Monday, April 29, 2024

ఎన్‌ఆర్‌సిపై నిర్ణయం తీసుకోలేదు

- Advertisement -
- Advertisement -

NRC

 

ఎన్‌పిఆర్‌కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు

ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం
అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10
నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు
ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు
చేసుకోవచ్చు : పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయి లో ఎన్‌ఆర్‌సి అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సిపై తమ ప్రభుత్వం ఏ నాడూ చర్చించ లేదని ప్రధాని నరేంద్ర మోడీ గత డిసెంబర్ 22న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా ఓ సారి పార్లమెంటులో ప్రకటించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా అనేక సందర్భాల్లో దీన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమైనాయి. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్పట్లో ప్రధాని హామీ ఇచ్చారు.

వివాదాస్పదమైన ఈ అంశంపై తమ ప్రభుత్వం పార్లమెంటులో కానీ, కేబినెట్‌లో కానీ ఏ నాడూ చర్చించలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణ ంగా అసోంలో మాత్రమే దీన్ని అమలు చేశామని చెప్పారు.తాజాగా వీటికి బలం చేకూరుస్తూ లోక్‌సభలో లిఖితపూర్వక ప్రకటన చేశారు. దీంతో రెం డు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రం చెక్ పెట్టే ప్రయత్నం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ జనా భా చిట్టా(ఎన్‌పిఆర్) రూపకల్పన సమయంలో ఎ లాంటి డాక్యుమెంట్లను సేకరించరని, ఆధార్ నం బర్‌ను ఇవ్వడం కూడా ఐచ్ఛికమేనని కేంద్ర ప్ర భుత్వం మంగళవారం స్పష్టం చేసింది. కాగా ఎన్‌పిఆర్ రూపకల్పనకు సంబంధించి అనుమానాలున్న రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరుపుతూ ఉంది. ఎన్‌పిఆర్‌సవరణ ప్రక్రియ సమయంలో ప్రతి కుటుంబం, వ్యక్తికి సంబంధించిన భౌగోళిక, ఇతర వివరాలను మాత్రమే సేకరించడం జరుగుతుంది.

ఎన్‌పిఆర్ 2020 సవరణకు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల కోసం ఒక సూచనల మాన్యువల్‌ను రూపొందించడం జరిగిందని, ఎన్‌పిఆర్‌కోసం ప్రజలు తమకు తెలిసిన, తాము నిజమని నమ్మిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో చెప్పారు. ‘ఎన్‌పిఆర్ సవరణ సమయంలో ఏ డాక్యుమెంట్‌ను తీసుకోవడం జరగదు’ అని ఆయన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. అంతేకాదు పౌరసత్వం అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఎలాంటి వెరిఫికేషన్ చేయడం కూడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కల సేకరణ జరిపే దశలో జాతీయ జనాభా చిట్టాను అప్‌డేట్ చేసే ప్రక్రియను చేపడతారు. ‘ప్రతి కుటుంబం, వ్యక్తికి సంబంధించి నిర్దిష్ట సమాచారం సేకరించడం కోసం ఈ ప్రక్రియ జరుగుతుంది.

వివరాలు ఇచ్చే వ్యక్తి తనకు తెలిసిన వాస్తవ సమాచారాన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది’ అని మంత్రి తన సమాధానంలో తెలియజేశారు. జనాభా చిట్టా అనుది సాధారణంగా ఒక గ్రామం, లేదా గ్రామీణ ప్రాంతం లేదా పట్టణం లేదా వార్డులో నివసించే వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఉండే రిజిస్టర్ మాత్రమేనని కూడా మంత్రి తెలిపారు. జాతీయ పౌర చిట్టాను 2010లో తొలిసారిగా రూపొందించడం జరిగిందని , 2015లో సవరించగా ఇప్పుడు మరో సారి ఏడాది ఏప్రిల్‌నుంచి సెప్టెంబర్ వరకు జరిగే జనాభా లెక్కలసేకరణ సందర్భంగా మరోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. కాగా పౌరసత్వ (సవరణ) చట్టం 2019 ఈ ఏడాది జనవరి10న అమలులోకి వచ్చిందని, పౌరసత్వానికి సంబంధించి తగు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత ఈ చట్టం కిందికి వచ్చే వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు.

No decision has been made on NRC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News