Monday, April 29, 2024

టిష్యూ కల్చర్ సాగుకు ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

ఉద్యాన పంటలకు తెలంగాణ ఎంతో అనుకూలం
మంత్రి నిరంజన్‌రెడ్డి

Plans for tissue culture cultivation

మనతెలంగాణ/హైదరాబాద్:  అధికోత్పత్తుల సాధనకు ఉద్యానశాఖ ద్వార టిష్యూకల్చర్‌సాగుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మహారాష్ట్రలో ఉద్యాన పంటల సాగు విధానం అధ్యయనంలో భాగంగా రెండవరోజు శనివారం నాడు మంత్రి జలగావ్ ప్రాంతంలో పర్యటించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్ , జైన్ హిల్స్ ఉద్యానసాగు, టిష్యూకల్చర్ మొక్కల తయారీ,మైక్రో ఇరిగేషన్ డ్రిప్ పరికరాల తయారీ యూనిట్ , సోలార్ పంప్‌సెట్ల యూనిట్ , మామిడి, జామ, జైన్ స్వీట్ ఆరెంజ్ , డ్రిప్ ద్వారా అల్లం, ఆలు, టామాటా పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి అవసరమైన ఉద్యాన మొక్కల ఉత్పత్తి,ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, ప్రపంచంలోనే అతి పెద్ద టిష్యూకల్చర్ ల్యాబ్ ఇక్కడ ఉండటం దేశానికి గర్వకారణం అ న్నారు.మొక్క పుట్టినప్పుడే దానికి ఎలాంటి రోగాలు లేకుండా తీసుకువస్తున్నారని , అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ ఇక్కడ ఉండడం అభినందనీయం అన్నారు.

ఇంత పెద్ద టిష్యూకల్చర్ ల్యాబ్ ఉన్నా డిమాండ్ కు తగిన మొక్కలు అందించలేకపోతున్నారన్నారు.జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి జైన్ వంటి సంస్థ చేస్తున్న కృషి అత్యద్భుతమన్నారు .ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొక్కలు ఉద్యానపంటల వైపు మళ్లుతున్న రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల వైవిద్యీకరణ మీద దృష్టి సారించామని తెలిపారు. పంటల మార్పిడి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణకు ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ల్యాబ్ లు ఎంతో అవసరం అని తెలిపారు. రైతాంగాన్ని ఇతర పంటల వైపు మళ్లించే క్రమంలో ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలవైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల సాగుతో పాటు వాటి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఎంతో ముఖ్యమని వెల్లడించారు.ఉపయోగానికి పనికిరాని ఖాళీ స్థలాలలో 8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలు తీర్చుకోవడం అనుసరణీయం అని తెలిపారు .

ఇక్కడి ఆధునిక వ్యవసాయం అతి పెద్ద పరిశ్రమగా వర్ధిల్లడం దేశానికి గర్వకారణమని, ప్రాసెసింగ్ యూనిట్లు ఆదర్శనీయమని మంత్రి పేర్కొన్నారు. 544 మిల్లీమీటర్ల అతి తక్కువ వర్షపాతం ఉన్న జల్గావ్ లో నీటి వినియోగం తీరు ఇతర రైతాంగానికి ఆదర్శం అని ప్రశంసించారు.900 మిల్లీమీటర్ల వర్షం పడినా తెలంగాణలో కరువుగా పరిగణిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడేళ్లలో 600 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నారని వివరించారు. కాళేశ్వరం నీటితో ఉత్తర తెలంగాణ, నల్లగొండ సస్యశ్యామలం అయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కాబోతుందన్నారు.మహారాష్ట్రలోని జాల్నా, జల్గావ్ ఇన్ని రోజులు తెలంగాణ ఎదుర్కొన్న సమస్యనే ఎదుర్కొంటున్నదని, ఎత్తయిన తమ ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతులు కురిసిన కొద్దిపాటి వర్షం నీళ్లతోనే లాభదాయక పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ఫాం పాండ్ లు నిర్మించుకుని వాటిలో ఒడిసిపట్టుకున్న నీటితోనే పంటలు పండించుకుంటున్నారన్నారు. కేసీఆర్ దయవల్ల తెలంగాణ రైతాంగానికి సాగునీటి గోస తీరిందని తెలిపారు.

రైతులు సాంప్రదాయ పంటల సాగును వదిలేసి లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల పాలయిన రైతులు ఆర్థికంగా స్థితిమంతులు కావాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు దానిమ్మ, మామిడి, బత్తాయి, జామ అనుకూలం అని, గతంలో సాగునీరు లేక రైతులు వీటిని తొలగించారన్నారు. ఇప్పుడు సాగునీటి రాకతోపాటు అందుబాటులో టిష్యూకల్చర్ మొక్కలు ఉన్నందున రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యానశాఖ రైతులకు వీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నదని తెలిపారు.

అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో అన్నదాతకు అండగా నిలుస్తున్నామన్నారు.దేశ ప్రధాని మోడి సొంతరాష్ట్రం గుజరాత్ లో నాలుగు రోజుల క్రితం నుండి వ్యవసాయానికి కేవలం 8 గంటల నిరంతర విద్యుత్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో జైన్ సంస్థ స్ఫూర్తితో పంటల మార్పిడి దిశగా రైతులను తీసుకెళ్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రివెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News