Saturday, May 11, 2024

ప్యాక్స్‌పై గులాబీ గురి!

- Advertisement -
- Advertisement -

primary agricultural cooperative socities

 

905 సంఘాలను కైవసం చేసుకునేందుకు తహతహ
వ్యూహాల్లో నిమగ్నమైన మంత్రులు, ఎంఎల్‌ఎలు, టిఆర్‌ఎస్ నేతలు

హైదరాబాద్: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న అధికార టిఆర్‌ఎస్ ఇప్పుడు ప్యాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో జరగనున్న సహకార ఎన్నికల్లో 905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులను దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు ఒక డైరెక్టర్ పదవి కూడా లభించకుండా చూడాలని అధికార పార్టీ ఉవ్వీలూరుతోంది. టిఆర్‌ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్ధులే సహకార ఎన్నికల్లో గెలిచే విధంగా అప్పుడే జిల్లాల మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు తగు సన్నాహాలు సాగిస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అద్భుతమైన సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూడా గులాబీ విజయం పూర్తిగా ఏకపక్షంగా కొనసాగింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు గానూ 112 మున్సిపాలిటీలను, 10 కార్పొరేషన్లకు పదింటిని టిఆర్‌ఎస్ కైవసం చేసుకుని పురపోరు ఎన్నికల్లో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది. ఈ విజయానందం నుంచి టిఆర్‌ఎస్ నేత లు ఇంకా బయటకు రాకముందే రాష్ట్రంలో ప్యాక్స్ ఎన్నికల నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా తమకు ఎదురులేదన్న విషయాన్ని టిఆర్‌ఎస్ పార్టీ మరోసారి ప్రతిపక్ష పార్టీలకు తమ సత్తాను చాటుకోవాలని తహతహలాడుతోంది. ప్యాక్స్ ఎన్నికల ముంగింపుతో రాష్ట్రంలో ఇంకా మరో నాలుగేళ్ళ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ,మండల ప్రజాపరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసాయి.

అయితే జిహెచ్‌ఎంసి, ఖమ్మం, వరంగల్‌తో పాటు మరో ఒకటి, రెండు కార్పొరేషన్ల మాత్రమే ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు గడువు వచ్చే వరకు దాదాపుగా ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. దీంతో సహాకార సంఘాల ఎన్నికల్లోనూ తాము మద్దతు ఇచ్చిన అభ్యర్ధులను పూర్తిస్థాయిలో గెలిపించుకునే బాధ్యతలను జిల్లాల మంత్రులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. దీంతో ఎన్నికలు జరుగుతున్న 905 సంఘాలను ఏ విధంగా విజయం సాధించాలన్న అంశంపై అప్పుడు జిల్లాల మంత్రులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బరిలో నిలపాల్సిన అభ్యర్ధుల పేర్ల వివరాలను సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. మహిళలు, ఎస్‌సిలు, ఎస్‌టిలకు రిజర్వు అయిన స్థానాల్లో కూడా సమర్ధులైన వారి కోసం వేటను ప్రారంభించారు.

ఇప్పటికే పలు జిల్లాలలో అభ్యర్ధుల ఎంపికపై జిల్లాల మంత్రులు ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఈ పేర్లతో మరోసారి వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసి సదరు అభ్యర్ధులకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత మేరకు ఈ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగా అత్యధిక సంఘాలను గెలుచుకునేందుకు మంత్రులు రంగంలోకి దిగి పక్కాగా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు పురపోరు ఓటమి షాక్ నుంచి ఇంకా బయటపడిన దాఖలాలు కనిపించడం లేదు.

పురపోరులో పార్టీ గుర్తులు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినప్పటికీ అనుకున్న స్థాయిలో వార్డులను, మున్సిపాలిటీలను గెలుచుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీలు గుర్తులు లేకుండా జరిగే ప్యాక్స్ ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువుకాదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. బలమైన అభ్యర్ధులు ఉంటేనే బరిలోకి దించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ప్యాక్స్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలని అధికార టిఆర్‌ఎస్ ఉవ్వీలూరుతుండగా, ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం ఆ ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు.

TRS focuses on primary agricultural cooperative socities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News