నీటినే బాసర గ్రామానికి, ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ కళాశాలకు, సరస్వతి దేవి స్థానానికి సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఉదయం, రాత్రి వేళల్లో నల్లని దుమ్ము, భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది.

ఫలితంగా ట్రిపుల్ ఐటీ కళాశాలలోని దాదాపు ఆరువేల మంది విద్యార్థులు,దేవాలయానికి ప్రతిరోజు వచ్చే వేలాది మంది భక్తులు కలుషిత నీటి సమస్యను ఎదుర్కొ ంటున్నారు. తాగునీరు నల్ల రంగులో సరఫరా అవుతున్నదని వారు చెబుతున్నారు. బాసరలో రక్షిత మంచి నీటి పథకం ఉన్నప్పటికి నీటిని శుద్ధ్ది చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.
బాబ్లీ గేట్ల ఎత్తివేతతో గోదావరిలోకి కలుషిత నీరు
ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో దీన్ని ఆసరాగా తీసుకొని బాలాపూర్‌లోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుండి వ్యర్థ పదార్థాలు రసాయనిక పదార్థాలు , యథేచ్చగా వదులుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్సారెస్పి ప్రాజెక్టులో కూడా కలుషిత నీరు చేరడంతో పెద్ద ఎత్తున చేపలు చనిపోతున్నాయి.

ఈ నీటిలోనే సరస్వతి అమ్మవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తుండడంతో చర్మవ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీ యజమానులు వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వ్యర్థాలు వదలడంతో వర్షంతో పై ప్రాంతాల నుంచి వచ్చే నీరుతో వ్యర్థాలు కలిసి గోదావరిలోకి ప్రవహిస్తుండడం వల్ల అధికారులు ఆ కలుషిత నీటిపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News