Saturday, April 27, 2024

80% కేసుల్లో లక్షణాలే లేవు!

- Advertisement -
- Advertisement -

 

ముంబయి/జైపూర్: దేశమంతా కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఇప్పుడది కంటికే కాదు వైద్యులకు కూడా అంతుపట్టనిదిగా మారిపెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడేలా చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారిలో 80 శాతం మందిలో ఆ లక్షణాలేమీ పైకి కనిపించడం లేదని, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి అలాంటి వారే కారణమవుతున్నారని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ లక్షణాలు కనిపించకపోవడం, ఒక వేళ ఉన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండడం కారణంగా అవి కరోనా లక్షణాలుగా భావించకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఇతరుల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు. అందువల్లనే ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంది.

దేశవ్యాప్తంగా 26 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో నాలుగో వంతుకు పైగా అంటే 7,628 కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూశాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం ఒక్క ముంబయి నగరానికి చెందినవే కావడం గమనార్హం. కాగా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అంశంపై ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ థాక్రే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సొంత వైద్యం కాకుండా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే కొన్ని రంగాలను తిరిగి ప్రారంభించబోతున్నామని, ఈ ప్రణాళికపై ఈ రోజు సాయంత్రం తాను అధికారులతో చర్చించనున్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అత్యవసరంగా ప్రారంభం కావలసిన కొన్ని రంగాలను కూడా ఆయన ప్రస్తావించారు.‘ డాక్టర్లు తమ క్లినిక్‌లను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

అలాగే డయాలసిస్ సెంటర్లు కూడా ప్రారంభం కావలసి ఉంది’ అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే ముంబయిలో రద్దీ మళ్లీ పెరిగిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదని, అందువల్ల ప్రజలు ఇబ్బంది పడ్డా ఓపికతో దానికి సహకరించక తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసులు పెరక్కుండా చూడడంతో పాటుగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అనేది చాలా సున్నితమైన అంశం అని అంటూ, రాబోయే మూడు నాలుగు నెలలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ‘ఈ రాష్ట్రబాధ్యత మాపై ఉంది. ఇది ఓపికతో ఉండాల్సిన సమయం. మనం వైరస్‌ను పూర్తిగా నాశనం చేయక తప్పదు’అని ఉద్ధవ్ థాక్రే చెప్పారు.
రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి

ఇక రాజస్థాన్‌లో కూడా కరోనా బాధితుల విషయం ఇలానే ఉందని వైద్యులు అంటున్నారు. ఇక్కడ రోజురోజుకు కొత్త కేసు లు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో అసలు ఆ లక్షణాలున్నట్లే కనిపించడంలేదని, అందుకే రాష్ట్రంలో వైరస్ సమూహ వ్యాప్తి స్థాయిని చేరుకుంటోందని వారంటున్నారు. వైరస్ సోకినవారి లో ఆ లక్షణాలు కనిపించకపోవడంతో వారు సమాజంలోని ఇతర వర్గాలకు ఈ వైరస్ వ్యాపిత చెందడానికి కారణమవుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ‘రాష్ట్రంలో కరోనా బాధితుల్లో దాదాపు 80 శాతం మంది లక్షణాలు పైకి కనిపించని వారే’నని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కెకె శర్మ అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలించిన పక్షంలో జనం ఒక చోటునుంచి మరో చోటికి ప్రయాణించడంతో ఇలా వైరస్ వ్యాప్తి చేసే వారి వల్ల దాన్ని కట్టడి చేయడం కష్టమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్పారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి సూచించిన నిబంధనలను కచ్చితంగా పాటించడం ఒక్కడే తగిన మార్గమని జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆస్పత్రిలో మెడిస్ విభాగం చీఫ్ ఎస్ బెనర్జీ అంటున్నారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయని పక్షంలో ఇది ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉందో తెలుసుకోవడం కష్టమవుతుందని, ఫలితంగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

అయితే వైరస్ లక్షణాలు పైకి కనిపించకుండా ఉంటున్న వారు ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నప్పటికీ, వీరినుంచి వైరస్ సోకిన వారిలో లక్షణాలు తక్కువ మోతాదులో ఉంటాయని, చాలా మంది చికిత్స అవసరం లేకుండానే కోలుకోవడం జరుగుతుందని ప్రముఖ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు, కోవిడ్19పై ముఖ్యమంత్రి సలహా కమిటీ సభ్యుడు వీరేంద్ర సింగ్ అంటున్నారు. ఇది ఒక సానుకూల అంశమని ఆయన చెప్తున్నారు. రాజస్థాన్‌లో వంద కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు ఆరు ఉన్నాయి. అవి జైపూర్ (799), జోధ్‌పూర్(341), టోంక్ (115), కోటా(152), భరత్‌పూర్ (109), అజ్మీర్ (123).

No symptoms in corona patients in india
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News