Monday, April 29, 2024

తెలంగాణ మార్గమే మేలు

- Advertisement -
- Advertisement -

Mediation in the style of Telangana is better: CJI

వ్యాజ్యాల పరిష్కారంపై సిజెఐ రమణ
సంధి ప్రక్రియ మహాభారతం నాటిదే
కృష్ణుడు ఈ బాటలోనే సాగిన వ్యక్తి
ఘర్షణల నివారణకు పలు మార్గాలు
పెండింగ్ కేసులపై తప్పుడు లెక్కలే

న్యూఢిల్లీ : వ్యాజ్యాలకు మధ్యవర్తిత్వ పరిష్కారం అత్యుత్తమ మార్గమని, దీనితో సామాన్య జనులకు మేలు జరుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. న్యాయానికి సకాలంలో న్యాయం దక్కుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ తెలిపారు. మధ్యవర్తిత్వ పరిష్కారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, కాలాయాపన లేనిది. ఈ ప్రక్రియతో తక్షణ న్యాయం అవసరం అయిన సామాన్యుడికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జటిల సమస్యల పరిష్కారానికి ప్రజలకు తక్షణ న్యాయానికి ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన. ఇటువంటి కీలకమైన ఏర్పాట్లు గురించి తనకు తెలిసిందని, తెలంగాణలో ఏర్పాటు అయిన ఇటువంటి ప్రక్రియలను ఇతర రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేసుకుని, సమర్థవంతంగా అమలు చేయడం చాలా మంచిదని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వ మార్గం అంశంపై ఇండియా సింగపూర్ మిడియేషన్ సమ్మిట్ సందర్భంగా మధ్యవర్తిత్వం ప్రధాన స్రవంతిలోకి తేవడం, ఇండియా, సింగపూర్ ఆలోచనలు స్పందనలు అనే ఇతివృత్తంతో ఏర్పాటు అయిన సభలో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారతీయ విలువల జీవలక్షణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మహాభారతాన్ని ప్రస్తావించారు. పూర్వకాలంలోనే సంధి యత్నాలు, జగడాల నివారణ ప్రక్రియలు విరివిగా ఉండేవి. ఇందుకు మహాభారతం ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు కౌరవ పాండవుల మధ్య ఘర్షణ నివారణకు సంధి మంత్రం ఆచరించారు. ఘోర వినాశనపు యుద్ధ నివారణకు సంధి ముఖ్యమని చెప్పారు. సంధి లేదా మధ్యవర్తిత్వాలు విఫలం అయితే ఏం జరుగుతుంది? ఎంతటి దారుణ పరిస్థితి ఏర్పడుతుందనే విషయం కూడా మనం గమనించవచ్చునన్నారు. సమాజం అన్నాక సహజంగానే పలు కారణాలతో వివాదాలు, ఘర్షణలు ఉండనే ఉంటాయి.

ఇవి అనివార్యం అవుతాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, కట్టుబాట్ల, సాంస్కృతిక కారణాలతో వైరాలకు కయ్యాలకు కాలు దువ్వడాలు జరిగే సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయని తెలిపారు. వీటికి పరిష్కారం సాధ్యమైనంత త్వరగా, జటిలం కాకముందే కనుగొనాల్సి ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను కనుగొనడం అత్యవసరం అని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. భారత న్యాయస్థానాలలో పెండింగ్ కేసుల సంఖ్య నాలుగున్నర కోట్లు దాటిందనే గణాంకాలు, సంబంధిత పరిస్థితితో కేసుల భారాన్ని తట్టుకోలేకుండా భారతీయ న్యాయవ్యవస్థ చతికిల పడిందనే వాదన అతి ప్రకటన అంతకుమించి అధార్మిక విశ్లేషణ అని న్యాయమూర్తి తెలిపారు.

అయితే న్యాయవ్యవస్థలో తీర్పుల వెలువరింత లేదా కేసుల విచారణ క్రమంలో ఏళ్ల తరబడి జాప్యం నిజమే అని, దీనికి పలు కారణాలు ఉన్నాయని ప్రత్యేకించి ఉబుసుపోక, తప్పుడు దావాలతో, ఫిర్యాదీల అసమంజస ధోరణిలతో కూడా ఎక్కువగా కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామాలు తలెత్తకుండా వ్యాజ్యాలు కడుదూరం సాగకుండా ఉండేందుకు మధ్యవర్తిత్వ మార్గం అత్యుత్తమని జస్టిస్ తెలిపారు. మనకు అప్పట్లో మహాభారతం నుంచి మధ్యవర్తిత్వం లేదా సంధి ప్రక్రియలతో రాజీ మార్గం గురించి విని ఉన్నామని , దీనిని మనం ఇప్పుడు ఆచరణీయం చేసుకోవచ్చునని జస్టిస్ రమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దిశలో మధ్యవర్తిత్వ రాజీ మార్గాలతో ముందుకు వెళ్లుతోందని, దీనిని అంతా పాటించడం మంచిదే అవుతుందన్నారు.

బొమ్మ కొట్టేస్తే సాక్షముందా
జస్టిస్ చెప్పిన జడ్జి జోక్

ఈ సదస్సు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దేశంలోని జడ్జిల వైఖరిని తెలిపే ఓ జోక్‌ను చెప్పారు. ‘ ఓ జడ్జి బంగళాలో ఉదయం పూట పేపర్ తిరగేస్తూ కాఫీ సేవిస్తున్నాడు. అక్కడికి మనవరాలు కండ్లు తుడుచుకుంటూ వచ్చింది. తాతా అక్క నా ఆటబొమ్మను కొట్టేసిందని ఫిర్యాదు చేసింది. వెంటనే ఈ జడ్జి స్పందిస్తూ దీనికి సాక్షం ఉందా? అని అడిగారు’ ఇది ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితి అని తేల్చిచెప్పారు. బ్రిటిష్ కాలపు ప్రతికూల పరిస్థితులు అంతకు ముందు కూడా దేశంలో వివిధ రకాల రాజీ మార్గాలు అమలులో ఉండేవి. పంచాయతీల పరిష్కారానికి మధ్యవర్తులు ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని వివరించారు. ఇంతకు ముందు గ్రామ స్థాయిల్లో కులపెద్దలు, గ్రామాధికారులు వివిధ సమస్యలను ముందుగానే పరిష్కరించిన సందర్భాలున్నాయని, దీనితో పలు ప్రాంతాలలో ఇప్పటికీ కోర్టు గుమ్మం చూడని ఊర్లు ఉండనే ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News