Sunday, April 28, 2024

ఇవి గాడ్సే రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

Gandhiji

 

గాంధీజీపై అనంత్‌కుమార్ వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్షాల తీవ్ర నిరసన
దద్దరిల్లిన సభ
నేనలా అనలేదు, అపాదించారు : పార్టీకి సమాధానంలో అనంత్‌కుమార్

జాతిపితపై హెగ్డే వ్యాఖ్యలకు..
ప్రతిపక్షాల ఆగ్రహం.. దద్దరిల్లిన లోక్‌సభ

‘గాంధీని అవమానించేవారు రావణుడి వారసులు’, కాంగ్రెస్ నాయకుడు అధిర్ తీవ్ర వ్యాఖ్య
ఆయన వ్యాఖ్యలు తొలగించాం : స్పీకర్, అధికార పార్టీపై కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం, వాకౌట్

న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీపై బిజెపి పార్లమెంట్ సభ్యుడు అనంత్‌కుమార్ హెగ్డే బెంగళూరులో ఒక కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంగళవారం లోక్‌సభలో దుమారం రేపాయి. అధికారపక్షం ‘గాడ్సే రాజకీయాలు’ చేస్తున్నదని దుయ్యబడుతూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు హెగ్డే వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన తర్వాత కాంగ్రెస్‌పార్టీ సభానాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రపంచమంతా గౌరవిస్తున్న మహాత్మాగాంధీని బిజెపి నాయకుడు అవమానించారని అన్నారు.

చౌదరి ఆ సందర్భంగా హెగ్డేపై విరుచుకుపడుతూ ‘మహాత్మాగాంధీని అవమానించేవారంతా రావణుడి పిల్లలే’ అన్నారు. చౌదరి చేసిన ఈ వ్యాఖ్య రికార్డుల్లో నమోదు కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. కాంగ్రెస్ సభ్యులతో సహా ప్రతిపక్షాలవారు సభా వేదిక లోకి దూకి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తారని భావించాము కానీ వారు మహాత్మాగాంధీని అసహ్యించుకునే వారికే వంతపాడుతున్నారని చౌదరి విమర్శించారు.‘గాడ్సే రాజకీయాలు చేస్తున్న వారినుంచి మేమేమీ ఆశించడం లేదు’ అన్నారు.

నేనలా అనలేదు… ఆపాదించారు : హెగ్డే
తన ప్రసంగంలో ఎక్కడా మహాత్మాగాంధీ పేరు ప్రస్తావించలేదని బిజెపి ఎంపి అనంతకుమార్ పార్టీ నాయకత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతిపితపై తను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాననడం సరికాదని, అవి తనపై ఆపాదించబడినవే అని అనంతకుమార్ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు, పార్టీ క్రమశిక్షణ కమిటీకి హెగ్డే సవివరమైన సమాధానం పంపారని బిజెపి వర్గాలు చెప్పాయి. క్రమశిక్షణ కమిటీ సోమవారం అనంతకుమార్‌కు షోకాజ్ నోటీస్ జారీచేసింది. తదుపరి చర్యను నిర్ణయించే ముందు కమిటీ ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేస్తోంది. తన ప్రసంగంలో మహాత్మాగాంధీ పేరు చెప్పలేదని, ఆయనను అవమానించలేదని, మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తప్పని హెగ్డే పేర్కొన్నారు.

గాంధీ నాయకత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం ‘నాటకం’ వంటి మాటలు అనలేదని కూడా హెగ్డే వివరణ ఇచ్చారు. ‘కేంద్ర మాజీమంత్రి చెప్పింది తప్పే కావచ్చు కానీ కొన్ని మీడియా నివేదికల్లో అసలు విషయాన్ని వక్రీకరించారని అభిప్రాయం పార్టీలో కలిగింది’ అని బిజెపి సీనియర్ నాయకుడొకరు అన్నారు. వీరసావర్కార్‌ను సంస్మరించుకుంటూ బెంగళూరులో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అనంతకుమార్ హెగ్డే కన్నడంలో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో ఏ త్యాగాలూ చేయని కొందరు… గాంధీ ఇష్టపడే ఆందోళనా విధానం ‘ఉపవాస సత్యాగ్రహం’ ద్వారానే స్వాతంత్య్రం వచ్చిందని దేశం నమ్మేలా చేశారని అనంతకుమార్ హెగ్డే చెప్పారు. అలాంటివారు మహాపురుషులయ్యారని వ్యాఖ్యానించారు.

Opposition protest in Lok Sabha comments on Gandhiji
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News