Monday, April 29, 2024

మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు దగ్గరలో ఫార్మా సిటీ ఉందని, మరొకచోట ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారిగా గుర్తించాలని ప్రధాని మోదీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా కాపర్, జింక్, ఇతర విష పదార్థాలు మూసీనది నీటిలో మోతాదుకు మించి కలుస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కోరానని, తన విజ్ఞప్తులకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు.
ఆలయాల రహదారి పనులను పూర్తి చేయాలని వినతి
అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గౌరెల్లి జంక్షన్-కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్లు ఆయన తెలిపారు. వలిగొండ, పోచంపల్లి, తిరుమలగిరి, తొర్రురు, నెల్లికుదురు, మహబూబబాద్, ఇల్లందు మీదుగా హైదరాబాద్-కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంట్ పరిధిలో ఈ జాతీయ రహదారి వంద కిలోమీటర్లు ఉంటుందని, 2016లోనే డిపిఆర్ సిద్ధం చేశారని, నేటికి పనులు మొదలు కాలేదని ఆయన తెలిపారు. 2019లో ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించారని కానీ ఇప్పటి వరకు నెంబరింగ్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన తండాలు, భద్రాచలం దేవస్థానాలు ఉన్న రహదారి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి లేఖను ప్రధాని మోదీకి అందజేసినటట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

MP KomatiReddy Venkat Reddy meets PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News