Sunday, April 28, 2024

విక్రమ్ స్మైల్ ప్లీజ్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపై పలు వింతలు దొర్లుతున్నాయి. చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి జాడలో నడుస్తూ తోటి ల్యాండర్ విక్రమ్‌తో దోబుచూలాటలకు దిగుతున్నట్లుగా ఉంది. తన పిల్లచేష్ట మాదిరిగా తనకు దూరంగా ఉన్న ల్యాండర్ బాయ్ విక్రమ్ ఫోటోలను క్లిక్ మన్పించింది. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ అంటూ విక్రమ్‌ను ఆటపట్టించింది. రోవర్ తీసి పంపించిన విక్రమ్ ఫోటోను ఇప్పుడు బెంగళూరులోని ఇస్రో భూ కేంద్రం మీడియాకు వెలువరించింది. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ వంటి నావిగేషన్ కెమెరాతో రోవర్ ఈ చిత్రం తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపైకి చేరిన తరువాత రోవర్ తన కెమెరాను వినియోగించుకుని తీసిన తొలిఫోటో ఇదే. అందుకేనేమో ముందుగా తనకు చంద్రుడిని పరిచయం చేసిన రోవర్ ఫోటో తీసి, క్లిక్‌మన్పించి నవ్వు విక్రమ్ అంటూ తన పనికి ముందుకు సాగింది. ఇప్పటివరకూ చంద్రుడి సంబంధిత ఫోటోలన్నింటిని తీసింది కేవలం విక్రమ్. దీనికి అమర్చి ఉన్న అత్యంత శక్తివంతమైన టెలీమెట్రి పరికరాలతో ఈ ఛాయాచిత్తరువులను పంపించింది.

ఈ క్రమంలో ఇస్రో కేంద్రానికి తగు విధంగా చంద్రుడి రహస్యాలను క్రోడీకరించుకునేందుకు వీలేర్పడుతోంది. ఇప్పుడు రోవర్ పంపించిన చిత్రానికి ఇస్రో ‘ ఇమేజ్ ఆఫ్‌ది మిషన్ ’ అని పేరు పెట్టింది. రోవర్‌కు అమర్చి ఉన్న నావ్‌కామ్ కెమెరా ద్వారా తొలి తాజా చిత్రం విడుదల అయిందని ఇరసో వర్గాలు తెలిపాయి. నావ్ కామ్‌ను బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టికో సిస్టమ్స్ (లియోస్ ) రూపొందించింది. ఆరువారాల క్రితం చంద్రయాన్ 3 ప్రయోగం జరిగిన నాటి నుంచి దీనిపై ప్రపంచ ప్రజల దృష్టి రోజురోజుకు విస్తరిస్తోంది. వేలాది మంది ఇప్పుడు రోవర్, ల్యాండర్‌ల నుంచి వెలువడుతున్న ఫోటోల గురించి తమకు తెలియని చంద్రుడి పలు రూపాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రష్యా లూనా ప్రయోగం విఫలం తరువాతి దశలో ఇస్రో ప్రయోగం విజయవంతం కావడం, చంద్రయాన్ 3 అంతా సజావుగా సాగడంతో భారతీయ శాస్త్ర సాంకేతికత పట్ల విశ్వాసం ఇనుమడిస్తోంది.

చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా మారింది. కాగా దక్షిణ ధృవంపై అడుగిడిన తొలి దేశపు ఖ్యాతిని చాటుకుంది. చంద్రుడి దక్షణ ధృవం వద్ద తన అన్వేషణల్లో భాగంగానే రోవర్ సల్ఫర్‌ను కనుగొంది. ఈ రోబో వంటి రోవర్ అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్ , ఆక్సిజన్ వంటి వాటిని గుర్తించిందని ఇస్రో తెలియచేసింది. ఈ కీలక సమాచారం పంపించిన మరుసటిరోజే రోవర్ తన కెమెరాతో ల్యాండర్ చిత్రం పంపించడంతో చంద్రయాన్ 3 సజావతం అవుతున్న విషయం స్పష్టం అయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News