Monday, April 29, 2024

మల్లు స్వరాజ్యం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Mallu Swarajyam Passed away

హైదరాబాద్ బంజారహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి

మనతెలంగాణ/ హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ స భ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యులు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయం ఉంటుంది. అనంతరం నల్గొండ మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధన కోసం స్వరాజ్యం భౌతికకాయం డోనేట్ చేయనున్నారు. 12 గంటలకు నల్గొండలో సంతాపసభ నిర్వహించనున్నారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ఎం. సుధాకర్‌రెడ్డి తెలిపారు.

కడవరకూ పోరాట స్ఫూర్తితో..

ఎనిమిది దశాబ్దాల కింద ఎర్ర జెండాతో పెనవేసుకున్న ఆమె జీవితం కడవరకూ పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కరివిరాల కొత్తగూడెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో ఆమె జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘స్వరాజ్’ అనే నినాదం పట్ల ప్ర భావితులై తల్లిదండ్రులు ఆమెకు స్వరాజ్యం అనే పేరును పెట్టారు. ఐదో తరగతి వరకే చదువుకున్న స్వరాజ్యం.. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాట పంథాలోకి వచ్చారు. 1941లో తొలిసారి ఆంధ్ర మహిళా సభ పిలుపుతో గ్రామంలోని వివిధ కులాల ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ పలు వర్గాల పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచే సమయంలో తన తల్లి భీమిరెడ్డి చొక్కమ్మ అండగా నిలవడంతో ఇక తాను వెనక్కి తిరిగి చూడలేదు. సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకటనరసింహారెడ్డిని 1930లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. 1945 48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేత బట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు.

గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు నిర్వహించేవారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర వహించారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ బైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్‌గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు (1978, 1983 లలో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.

సిఎం కెసిఆర్ సంతాపం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సిఎం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సిఎం తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని అని ఆయన అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News