Saturday, April 27, 2024

కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా తెలంగాణ పల్లెలు..

- Advertisement -
- Advertisement -

Minister KTR Visits Rajanna Siricilla District

మన తెలంగాణ /సిరిసిల్ల: తెలంగాణలోని ప్రతిపల్లెకు రానున్న రోజుల్లో కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా నీటిని అందించి అద్భుతమైన పంటలు పండించి, తెలంగాణ పల్లెలు బంగారు పల్లెలుగా మారుస్తామని పురపాలక, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో మంగళవారం మంత్రి కెటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి పర్యటించారు. నియంత్రిత పంటల సాగుపై నిర్వహించిన రైతు అవగాహన సదస్సులు, రైతు వేదికల నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. రైతు వేదికల ద్వారా రైతులు కాలానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుకూలంగా ఉన్న పంటలపై చర్చించుకుని తగిన పంటలు వేసుకోవాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశ్యమన్నారు. రైతులు తమకు అక్కరకురాని, మార్కెట్లో మద్దతు ధరలేని పంటలు వేసి నష్టపోవద్దన్నారు. తెలంగాణలో ఆధునిక, ఆదర్శ వ్యవసాయం చేయాలనే సదుద్దేశ్యంతోనే పంటల నియంత్రణ పద్దతికి కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. విప్లవాత్మక మార్పులకు కేంద్రాలుగా రైతు వేదికలు నిలవాలని, రైతు వేదికల్లో ఏర్పాటు చేసే కంప్యూటర్లతో రైతులకు వ్యవసాయంపై అధికారులు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారని వివరించారు.

జిల్లాలో గత సంవత్సరం 2,31,000 ఎకరాల్లో వరి వేసారని, ఈ సారి గోదావరి జలాలు రావడం వల్ల మరో 19,000 ఎకరాల్లో వరి అధికంగా సాగు అయ్యే పరిస్థితి ఉందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో భూగర్భజలాలు 6 మీటర్లు పైకి వచ్చాయన్నారు. సాధారణంగా జిల్లాలో పత్తి, వరి సాగు చేస్తారని ఇప్పుడు కూడా వరి, పత్తి సాగు ఆధునిక పద్దతిలో కొనసాగుతుందన్నారు. కొన్ని కాలువల పనులు సాగుతున్నాయని అవి పూర్తి కాగానే ప్రతి చెరువులోకి గోదావరి జలాలు వస్తాయన్నారు. ప్రతి గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వ్యవసాయ పంట కాలువల కోసం రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వాలన్నారు. సిరిసిల్ల జిల్లాను కోన సీమ ప్రాంతానికి తీసిపోకుండా నిరంతరం నీటితో, పంటలతో కళకళలాడేలా చూస్తామన్నారు. సుందర కాశ్మీరంలా వేసవి తలపించేలా చేస్తామన్నారు. కాలంతో పోటిపడి మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలు కోటి ఎకరాల మాగాణానికి అందించాలని కలలు కంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు నష్టం చేస్తారా అని ప్రశ్నించారు.

రైతులకోసం నిరంతరం ఆలోచించే సిఎం కెసిఆర్ రైతులకు అన్యాయం చేస్తాడా? అని ప్రశ్నించారు. అన్నీ మన మంచి కోసం ఆలోచించే సిఎం కెసిఆర్ మాట విని నియంత్రిత వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలన్నారు. జిల్లాలో 1,06,883 ఎకరాల్లో వరి, 1,22, 450 ఎకరాలలో పత్తి వేయాలన్నారు. గతంలో జిల్లాలో కేవలం 3900 ఎకరాల్లో మక్కలు వేశారన్నారు. గత సంవత్సరం 3600 ఎకరాల్లో కందులు వేశారని ఇప్పుడు మక్కలు వద్దు 8000 ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని సూచిస్తున్నామన్నారు. కెసిఆర్ లాంటి రైతు పక్షపాతినాయకుడు ఉన్నంతవరకు రైతులకు ఎలాంటి అన్యాయం జరుగదని కెటిఆర్ చెప్పారు. రైతును రాజుగా చేయాలన్నదే కెసిఆర్ లక్షమని తెలిపారు.

Minister KTR Visits Rajanna Siricilla District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News