Sunday, April 28, 2024

ఇప్పుడు ‘మంచమెక్కిన మన్యం’ వార్తలేవి?

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: గతంలో వర్షాకాలం వస్తే మంచం పట్టిన మన్యం, అంటువ్యాధుల బారిన పడిన గూడేలు అని వార్తలు తరచూ చూసే వాళ్లమని కానీ సిఎం కెసిఆర్ ఇస్తున్న మంచినీళ్లు, పరిసరాల పరిశుభ్రతకు చర్యల వల్లే నేడు ఆ దాఖలాలు కనిపించడం లేదని పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. తండాలు, తెలంగాణ గిరిజన నాయకుడు కొమురం భీమ్ నినదించిన జల్, జంగల్, జమీన్ నినాదాన్ని సాకారం చేసి, దేశంలో గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఎస్‌సి, గిరిజన, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పర్యటించారు. గురువారం ఉదయం బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.

అదే విధంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో చిన్నతరహా వ్యాపారం చేసుకునే 124 మంది ఎస్‌సి లబ్ధిదారులకు మంత్రులిద్దరు అధికారుల సమక్షంలో ఆర్థిక సహాయం అందించారు. అనంతరం సిరిసిల్లలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వీర్నపెల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన 1614మంది లబ్ధ్దిదారులకు 2858.34 ఎకరాల పోడు భూమి పట్టాలు అందించి వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం లక్షమే నీళ్లు, నిధులు, నియామకాలని స్వరాష్ట్రంలో ఉద్యమ లక్ష్యాలను సాకారం చేసుకుంటున్నామని అన్నారు. వర్షాలు లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల వ్యవసాయానికి, తాగునీటికి కొరత లేకుండా చూస్తున్నామన్నారు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ధనికులు తాగుతున్న నీటినే నేడు గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు.

దేశంలో ఏ సిఎం కూడా ఆలోచించని విధంగా మన సిఎం కెసిఆర్ ఇప్పటికే 60 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 73 వేల కోట్ల రూపాయలు వేసి రైతు బంధు కింద సహాయం అందించామన్నారు. పారిశ్రామికీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ జంగల్‌ను పెంచాలనే ఆలోచనతో హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటించి 5 లక్షల 13 వేల ఎకరాల కొత్త అడవులను తయారు చేశారన్నారు. 8శాతం పచ్చదనాన్ని అదనంగా పెంచారన్నారు. నియామకాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో 2 లక్షల 20 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు పెంచాలని పరిశ్రమలను ఆకర్షిస్తున్నామన్నారు. కొమురం భీమ్ పేరిట ఒక ప్రత్యేక జిల్లా ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లా ఏర్పాటు చేశామని, మా తండాల్లో మా రాజ్యం ఉండాలనే గిరిజనుల దశాబ్దాల పోరాటాన్ని సిఎం కెసిఆర్ గమనించి రాష్ట్రంలో కొత్తగా 3416 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా మార్చారని దాని వల్ల దాదాపు 3 వేల మంది సర్పంచులుగా 30 వేల మంది వార్డు సభ్యులుగా గిరిజనులు అయ్యారన్నారు.

విద్యా ఉపాధి రంగంలో గిరిజనులకు న్యాయం జరగాలని 6 శాతం ఉన్న రిజర్వేషన్లు 10 శాతానికి పెంచామన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న 1,51,000 కుటుంబాలకు 4 లక్షల 6 వేల ఎకరాలు భూములు యాజమాన్య పట్టాలు ఇచ్చామన్నారు. సిరిసిల్లలో దాదాపు 1600 మంది గిరిజనులకు 2558 ఎకరాలు పోడు భూములు పట్టాలిస్తున్నామన్నారు. పోడు పట్టాలతో పాటుగా ఈ వానాకాలం సీజన్‌లోనే వారికి రైతు బంధు వారి ఖాతాల్లో పడుతుందని, వారికి గుంట భూమి ఉన్నా రైతు బంధు కూడా అమలవుతుందన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా మన సిఎం కెసిఆర్ ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గూడేలకు కూడా ఇకపై సిఎం కెసిఆర్ ఆసిఫాబాద్‌లో హామీ ఇచ్చినట్లు త్రీ ఫేజ్ కరంట్ వస్తుందన్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనుల గుండె చప్పుడుగా, ఆత్మబంధువుగా సిఎం కెసిఆర్ మారారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో దళితులను ధనవంతులుగా చేసేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టామన్నారు.

దళితబంధు రెండో విడతలో నియోజక వర్గానికి వెయ్యి యూనిట్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. దళిత సమాజంలో పరివర్తన కోసం కృషి చేస్తునానమన్నారు. దళితబంధు మొదటి విడతలో సుస్థిర జీవనోపాది పొందేలా యూనిట్లు మంజూరు చేశామని, దళితబంధు యూనిట్ల ద్వారా సంపద సృష్టించేలా సిరిసిల్ల జిల్లాలో గ్రౌండింగ్ చేశామన్నారు.దళితబంధు పథకాల ఫలితాలు అందుతుంటే సంతోషంగా ఉందన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును ముందుగా ఊహించి తెలంగాణను అభివృధ్ధి చేస్తూ దేశానికే మాడల్ స్టేట్‌గా తెలంగాణను రూపొందించారన్నారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వడంతో లక్షలాది మందికి ప్రయోజనం కలిగిందన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీ అనేది సాహసోపేతమైన చర్య అని దేశంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను కేవలం సిఎం కెసిఆర్ ఒక్కడు మాత్రమే తీసుకోగలడన్నారు. ఈ విషయంలో సిఎం కెసిఆర్‌ను మించిన వారు ఎవరూ లేరన్నారు.

1,50,000 మందికి ప్రయోజనం కలిగేలా 4 లక్షల 6 వేల ఎకరాలకు పైచిలుకు భూమిని పోడు పట్టాలిస్తూ వెంటనే రైతు బంధు అమలు చేయడం గొప్ప సాహసోపేత చర్య అన్నారు. గిరిజన పిల్లలకు మంచి విద్యకోసం ఆశ్రమ పాఠశాలల్లో 1,60,000 మంది విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారన్నారు. గిరిజనులు గొప్పగా చదువుకుని కలెక్టర్లు, ఎస్‌పిలు, ఇతర ఉన్నతోద్యోగాలు సంపాదించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు చెన్నమనేని రమేష్‌బాబు, జడ్‌పి చైర్‌పర్సన్ ఎన్ అరుణ, రాష్ట్ర పవర్‌లూమ్‌అండ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్‌పి అఖిల్ మహజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జడ్‌పి సిఇఓ గౌతం రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటుగా జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News