Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్త కేసులు 17

- Advertisement -
- Advertisement -

 Corona cases

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు ఉన్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీనిలో 21 నుంచి 30 మధ్య గల వయస్సు వారిలోనే ఎక్కువగా వైరస్ సోకడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 0..5 ఏళ్ల వారు 5 శాతం ఉండగా, 6 నుంచి 10 సంవత్సరాల వాళ్లు 4 శాతం, 11 నుంచి 20 ఏళ్ల వారు 13 శాతం, 21 నుంచి 30 ఏళ్ల వారు 21 శాతం, 31 నుంచి 40 ఏళ్ల వారు 19 శాతం, 41 నుంచి 50 శాతం వారు 15 శాతం, 51 నుంచి 60 ఏళ్ల వారు 14 శాతం, 61 నుంచి 70 ఏళ్ల వారిలో 7 శాతం, 71 నుంచి 80 ఏళ్ల వారిలో 2 శాతంగా వైరస్ సోకినట్లు బులిటెన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 17 కేసులు నమోదు కాగా, ఒకరి మృతి చెందారని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 15 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో రెండు నమోదయ్యాయి. అయితే వైరస్ బారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని శనివారం మరో 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య1061కి చేరగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 499కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 533 ఉండగా, కరోనా మరణాలు 29కి పెరిగాయి.

హైదరాబాద్‌లో 19 కంటెన్మెంట్లు ఎత్తివేత….
రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే 14 రోజులుగా కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో అధికారులు కంటైన్‌మెంట్లను ఎత్తివేస్తున్నారు. ఈక్రమంలో శనివారం మరో 19 కంటైన్‌మెంట్లను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత వారం రోజులుగా ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదు కాలేదని, దీనిలో భాగంగానే తొలగించినట్లు అధికారులు తెలిపారు.

కరోనా బారిన పడ్డ యూనాని వైద్యుడు…
హైదరాబాద్‌లోని ఓ యునానీ వైద్యుడు కరోనా బారినపడ్డాడు. మంగళహాట్‌లోని న్యూ ఆగాపురకు చెందిన యునానీ వైద్యుడు న్యూ ఉస్మాన్‌గంజ్‌లో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా క్లినిక్ మూసేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, గత నెల 29న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయనకు కరోనా సోకినట్టు శుక్రవారం ఉదయం నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబ సభ్యులతోపాటు వాచ్‌మెన్‌ను స్వెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ఆయన నివసించే ఆగాపురలోని ఇంటిని జీహెచ్‌ఎంసీ, పోలీసులు అధికారులు సెల్ఫ్ క్వారంటైన్‌గా ప్రకటించారు.

కరోనా భయంతో ఆత్మహాత్య…..
కరోనా సోకిందేమోనన్న భయంతో ఓ వ్యక్తి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామంతాపూర్‌లో చోటు చేసుకుంది. వి.కృష్ణ మూర్తి (60) అనే వ్యక్తి రామాంతపూర్‌లోని వీఎస్ అపార్ట్‌మెంట్‌లో 3 అంతస్తులో ఉంటున్నాడు. ఆయనకు ఎసిడిటీ సమస్య ఉంది.

వైద్యులను సంప్రదించి మెడిసిన్స్ వాడేవారు. కానీ కొన్ని రోజులుగా ఆయనకు పదే పదే ఆయాసం వస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో తనకు కూడా ఆ వైరస్ సోకిందేమోనని భయపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఆయనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. అయినా ఆయనలో భయం తగ్గలేదు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈక్రమంలో శనివారం ఉదయం గాంధీ ఆసుపత్రికి వెళ్దామని కుటుంబ సభ్యులు సిద్ధమవుతుంటే, మరోవైపు బాల్కనీలోకి వచ్చిన కృష్ణ మూర్తి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

Newly registered 17 Corona cases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News