Monday, April 29, 2024

ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రగామి

- Advertisement -
- Advertisement -

Oil palm cultivation is commendable:Tomer

ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్ర ప్రణాళిక భేష్
అతి తక్కువ కాలంలో రికార్డుస్థాయిలో ఆయిల్‌పామ్ సాగు అభినందనీయం
కేంద్రం తరఫున మద్దతు ఇస్తాం
హెచ్‌ఐసిసి వేదికగా ఆయిల్‌పామ్ బిజినెస్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి తోమర్ ప్రశంసలు
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు లక్షం 30లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రత్యామ్నాయ పంటలసాగును ప్రోత్సహించడంలో తెలగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక భేషుగ్గాఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కితాబిచ్చారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా తెలంగాణలో ఆయిల్‌పాయ్ సాగును అతితక్కువ కాలంలో రికార్డు స్థాయిలో చేపట్టడం అభినందనీయం అని కేంద్ర మంత్రి అన్నారు. మంగళవారం హెదరాబాద్ హెచ్‌ఐసిసి వేదికగా ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్‌ను కేంద్ర మంత్రి తోమర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకుదేలైందన్నారు. భారత్‌లో మాత్రమే వ్యవసాయ వృద్ధి ఆగలేదన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు కోసం కలిసి పనిచేయాలని రాష్ట్రాలను కోరారు. సేంద్రీయ సేద్యంపై దృష్టి సారించాలన్నారు.

దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.దేశంలో ప్రస్తుతం 3లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ పంట సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నివలబోతోందని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు. విత్తన లభ్యత ,సాంకేతిక మద్దతు , కోనుగోలు కేంద్రాల ఏర్పాటు, మిల్లుల ఏర్పాటు వంటి అంశాలపైన ప్రధాన పెట్టుబడులను పెడుతున్నట్టు వెల్లడించారు. ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దుత ఇస్తుందని ప్రకటించారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచే విధంగా చర్యలను వేగవంతంగా తీసుకోవాలన్నారు. సహజ, ప్రకృతి, సేంద్రీయ సాగుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళుతున్నాయని కేంద్ర మంత్రి తోమర్ పేర్కొన్నారు.

వంటనూనెల కోసమే మిషన్: కైలాష్ చౌదరి

వంటనూనెల కోసమే కేంద్రం ప్రత్యేకంగా మిషన్ అమలు చేస్తోందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కౌలాష్ చౌదరి వెల్లడించారు. వంటనూనెల విషయంలో ఆత్మరిర్భర్ చేయడం కోసం దాదాపు రూ.11వేల కోట్లతో నేషనల్ మిషన్ చేపట్టామన్నారు.ఇందులో రూ.2200కోట్లు రాష్ట్రాలు భరిస్తాయని తెలిపారు. ప్రభుత్వం, పరిశోధన రంగాలు ,రైతులు కలిసి ఈ ప్రణాళికను విజయవంతం చేయాలని సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయటంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని మంత్రి కౌలాష్ చౌదరి స్పష్టం చేశారు.

పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నాం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల్లో అవగాహన పెంచుతూ పెద్ద ఎత్తున పంటల మార్పిడిని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో వ్యసాయరంగం అభివృద్ధికి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.2014 -2015 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్టంలో 122 లక్షల ఎకరాలు ఉన్న పంటల సాగు 2020 -21 నాటికి 203 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

2014 -2015లో 68.2 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం దిగుబడి 2020 -21కి 259.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. సాగు నీటి వసతిని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున .. ఏడాదికి రెండు సార్లుగా ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతున్నదని తెలిపారు. కేంద్రం వంటనూనెల దిగుమతి కోసం ఏటా రూ.లక్ష కోట్లు వెచ్చిస్తున్న పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించిందని వెల్లడించారు.

పామాయిల్ దేశీయ డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి సాధించాలంటే దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలు అత్యధిక నూనె ఉత్పత్తి శాతం కలిగిఉన్నవని, దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 19.22 శాతం నూనె ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు.ఆయిల్‌పామ్ అభివృద్దికోసం రాబోయే ఐదేళ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలు కేటాయించిందన్నారు.

ఆయిల్ పామ్ లక్ష్యం 30 లక్షల ఎకరాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను 30లక్షల ఎకరాలకు పెంచుతున్నామని , దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలనికోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న అయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ కింద ఆమోదించి నిధులు కేటాయించాని కేంద్ర మంత్రి తోమర్‌కు విజ్ఱప్తి చేశారు.ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ధర టన్నుకు రూ.15000 కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరారు.

తెలంగాణ డిమాండ్లపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.ప్రతిష్టాత్మక ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ ను హైదరాబాద్ లో జరిపినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి వాగ్ధానం చేశారు. అంతకు ముందు కేంద్ర మంత్రి తోమర్ ఆయిల్ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్, కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, తెలంగాణ ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఐసిఏఆర్ డిజి త్రిలోచన్ మహాపాత్ర, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News