Sunday, April 28, 2024

గిరిజన జాతి బిడ్డల సంతోషమే నా లక్షం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : అచ్చంపేట నల్లమల ప్రాంత గిరిజన ఆదివాసుల, ఎరుకల బిడ్డల లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారి సంతోషమే నా ఏకైక లక్షమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరవ్వగా చెంచు చిన్నారులు వారి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసులు, గిరిజనుల తండాలకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యంగా జరిగే విధంగా వాళ్లే తండాలను అభివృద్ధి చేసే విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సిఎంకె దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అన్ని కులాలు, మతాలకు సంబంధిత ప్రజలకు గౌరవం ఇచ్చే విధంగా పండుగలను ప్రభుత్వ పరంగా పండుగలు నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి గతంలో ఉన్న ఆరు శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్కువ సీట్లు పొంది గిరిజన విద్యార్థులు రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన మాట వాస్తవం కాదా అని గిరిజన నాయకులను సూటిగా ప్రశ్నించారు. నగరంలో అన్ని కులాలకు గౌరవంగా భవన్‌లను నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందన్నారు.

గిరిజన బిడ్డలు అందరు సంతోషంగా ఉండే విధంగా అవసరమైతే నా ప్రాణాలైనా అర్పిస్తానని అన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ల తండాలను వాళ్లే అభివృద్ధి చేసే విధంగా వాళ్లకే అధికారం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందన్నారు. అచ్చంపేట ప్రాంతంలో ఉమ్మడి మండలాలైన అమ్రాబాద్, పదర మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో కృష్ణా జలాలతో రైతుల పాదాలను కడుగుతామన్నారు.

గతంలో గురుకులాల్లో దొడ్డు బియ్యం, అరకొర కూరగాయలతో హాస్టల్లో వసతి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఎస్టి గురుకులాల్లో ఎస్టి బిడ్డలకు సన్న బియ్యంతో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని అన్నారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ రూపకల్పన చేసిన సంక్షేమ పథకాలను రాష్ట్రాలతో పాటు దేశం అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఇక్కడ కూడా అవలంభిస్తే మేలు జరుగుతుందని ఆలోచనలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం దేశంలో నేడు అగ్రగామిగా అవతరించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గంలో గులాబి జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, డిఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, డిటిడబ్లూ కమలాకర్ రెడ్డి, ఆర్డిఓ పాండు నాయక్, సీనియర్ నాయకులు మనోహర్, మున్సిపల్ చైర్మెన్ నరసింహా గౌడ్, జెడ్పిటిసి మంత్రి నాయక్, జెడ్పిటిసి రాంబాబు నాయక్, గిరిజన సంఘం నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు,గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News