Sunday, April 28, 2024

మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్

- Advertisement -
- Advertisement -

Minister KTR slams Opposition for tarnishing Hyderabad brand image

దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం

సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం

కేంద్రం తన సంస్థలను
అమ్ముకుంటోంది దానిపై
పోరాటం చేయాల్సిన బిజెపి
నాయకులు ఇక్కడ మిలీనియం
మార్చ్ చేస్తారట కేంద్రంలో
8.30లక్షల ఉద్యోగాలు ఖాళీగా
ఉన్నాయి ప్రధాని మోడీ
సంవత్సరానికి 2కోట్ల
ఉద్యోగాలు తీసేస్తున్నారు
శాసనసభలో మంత్రి కెటిఆర్

రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే సిఎంగా ఉన్నారు కష్టపడి తెచ్చిన
రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారు
అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం

ఆరేళ్లలో ఐటి యూనిట్లను ఏర్పాటు చేశాం రూ.2.20లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి 16లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి కట్టుకథలు చెబితే పరిశ్రమలు రావు కఠోర శ్రమతోనే సాధించగలం : కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: సైబర్ క్రైం పెరుగుతోందని, ఫోన్, ఇంటర్నెట్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. వీటిని అరికట్టడానికి కొత్త పాలసీలను తీసుకొస్తున్నామని, దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారవుతోందని త్వరలోనే దానిని శాసనసభ ముందుకు తీసుకొస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ సైబర్‌క్రైంపై ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో సోమవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇస్తూ కొందరు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని వాటిని దీవెనులుగా తాము భావిస్తామని, అలా అని రాష్ట్రాన్ని నిందించవద్దని, రాజకీయాలకు అతీతంగా తెలంగాణను చిన్నగా చేసే ప్రయత్నం చేయవద్దని, రాష్ట్రం శాశ్వతమని మనం శాశ్వతం కాదని కెటిఆర్ సూచించారు.

గ్లోబల్ సంస్థల కితాబు

రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిహబ్, విహబ్, తెలంగాణ అకాడమీ వర్క్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌ల తదితర పనితీరు చాలా బాగుందని వాటి గురించి తెలియచేయాలంటే చాలా ఉందన్నారు. స్టార్టప్ సిస్టం గురించి చెప్పుకోవాలంటే దేశంలోనే మనం నెంబర్‌వన్ స్థానంలో ఉన్నామన్నారు. వేగంగా ఎదుగుతున్న సిటీలో మనం కూడా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ సంస్థలు మనకు కితాబునిస్తున్నాయని ఆయన తెలిపారు.

తెలంగాణ అకాడమీ స్కిల్స్ నాలెడ్జ్ ద్వారా 3 లక్షల మందికి….

తెలంగాణ అకాడమీ స్కిల్స్ నాలెడ్జ్ ద్వారా 3 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. 33 జిల్లాలకు టాస్క్, న్యాక్ తదితర సంస్థలను విస్తరించాల్సిన అవసరం ఉందని, వీటిని పాతబస్తీలో నెలకొల్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. డిజిటల్ తెలంగాణను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. టి ఫైబర్ ప్రాజెక్టు ద్వారా గ్రామ పంచాయతీలు, పిహెచ్‌సీలు, రైతు వేదికలు, స్కూళ్లుకు 30 వేల ఇనిస్టిట్యూటషన్‌లకు నెట్ కనెక్షన్‌లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇది కోవిడ్ వల్ల కొంత ఆలస్యం అయ్యిందన్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ సమయంలో టిశాట్ ద్వారా పిల్లలకు డిజిటల్ క్లాసులు చెప్పామన్నారు. శాటిలైజ్, డిజిటల్ ఎడ్యుకేషన్‌కు 30 లక్షల మంది సబ్ స్కైబర్స్ ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో 3,000ల వై ఫై కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ పిల్లలు ఫోన్‌లు చూస్తున్నారని చాలామంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని దసరా తరువాత ఫిజికల్ క్లాసులను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు.

టి వ్యాలెట్ 12.62 లక్షల మంది డౌన్‌లోడ్

డిజిటల్ పేమెంట్‌లో భాగంగా టి వ్యాలెట్‌ను తీసుకొచ్చాం. దీనిని 2017 జూన్ 01వ తేదీన ప్రారంభించగా 12.62 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆయన తెలిపారు. దీని ద్వారా అన్ని పనులు చెల్లించవచ్చని, ఇప్పటివరకు 2.76 కోట్ల మంది సేవలు పొందగా, సుమారు రూ. 13,663 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. వేరే పార్టీలు చారాణ పనిచేసి బారాణ ప్రచారం చేసుకుంటాయని తాము అలా చేయడం లేదని మంత్రి కెటిఆర్ తెలిపారు.

రామగుండం ఫర్టిలైజర్ త్వరలో ప్రారంభం

సిఎం కెసిఆర్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని ప్రయోగాలు కూడా చేశామన్నారు. సిర్పూర్ పేపర్‌మిల్లు మళ్లీ తెరిపించాం. దీనికోసం ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సైతం కష్టపడ్డారన్నారు. దీంతోపాటు రామగుండం ఫర్టిలైజర్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నామని దీనిని పిఎం ఓపెన్ చేయించనున్నట్టు ఆయన తెలిపారు. భీమా సిమెంట్ మధ్య తరగతి పరిశ్రమను తెరిపించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఆర్‌బిఐ గవర్నర్‌ను కలిశాం

సర్‌ఫేజీ యాక్ట్ (కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన) (డిపాల్డ్‌కాకుండా చూసేది) ఈ యాక్ట్‌ను బ్యాంకులు ఇష్టానుసారంగా వినియోగించుకుంటు న్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీనికి సంబంధించి ఆర్‌బిఐ గవర్నర్‌ను కలిశామని, బ్యాంకులు ఈ యాక్ట్‌ను మిస్‌యూజ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆర్బీఐకు విజ్ఞప్తి చేశామన్నారు. రెండు కిస్తీలు కట్టకపోతే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఇదే విషయాన్ని ఆర్బీఐకు వివరించామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మూసివేయడానికి బ్యాంకులు ఎన్‌పిఏ ఉపయోగించి (నాన్ పర్‌పామేషన్) కింద డిక్లరేషన్ చేస్తున్నాయన్నారు. ఇది చాలా ఇబ్బందికర విషయమన్నారు.

334 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం

మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల కోసం తెలంగాణ ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదన్నారు. నాలుగు సంవత్సరాల్లో ఇప్పటివరకు 334 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం. రూ.5 కోట్ల రుణాలు ఇప్పించామన్నారు. ప్రభుత్వమే బ్యాంకులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇంతవరకు మాట, మూట లేదు

కేంద్ర ప్రభుత్వం మాకేమీ చేసింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన పారిశ్రామికీకరణ అన్ని వైపులా జరగాలన్న ఉద్ధేశ్యంతో 5 కారిడార్‌లను ఏర్పాటు చేయాలని భావించాం. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. హైదరాబాద్ టు నాగపూర్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు విజయవాడలను ఇండస్ట్రీయల్ కారిడార్‌లుగా గుర్తించాలని కేంద్రానికి విన్నవించాం. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటివరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ కావాలని, అతి పెద్ద క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రూ.1,000 కోట్లను సాయం చేయమని 1,000 సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మాట, మూట లేదని ఆయన ఆరోపించారు.

కేంద్రం తిరస్కరించినవి…

రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రానికి ఎన్నో రకాల విజ్ఞప్తులు చేశాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వేస్ట్‌మెంట్ రీజన్ (ఐటి ఐఆర్) యూపిఏ ప్రవేశపెడితే దానిని మోదీ ప్రభుత్వ రద్దు చేసిందని, దానిని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అయినా ఐటిఆర్ హైదరాబాద్‌కు ఇవ్వలేదని మంత్రి కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. గద్వాల్‌లో, కొత్తగూడెంలోని పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ, స్కాప్ బేస్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు స్వయానా చెప్పి ఇంతవరకు వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. వీటితో పాటు వరంగల్‌లో రైల్ కోచ్ ప్యాక్టరీ, టర్మరిక్ బోర్డు, హైదరాబాద్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ హ్యాండ్లూమ్ ఇనిస్టిట్యూషన్‌లపై ఇప్పటివరకు కేంద్రం వీటిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.

సిసిఐలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం సిద్ధం

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను తెరవాలని అవసరమయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపినా కేంద్రం ఒప్పుకోలేదన్నారు. దానిపై కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని అందులో రాష్ట్రం తెరవాలన్న తాము ఒప్పుకోమని, ఆ భూములను మాత్రం అమ్ముకోవడానికి తాము సిద్ధమని కేంద్రం తెలిపినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ నినాదం స్టార్టప్, కేంద్రం నినాదం ప్యాకప్ అని మంత్రి ఎద్దేవా చేశారు. 6 లక్షల కోట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతామంటున్నారు.

కేంద్రంలో 8,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు

కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్ముతామని ప్రకటిస్తుంటే వాటిపై పోరాటం చేయాల్సిన రాష్ట్ర బిజెపి నాయకులు మనదగ్గర మిలీనయం మార్చ్ చేస్తానంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్‌ల గురించి రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో 8,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే దానిపై రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడడం లేదన్నారు. ప్రధాని మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీసివేస్తున్నారని ఆయన తెలిపారు.

నిరుద్యోగ నిష్పత్తిలో తెలంగాణ బాటంలో…

వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్‌లో ఉన్నామని, నిరుద్యోగ నిష్పత్తిలో తెలంగాణ బాటంలో ఉందని కూడా కేంద్రమే చెప్పిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. 2020,21 సంవత్సరానికి గాను ఆర్‌బిఐ ఇచ్చిన నివేదికలో దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో 4వ అతి పెద్ద రాష్ట్రం తెలంగాణ అని ఆర్‌బిఐ పేర్కొందన్నారు. మొదటిస్థానాల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటకలుండగా తరువాత తెలంగాణ ఉందన్నారు భౌగోళికంగా మనది 12 రాష్ట్రం కాగా, జనాభా పరంగా చూసుకుంటే మనది 11వ రాష్ట్రమని ఆయన తెలిపారు. ఒకసారి ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహిస్తే లెక్కలు చెబుతామన్నారు. రూపాయి మనం కడితే కేంద్రం నుంచి అర్థరూపాయి ఎలా వస్తుందో చెబుతానన్నారు.

కొత్త మైనింగ్ విధానాన్ని తీసుకొస్తున్నాం

ఎమ్మెల్యే వివేకానంద కొంపల్లి దగ్గర ఐటి టవర్, దుండిగల్ దగ్గర ఎలక్ట్రానిక్స్ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అడిగారు. భూ సేకరణ అయిపోగానే వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఐడిపిఎల్, బిహెచ్‌ఈఎల్ కంపెనీలను కాపాడుకుందామంటే ఆ సంస్థలకు ఇచ్చిన భూములను అమ్ముతామని కేంద్రం లేఖ రాసిందన్నారు. మన దగ్గర తక్కువ ధరకు తీసుకొని మనం ఇప్పుడు ఎక్కువ పెట్టి ఆ భూములను కొనాలని కేంద్రం చెబుతుందన్నారు. కొత్త మైనింగ్ పాలసీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త మైనింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వేలం ద్వారా పారదర్శకంగా మైనింగ్ విక్రయాలను జరుపుతామని ఆయన తెలిపారు.

మలక్‌పేటలో 10,000 చదరపు అడుగుల కాంప్లెక్స్‌లో…

టాస్క్, న్యాక్, టిహబ్, విహబ్‌లను ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే అక్భరుద్దీన్ అడిగారు. త్వరలో దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మలక్‌పేటలో 10,000 చదరపు అడుగుల ఆర్ అండ్‌బి కాంప్లెక్స్ ఉందని అందులో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. మైనార్టీల కోసం 705 యూనిట్స్ రూ.800 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. లోకల్ ఎంప్లాయిమెంట్ కల్పించాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి అడిగారని దానికి సంబంధించి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News