Monday, April 29, 2024

చిన్నప్పుడు రామాయణం, భారతం విన్నా

- Advertisement -
- Advertisement -

Obama claimed to have heard Ramayana and Mahabharata

 

అందుకే భారత్‌పై ప్రత్యేక గౌరవం
‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఒబామా

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ కారణంగా చర్చలోకి వచ్చారు. ఈ పుస్తకంలో ఒబామా జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలున్నాయి. దీంతో ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే ఎంతో ఆదరణపొందింది. ఈ పుస్తకంలో ఉన్న మరో విషయం భారతీయులకు ఆసక్తికరంగా మారింది. తాను బాల్యంలో భారత ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు విన్నానని ఒబామా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తాను చిన్నతనంలో ఇండొనేసియాలో ఉన్నప్పుడు రామాయణం, మహాభారతంతోని కథలను విన్నానని, ఫలితంగా తనకు భారత దేశంపై ప్రత్యేక గౌరవం ఏర్పడ్డాయని ఒబామా తెలిపారు.

భారత దేశ భౌగోళిక స్వరూపం తనను ఎంతగానో ఆకర్షించిందని, ప్రపంచ జనాభాలో అత్యధికులు భారత్‌లో ఉంటారని, అలాగే విభిన్న జనజాతుల సముదాయం ఉంటుందన్నారు. భారత్‌లో 700కు పైగా భాషలు కూడా ఉన్నాయన్నారు.2010లో అమెరికా అధ్యక్షుడిగా తాను తొలిసారి భారత్ వెళ్లానని, అంతకు ముందు ఎప్పుడూ వెళ్లలేదని పేర్కొన్నారు. తాను ఇండోనేసియాలో చదువుకుంటున్న రోజుల్లో భారత్, పాకిస్థాన్‌లకు చెందిన మిత్రులు ఉండేవారన్నారు. అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు కూడా చూశానన్నారు.

ఎలా చూసినా భారత్‌ది ఓ విజయగాథే

అనేక అంశాల్లో భారత్‌ది ఓ విజయగాథగా పరిగణించవచ్చని ఒబామా అన్నారు. రాజకీయపరమైన వైరుధ్యాలు, వివిధ సాయుధ వేర్పాటు ఉద్యమాలు, అవినీతి కుంభకోణాలు ఉన్నప్పటికీ భారత్‌ను ఓ విజయవంతమైన దేశంగా పేర్కొనవచ్చన్నారు. గాంధీజీ తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారన్నారు.‘ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు భారత్ పట్ల మక్కువ కలగడానికి కారణం మహాత్మాగాంధీ. అబ్రహాంలింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాతో పాటుగా గాంధీజీ నా ఆలోచనలను ప్రభావితం చేశారు. ఓ యువకుడిగా ఆయన రచనలను అధ్యయనం చేస్తుంటే నాలోని లోతైన భావాలకు స్వరం ఇస్తున్నట్లు అనిపించేది.

గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహం, సత్యనిష్ఠ, మనస్సాక్షిని కదిలించే అహింసామార్గం, మతపరమైన ఐక్యత, ప్రతి ఒక్కరికీ సమమాన గౌరవం దక్కేలా రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఏర్పాట్లు చేయాలన్న పట్టుదల నాలో ప్రతిధ్వనించేవి. గాంధీజీ పోరాటం కేవలం భారత్‌కు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిందని ఒబామా గుర్తు చేశారు. అమెరికాలో నల్ల జాతీయులు తమ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటానికి దారి చూపిందన్నారు.2010లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ముంబయిలోని గాంధీజీ నివాసం మణి భవన్‌లో గడిపిన క్షణాలను ఒబామా తన పుస్తకంలో ఉద్వేగభరితంగా ప్రస్తావించారు.

అసాధారణ ప్రతిభ కల నిరాడంబరుడు మన్మోహన్

1991లో విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా చేపట్టిన సంస్కరణలు భారత్‌ను కొత్త పుంతలు తొక్కించాయని ఒబామా అభిప్రాయపడ్డారు. ఆ చర్యలే సాంకేతికాభివృద్ధి, వృద్ధిరేటు పరుగులు, మధ్యతరగతి జనాభా పెరుగుదలకు కారణంగా నిలిచాయని విశ్లేషించారు. భారత దేశ ఆర్థిక పరివర్తనకు ప్రధాన కారకుడుగా మన్మోహన్ సింగ్‌ను అభివర్ణించిన ఒబామా.. ఆయన దేశ పురోగతికి ప్రధాన చిహ్నంగా కనిపిస్తారని కొనియాడారు. అత్యంత నిరాదరణకు గురైన సిక్కు మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్.. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారన్నారు. అలాగే ప్రజారంజక పథకాలతో మభ్యపెట్టకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగునర్చడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొన్నారన్నారు.

చిన్న అవినీతి మరక కూడా లేకపోవడం ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిందన్నారు. తొలి పరిచయంలోనే అసాధారణ్ర పతిభకల నిరాడంబర వ్యక్తిగా కనిపించారన్నారు. ఆఫ్‌ది రికార్డ్‌లో మన్మోహన్ తనతో అన్న కొన్ని ఆసక్తికర మాటలను ఒబామా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ‘ మిస్టర్ ప్రెసిడెంట్.. అనిశ్చితి నెలకొన్న సమయంలో జాతి, మతపరమైన అంశాలకు సంఘీభావం తెలపడం వల్ల అది ప్రజలపై ఓ మత్తులా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని భార దేశంలో కానీ, మరే దేశంలో నైనా రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకు వాడుకోవడం అంత కష్టమైన అంశమేమీ కాదు’ అని మన్మోహన్ తనతో అన్నట్లు ఒబామా గుర్తు చేసుకున్నారు.

లాడెన్‌పై దాడిలో పాక్‌సాయం లేదు

అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌భైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాకిస్థాన్‌నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని ఒబామా స్పష్టం చేశారు. పాక్ మిలిటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమని, అలాంటప్పుడు పాక్‌నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఒబామా అభిప్రాయపడ్డారు. బిన్ లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి ఒబామా తన పుస్తకంలో వివరంగా ప్రస్తావించారు. అబొటాబాద్‌లోని పాక్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ దాక్కున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం వచ్చిందని, లాడెన్‌పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలనిపించి వెంటనే కార్యాచరణకు దిగామని తెలిపారు. అయితే లాడెన్‌పై తాము ఎలాంటి చర్య తీసుకున్నా దాన్ని రహస్యంగా ఉంచడం తమ ముందున్న అతిపెద్ద సవాలని, ఎందుకంటే దీనిపై ఏ చిన్నపాటి సమాచారం లీకయినా గొప్ప అవకాశం కోల్పోతామని తమకు బాగా తెలుసునని అన్నారు.

అంతేకాదు, ఈ ఆపరేషన్ గురించి పాకిస్థాన్‌కు ఏమైనా చెబితే అది లాడెన్‌కు చేరే అవకాశమున్నందున ఎట్టి పరిస్థితుల్లోను పాకిస్థానీలను దీనిలో భాగస్వాములను చేయకూడదని నిర్ణయించుకున్నామన్నారు. సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా తమ ముందున్న రెండు మార్గాల గురించి చర్చించుకున్నామని తెలిపారు. వాటిలో మొదటిది లాడెన్ ఉంటున్న కాంపౌండ్‌ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయడం, రెండవది ప్రత్యేక కమాండో దాడి. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ తాము రెండో ఆప్షన్‌నే ఎంచుకున్నామని ఒబామా తెలిపారు.

కాగా కమాండో ఆపరేషన్ విజయవంతమైన తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతలనుంచి అనేక ఫోన్‌కాల్స్ వచ్చాయని, చివరికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఆపరేషన్‌పై అభినందనలు తెలపడమే కాక, మద్దతు తెలియజేయడం తనకు ఎంతోసంతోషం కలిగించిందంటూ ఒబామా ఆ నాటి ఘటనలను తన పుస్తకంలో రాసుకొచ్చారు. అమెరికా ట్విన్ టవర్స్‌ను కూల్చి దాదాపు 3 వేల మందిని పొట్టన పెట్టుకున్న అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు మతమార్చిన విషయం తెలిసిందే. పాక్‌లోని అబొటాబాద్ కాంపౌండ్‌లో లాడెన్‌ను యుఎస్ నేవీ సీల్ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News