Monday, April 29, 2024

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

- Advertisement -
- Advertisement -

Markaz Committee

 

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ కూడా చట్టాల్లోని ఏ నిబంధనను ఉల్లంఘించలేదంటూ మంగళవారం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా మసీదు ప్రాంతంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వచ్చింది. తబ్లిఘి జమాత్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం దాదాపు వందేళ్లుగా మర్కజ్ నిజాముద్దీన్‌లో ఉందని, ప్రతి సంవత్సరం మూడునుంచి అయిదు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు వివిధ దేశాలనుంచి సందర్శకులు, అతిథులు, భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరవుతారని, వారంతా తగు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఏడాది ముందే ఈ కార్యక్రమాలు నిర్ణయించడం జరుగుతుందని మర్కజ్ నిజాముద్దీన్ ఆ ప్రకటనలో తెలిపింది.

మార్చి 22న జనతా కర్ఫూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన వెంటనే మర్కత్ నిజాముద్దీన్‌లో కార్యక్రమాలను నిలిపి వేశామని తెలిపింది. అయితే మార్చి 21వ తేదీ రాత్రి అకస్మాత్తుగా రైళ్ల రాకపోకలను నిలిపి వేయడం వల్ల రైళ్లలో ప్రయాణం చేయాల్సిన వారంతా భారీ సంఖ్యలో మర్కజ్‌లో ఉండిపోవలసి వచ్చింది. 22వ తేదీ రాత్రి 9 గంటలకు ఆంక్షలు ఎత్తివేస్తారని భావిస్తే అంతకు ముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మార్చి 23నుంచి 31 వరకు ఢిల్లీ లాక్‌డౌన్‌లో ఉంటుందని ప్రకటించారని,అందువల్ల సందర్శకులు తమ స్వస్థలాలకు వెళ్లలేకపోయారని ఆ ప్రకటన తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లోను మర్కజ్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో దాదాపు 1500 మంది తమకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను ఉపయోగించుకొని తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది. దీంతో చిక్కుపడిన మిగతా సందర్శకులకు భోజన, వసతి సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.

మార్చి 24న హజ్రత్ నిజాముద్దీన్ పోలీసు అధికారులు మర్కజ్ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని,అయితే మర్కజ్ ప్రాంతాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాదాపు 1500 మంది ముందురోజే వెళ్లిపోయారని, వెయ్యిమంది మాత్రం చిక్కుపడిపోయినట్లు తెలిపినట్లు ఆ ప్రకటన పేర్కొంది. మర్కజ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన అధికారులకు సందర్శకుల ప్రయాణాలకోసం వాహనాలకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. అధికారులతో సంప్రదింపులు సాగుతుండగానే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున తక్షణం ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ నెల 27న అధికారులు తిరిగి నోటీసు ఇచ్చారని దీనిపై 29న వివరంగా సమాధానం ఇచ్చామని ఆ ప్రకటనలో తెలిపారు.

అయితే కోవిడ్19 సోకిన వారు మర్కజ్‌లో ఉన్నారని, కొంతమంది చనిపోయారంటూ సోమవారం( ఈ నెల 30న)పుకార్లు ప్రచారం అయ్యాయని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మర్కజ్ అడ్మినిస్ట్రేషన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను తాను ఆదేశించినట్లు చెపినట్లు ఓ వార్తాసంస్థ రిపోర్టు చేసిందని, ముఖ్యమంత్రిగనుక తమ అధికారులను సంప్రదించి ఉంటే వాస్తవాలను వివరించి ఉండే వాళ్లమని ఆ ప్రకటనలో మర్కజ్ స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మర్కజ్ నిజాముద్దీన్ ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, వేర్వేరు రాష్ట్రాలనుంచి వచ్చిన సందర్శకుల పట్ల కారుణ్యంతో వ్యవహరించిందని, వైద్యపరమైన మార్గదర్శకాలను ఉల్లంఘించేందుకు సందర్శకులు అవకాశం ఇవ్వలేదని, వీధుల్లో తిరగనివ్వలేదని మర్కజ్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: స్థానికులు
అయితే తబ్లిఘి జమాత్ మర్కజ్‌లో పెద్ద సంఖ్యలో జనం చేరడం గురించి తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.తమ అసోసియేషన్ ఈ విషయాన్ని సంబంధిత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, స్థానిక పోలీసులు , దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లిందని, అయినా ఎలాంటి చర్యా తీసుకోలేదని నిజాముద్దీన్ వెస్ట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మహమ్మద్ ఉమర్ ఆరోపించారు. ‘దేశమంతా కరోనా వైరస్ కారణంగా అల్లాడుతున్న సమయంలో 300కు పైగా విదేశీయులను ఎలా అనుమతిస్తారు? వారిని ఆపే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా?’అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రపంచం నలుమూలలనుంచి జనం అక్కడికి వస్తారని తెలిసినా అధికారులు ఎలాంటి అడ్వైజరీ జారీ చేయలేదని మరో స్థానికుడు ఆరోపించారు. అయితే ఇదంతా లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు జరిగింది కనుక అధికారులు చేయగలిగింది ఏమీ లేదని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమయినా ఈ వ్యవహారం క్రమేపీ మతం రంగు పులుముకొంటూ ఉండడంం బాధాకరం.

Markaz Committee clarified that rules were not violated
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News