Tuesday, September 17, 2024

పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఇళ్లు

- Advertisement -
- Advertisement -

PM Modi to lay foundation stone of Lighthouse Projects

లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
6 నగరాలలో 12 నెలల్లో వెయ్యేసి ఇళ్లు
జిహెచ్‌టిసి-ఇండియా కింద 6 రాష్ట్రాలలో ఇళ్ల నిర్మాణం

న్యూఢిల్లీ: గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్-ఇండియా (జిహెచ్‌టిసి-ఇండియా) కింద ఆరు రాష్ట్రాలలోని ఆరు నగరాలలో నిర్మించనున్న వెయ్యేసి ఇళ్లకు సంబంధించిన లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులను 12 నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపస చేస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వ తీసుకున్న అనేక చర్యలు సొంతిల్లు పొందగలనన్న విశ్వాసాన్ని సామాన్య ప్రజలలో పాదుగొల్పిందని ప్రధాని తెలిపారు. గతంలో డబ్బు ఖర్చుపెట్టినప్పటికీ పకాలంలో సొంతిల్లు అందక సామాన్యుడి సొంతింటి కల చెదిరిపోయిందని, అవసరమైన న్యాయ సహాయం కూడా వారికి అందేది కాదని, అంతేకాక అధిక వడ్డీలు కూడా అవరోధంగా ఉండేవని ప్రధాని అన్నారు. కాగా..లైట్ హౌస్ ప్రాజెక్టులు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, వినూత్న ప్రక్రియతో నిర్మించనున్నవని మోడీ తెలిపారు. తక్కువ సమయంలో నిర్మించే ఈ ఇళ్లు పటిష్టంగా ఉండడంతోపాటు సామాన్యుడికి సౌకర్యవంతంగా, అందుబాటు ధరలలో ఉంటాయని ఆయన వివరించారు.

ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాలలో అవలంబిస్తున్న అధునాతన నిర్మాణ పద్ధతులను ఇక్కడ కూడా అనుసరిస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులు అంకుర కేంద్రాలుగా పనిచేస్తాయని ఆయన తెలియచేశారు. ఆర్కిటెక్టులు, ప్లానర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు ఈ ప్రాజెక్టులను సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. లైట్ హౌస్ ప్రాజక్టులను ఇండోర్(మధ్యప్రదేశ్), రాజ్‌కోట్(గుజరాత్), చెన్నై(తమిళనాడు), రాంచి(జార్ఖండ్), అగర్తల(త్రిపుర), లక్నో(ఉత్తర్ ప్రదేశ్)లో నిర్మించనున్నారు. ఒక్కో నగరంలో దాదాపు వెయ్యి గృహాలను ఒకే చోట నిర్మిస్తారు. వీటికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అఫర్డబుల్ సస్టేనబుల్ హౌసింగ్ ఆక్సెరేటర్స్-ఇండియా(ఆషా-ఇండియా) విజేతలను ప్రకటించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పిఎంఎవై-యు) మిషన్ అమలులో అద్భుతంగా పనిచేసిన రాష్ట్రాలకు అందచేసే వార్షిక అవార్డులను కూడా అందచేశారు. ఇదే సందర్భంగా ఇన్నోవేటివ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్‌పై నవరితిహ్(న్యూ, అఫర్డబుల్, వాలిడేటెడ్, రిసెర్చ్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఫర్ ఇండియన్ హౌసింగ్) పేరిట ఒక సర్టిఫికెట్ కోర్సును ప్రధాని మోడీ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహరాల శాఖ మంత్రి, త్రిపుర, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News