Monday, April 29, 2024

పాక్ కవ్వింపులు

- Advertisement -
- Advertisement -

On the border Pakistani army opened fire on India territory

 

సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని ఉగ్రమూకలు మన దేశంలోకి చొచ్చుకు వస్తాయన్నది పదేపదే నిరూపణ అవుతున్న వాస్తవం. అందువల్ల అధీన రేఖ (ఎల్‌ఒసి) వద్ద పాక్ సైనికుల ఉల్లంఘనలు అదే పనిగా సాగుతూ ఉంటాయి. ఈసారి మాత్రం అవి మోతాదు మించాయి. మొన్న శుక్రవారం నాడు అటునుంచి సాగిన కవ్వింపు కాల్పుల్లో భారత సైన్యం ప్రతీకార దాడుల్లో చాలా రక్తం ప్రవహించింది. పాక్ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు, ఆరుగురు పౌరులు మృతి చెందగా, భారత్ సమాధాన దాడిలో ఎనిమిది మంది పాక్ సైనికులు హతమయ్యారని వార్తలు చెబుతున్నాయి. మన సేనలు పాక్ సైనిక స్థావరాలపై గురిపెట్టి దాడులు జరిపినందున అక్కడి బంకర్లు ఇతర నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈసారి పాక్ సేనల సరిహద్దు ఉల్లంఘనలకు కొంత ప్రత్యేకత ఉన్నది. అటు లడఖ్ వద్ద సరిహద్దులలో చైనా అకారణంగా మనపై కాలు దువ్వుతూ తన విస్తరణవాద వికృత స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నది.

1962 యుద్ధం తర్వాత ఇంత వరకు ఎన్నడూ జరుగని రీతిలో రెచ్చిపోయింది, ఉద్రిక్తతను సృష్టించింది. అదే సమయంలో పాక్ ఇలా తెగబడడం యాదృచ్ఛిక పరిణామం కాదని భావించవలసి ఉంది. ఈసారి పాక్ దుస్తంత్రాన్ని దీటుగా ఎదుర్కోవడం ద్వారా భారత సేనలు చైనాను సైతం హెచ్చరించాయని చెప్పవచ్చు. గత ఏడేళ్లుగా ఎరుగనంత ఎక్కువగా ఈ ఏడాది పాక్ సైనికులు సరిహద్దు ఉల్లంఘనలకు బరి తెగించడం వెనుక చైనాతో కలిసి మనను పదేపదే చీకాకుకు గురి చేయాలన్న దుష్ట సంకల్పం ఉండవచ్చు. శుక్రవారం నాటి ఘర్షణల తర్వాత భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని పాక్ సీనియర్ దౌత్యవేత్తను పిలిపించుకొని నిరసన తెలిపింది. పాక్ సైనికుల కవ్వింపు కాల్పులను, మన దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు అదే పనిగా అది ఇస్తున్న మద్దతును తీవ్రంగా ఖండించింది. ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి, సైనిక ప్రతినిధి ఉమ్మడిగా మీడియా గోష్ఠి నిర్వహించి మనపై అభాండాలు వేశారు. తమ దేశంలో జరిగిన కొన్ని ఉగ్ర దాడుల వెనుక భారత దేశం హస్తమున్నదని ఆరోపించారు. అందుకు ఆధారాలంటూ కొన్ని పత్రాలను చూపారు. ఐక్యరాజ్య సమితి టెర్రరిస్టు సంస్థలుగా గుర్తించిన వాటితో భారత నిఘా వర్గాలకు సంబంధాలున్నాయని బురద చల్లారు.

అంతేకాకుండా చైనా, పాకిస్థాన్ ఆర్థిక నడవ (కారిడార్) ను దెబ్బ తీసేందుకు భారత్ కుట్రపన్నిందని కూడా అన్నారు. మన భూభాగంలోకి ఉగ్రవాదులను నిర్విరామంగా పంపిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ఎదుట మనల్ని దోషుల్నిగా చూపడానికి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం కొత్త కాదు. ఈసారి పాక్‌లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల మీదికి కూడా ఉగ్రవాదులను భారత్ ఉసిగొల్పుతున్నదని ఆరోపించడం గమనించవలసిన విషయం. మనను ఇబ్బందులకు గురి చేసే నిర్వాకంలో చైనా మద్దతును మరింతగా కూడగట్టుకోడానికి పాకిస్థాన్ కుట్రపన్నుతున్నదని అర్థమవుతుంది. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరంగా మారిపోయిందని, రౌడీ దేశంగా తయారయిందని ప్రపంచమంతా ఒక్క కంఠంతో ఎత్తిచూపిన సందర్భాలున్నాయి. ఆ మచ్చను తొలగించుకునే విఫలయత్నంలో అది మనకున్న ప్రజాస్వామిక నేపథ్యాన్ని, చైతన్యాన్ని కూడా మసకబార్చాలనుకుంటున్నది. అందుకు చైనా అండ తీసుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచం దృష్టికి మరింత స్పష్టంగా తీసుకు వెళ్లాలి.

2008 ముంబై ఉగ్ర దాడులలో పాకిస్థాన్ పాత్ర ఉన్నదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 2018లో స్వయంగా కుండబద్దలు కొట్టారు. అంతెందుకు, తమ దేశంలో 3000 నుంచి 4000 మంది సాయుధ ఉగ్రవాదులున్నారని ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అమెరికాకు తెలియజేశారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల స్థావరమని అమెరికా తన అధికారిక నివేదికల్లో పేర్కొన్నది. అందుచేత పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం స్వదేశంలో ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించడానికి చైనా మద్దతుతో సరిహద్దులను మరింత ఉద్రిక్తం చేసే ప్రమాదం ఎప్పటి కంటే ఎక్కువగా ఉంది. నిరంతరం అప్రమత్తంగా ఉండడం పాక్ కుట్రలను ప్రపంచం దృష్టికి ఎప్పటికప్పడు తీసుకెళుతూ ఉండడం అవసరం. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అక్కడి స్థానిక రాజకీయ శక్తులతో కేంద్రానికి ఏర్పడిన దూరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మరింత జాగరూకతతో వ్యవహరించవలసిన సందర్భమిది. శత్రువుల ఎత్తుగడలను వారికి మించిన బలంతో, తెలివితేటలతో చిత్తు చేస్తూనే సరిహద్దులలో ఉద్రిక్తతలు హద్దు మీరకుండా చూడడానికి మనవంతు పాత్రను మనం ప్రపంచం హర్షించేలా పోషించవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News