Monday, April 29, 2024

దిగ్విజయంగా వర్ధిల్లుతున్న సర్వమత సమానత్వం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఖమ్మం స్తంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం రోటరీ నగర్‌లోని గుడ్ షెఫడ్ చర్చ్, తుమ్మలగడ్డలోని మజీద్- ఏ-అస్టాబల్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ప్రత్యేక పూజలు,ప్రార్ధనలు చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకొని మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సర్వమత సమానత్వం దిగ్విజయంగా వర్దిల్లుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని, ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు.

తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నదన్నారు. భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మిక రంగాల వైభవానికి తెలంగాణ ప్రభుత్వం చేయుత నిస్తుందన్నారు. తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు నెలకు రూ. 2,500 చొప్పున 1805 దేవాలయాలకు చెల్లించేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1840 దేవాలయాలకు ఈపథకాన్ని వర్తింపచేయడంతో మే 2023 నాటికి ఈ పథకం కింద లబ్ధి పొందే దేవాలయాల సంఖ్య 3,645కు చేరిందన్నారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.75 లక్షలను మంజూరు చేసిందని, అపర కర్మ భవనం, మధిర పట్టణంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 73 లక్షలు మంజూరు చేసిందని వివరించారు. దేశమే అబ్బుర పడేవిధంగా యాదాద్రి దేవాలయంను తీర్చిదిద్దారన్నారు. జిల్లాలో 2014 లో 115 డేవాలయాల్లో ధూప, దీప నైవేద్య పథకం అమలులో ఉండగా, నేడు 238 దేవాలయాల్లో అమలవుతుందన్నారు. కొత్తగా మరో 67 దేవాలయాలకు ఈ పథకం మంజూరు కాగా, అట్టి ఉత్తర్వులు సంబంధిత అర్చకులకు అందజేశారు. స్తంభాద్రి ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. 10 నుండి 15 కోట్లు మంజూరు కోరినట్లు మంత్రి తెలిపారు. హిందువులకు ముఖ్యమైన దసరా పండగ సందర్బంగా మహిళలందరికి బతుకమ్మ చీరలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని మంత్రి గుర్తు చేశారు.

  • అధికారికంగా క్రిస్మస్ పండుగ

రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగ్గా గుర్తించి, ప్రతీ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. అంతేకాకుండా చర్చిలలో ఒక్కో చర్చికి రూ.2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం 2022 నుంచి ప్రతి ఏడాది పేద క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తు రాష్ట్ర వ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసిన ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు. క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోకాపేట్‌లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నదన్నారు.

  • అధికారికంగా రంజాన్ వేడుకలు.. తోఫాలు

గంగా జమున తెహజీబ్‌కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, సామాజిక స్వరూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మొహర్రం, పీర్ల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిందన్నారు. అనేక దర్గాలకు హిందువులు సైతం వెళ్తారని, దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. 2015 నుంచి ప్రతీ ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో దావత్-ఇ-ఇప్తార్ కార్యక్రమాన్ని, 2017 నుండి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం మైనార్టీ ఆడ పిల్లల వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించే సదుద్దేశంతో 2014 అక్టోబర్ 2 నుంచి షాదీ ముబారక్ అనే ప్రయోజనాత్మకమైన పథకాన్ని ప్రారంభించి, ఈ పథకం కింద షాదీ సమయంలో వధువుకు రూ. 1,00,116లను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తున్నదన్నారు ముస్లిం అనాథల కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ ఘుర్ నిర్మిస్తున్నారని, ఆయా పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు, మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,000 ల గౌరవ వేతనాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

  • హజ్ యాత్రికుల సంక్షేమం కోసం కమిటీ

హజ్ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు, యోగక్షేమాలను చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని, మక్కా, మదీనాలకు హజ్ యాత్రను నిర్వహించే నిమిత్తం రాష్ట్ర హజ్ కమిటీకి ప్రభుత్వం రూ.3 కోట్ల గ్రాంటును ఇచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, గత 20 రోజులుగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రోజు ఒక విభాగంలో గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తూ, ఇదే ఒరవడిని కొనసాగించి ఇంకా అభివృద్ధి చెందేలా పునరంకింతం అయ్యేలా చైతన్యం కావాలని అన్నారు.

రాష్ట్ర ప్రజల మంచి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాత్రి ఖమ్మం నగరంలో గాంధినగర్ లో వాసవి గార్డెన్ లో దేవాదయ ధర్మధాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవంలో మంత్రి పువ్వాడ దంపతులు పాల్గొన్నారు.అంతకుముందు స్ధంభాద్రి ఆలయంలో జరిగిన సుదర్శన హోమంలో మంత్రి దంపతులు పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మైనార్టీ అధికారి మెహమూద్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్ కుమార్, దండా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ సతీష్, మడురి ప్రసాద్, మక్బూల్, స్ధంభాద్రి శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు (చిన్నా), పాస్టర్ లు రెవ.జాన్ కాంతారావు, రెవ. బి. సత్యపాల్, జోజి, ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజ్‌ఉద్దీన్ ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News