Sunday, April 28, 2024

యాంటీబాడీల్లో కొవిషీల్డ్ కింగ్

- Advertisement -
- Advertisement -

More Antibodies with CoviShield than Covaxin

 

కొవాగ్జిన్‌తో పోల్చితే అధికంగా ఉత్పత్తి
కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో 98.1%, కొవాగ్జిన్ లబ్ధిదారుల్లో 80% యాంటీబాడీలు
టీకాలు తీసుకున్న వారిలో మరణాలు జీరో
పాన్ ఇండియా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కన్నా కొవిషీల్డ్ తోనే ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం కేవలం ప్రీప్రింట్ రూపంలో ఉన్న ఈ అధ్యయనాన్ని నిపుణులు పూర్తి స్థాయిలో సమీక్షించ వలసి ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ టీకాను భారత్ లోని పుణెలో సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తుండగా, స్వదేశీ టీకా కొవాగ్జిన్‌ను ఐసిఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదారాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయా రు చేస్తోంది. ఈ రెండు టీకాలు అద్భుతమైన రీతి లో రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నాయి. అయితే కొవిషీల్డ్ ద్వారా యాంటీబాడీల సగటు ఉత్పత్తి స్థాయి అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.

ఈ రెండు టీకాలు తీసుకున్న వైద్యఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీల స్థాయిని బట్టి పరిశోధకులు అంచనాకు వచ్చారు.  భారత్‌లో వైద్యులు, నర్సులతో కూడిన పాన్ ఇండియా అధ్యయన బృందం డాక్టర్ ఎకె సింగ్ నాయకత్వంలో ఈ అధ్యయనాన్ని చేపట్టింది. మొత్తం 515 మంది ఆ రోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 305 మంది పురుషులు, 210 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 425 మంది కొవిషీల్డు తీసుకోగా, వీరిలో 98.1 శాతం , అలాగే కొవాగ్జిన్ తీసుకున్న 90 మందిలో 80 శాతం సెరో పాజిటివిటీ ( ఎక్కువ యాంటీబాడీలు ) కనిపించాయి.

సెరోపాజిటివిటీ రేట్లు, సగటు యాంటీస్పైక్ యాంటీబాడీల టైటర్‌ల విషయంలో కొవిషీల్డ్ చాలా మెరుగ్గా ఉన్నట్టు పరిశోధనలో గుర్తించారు. దీనికోసం యాంటీబాడీ టైటర్ బ్లడ్ టెస్టులు చేశారు. దీనివల్ల రక్తంలో యాంటీబాడీల ఉనికితోపాటు వాటి స్థాయి కూడా తెలుస్తుంది. దీని ప్రకారం కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీ టైటర్ 115. ఎయు /ఎంఎల్ (ఆర్బిట్రరీ యూనిట్స్ పెర్ మిల్లీ లీటర్ ) గా ఉండగా, కొవాగ్జిన్ తీసుకున్న వారిలో 51 ఎయు /ఎంఎల్ గా ఉన్నట్టు తేలింది. ఈ విధంగా కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌లో యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువని స్పష్టమైంది. ఇంతే కాకుండా యాంటీ స్పైక్ (స్పైక్ ప్రొటీన్‌ను నిర్వీర్యం చేసే ) యాంటీబాడీల మీడియన్ స్థాయి (ఐక్యుఆర్ ) కొవిషీల్డ్ విషయంలో 127 ఎయు/ఎంఎల్ కాగా, కొవాగ్జిన్ విషయంలో 53 గా నమోదైంది.

బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు
టీకాలు తీసుకున్న వారిలో 4.9 శాతం అంటే 27 బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ( వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వైరస్ సోకడం )గుర్తించారు. 25 మంది స్వల్ప, ఇద్దరికి మోస్తరు లక్షణాలు కనిపించాయి. మరణాలు ఏవీ సంభవించలేదు. కొవిషీల్డ్ విషయంలో 5.5 శాతం బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు, కొవాగ్జిన్‌లో 2.2 శాతం బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. లింగ , బిఎంఈ (బాడీమాస్ ఇండెక్స్), బ్లడ్ గ్రూప్ , దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి తేడా లేకపోయినా, 60 ఏళ్లు పైబడినవారు, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో మాత్రం సెరోపాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అహ్మదాబాద్ విజయరత్న డయాబెటిస్ సెంటర్, కోల్‌కతా జి.డి ఆస్పత్రి , డయాబెటిస్ ఇనిస్టిట్యూట్, ధన్‌బాద్ డయాబెటిస్, హార్ట్ రీసెర్చి సెంటర్, రాజస్థాన్ ఆస్పత్రి, జైపూర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి కి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News