Sunday, April 28, 2024

యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు

- Advertisement -
- Advertisement -

దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు

న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు కొత్త రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు చర్చలు జరిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతోసహా అనేక ఒప్పందాలపై వారి సమక్షంలో జరిగాయి. అధ్యక్షుడు జాయేద్ విమానాశ్రయం వద్ద ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు పరస్పర ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం ప్రధాని మోడీ గౌవర వందనం స్వీకరించారు. అబు దాబి విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా వచ్చినందుకు అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నాయకులు ముఖాముఖీ చర్చలతోపాటు ప్రతినిధి స్థాయి చర్చలలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించిన ఇద్దరు నాయకులు సహకారానికి సంబంధించి కొత్త రంగాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, ఫిన్‌టెక్, ఇంధనం, మౌలిక సౌకర్యాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతోసహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడాన్ని వారు స్వాగతించారు.

వారి మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ అంశౠలు కూడా చర్చకు వచ్చాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడచిన ఏడు నెలలలో తామిద్దరం ఐదుసార్లు కలుసుకున్నామని, నేడు ప్రతి రంగంలో రెండు దేశాల మధ్య పరస్పర భాగస్వామ్యం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఇద్దరు నాయకుల సమక్షంలో భారత్, యుఎఇ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎలెక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్, వాణిజ్య రంగంలో సహకారంపై రెండు దేశాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియా ఆర్థిక కారిడార్‌పై ఇరు దేశాల మధ్య అంతర్ ప్రభుత్వ ముసాయిదా ఒప్పందం కుదిరింది. మొత్తం ఎనిమిది ఒప్పందాలు రెండు దేశాల మధ్య కుదిరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

సంతకాలు జరిగిన ఒప్పందాలలో డిజిటల్ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులలో సహకారంపై ఎంఓయు, రెండు దేశాల జాతీయ పురావస్తు శాఖల మధ్య సహకార ఒప్పందం, హెరిటేజ్, మ్యూజియం రంగాలలో సహకారం ఒప్పందం, యుపిఐ(ఇండియా), ఎఎఎన్‌ఐ(యుఎఇ) వంటి ఇన్‌స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫారాల అనుసంధానంపై ఒప్పందం, రుపే(ఇండియా), జేవన్(యుఎఇ) వంటి దేశీయ డెబిట్, క్రెడిట్ కార్టు అనుసంధానంపై ఒప్పందం కూడా ఉన్నాయి. ఇంధన రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై కూడా వారిద్దరూ చర్చించారు. కాగా..అబు దాబిలో మొట్టమొదటిసారి నిర్మించిన హిందూ రాతి ఆలయం బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బిఎపిఎస్) ఆలయాన్ని ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించనున్నారు. అబు దాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యుఎఇ అధ్యక్షునికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News