Monday, April 29, 2024

మరో 10 రోజులు

- Advertisement -
- Advertisement -

Property registration deadline extended to 20th of this month

 

ఆస్తుల నమోదు గడువు పెంపు

హెచ్‌ఎండిఎ పరిధిలో
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ విధానం
జిహెచ్‌ఎంసి పాలక మండలిలో మహిళలకు 50% ప్రాతినిధ్యం
వార్డుల రిజర్వేషన్ అంశాలు,
నాలా చట్టానికి సవరణలు
4 గంటల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంతో కేబినెట్ సుదీర్ఘ భేటీ

హెచ్‌ఎండిఎ పరిధిలో
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ విధానం
జిహెచ్‌ఎంసి పాలక మండలిలో మహిళలకు 50% ప్రాతినిధ్యం
వార్డుల రిజర్వేషన్ అంశాలు,
నాలా చట్టానికి సవరణలు
4 గంటల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంతో కేబినెట్ సుదీర్ఘ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్‌లైన్ ఆస్తుల నమోదు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చట్ట సవరణకు మంత్రి మండలి ఆమోదించింది. రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 50 మహిళలు పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం పలు అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండిఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై కూడా క్యాబినెట్ ప్రధానంగా చర్చించింది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రస్తుతం జిహెచ్‌ఎంసి చట్టం -1955లోని పలు అంశాలపై సవరణలు చేసే అంశంపై మంత్రివర్గం సమావేశం కూలంకషంగా చర్చించింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సగం సీట్లలో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే వార్డుల కమిటీ పనితీరు, రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో కూడా చట్ట సవరణలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు నాలా చట్టానికి కూడా రాష్ట్ర క్యాబినెట్ సవరణ చేసింది. ముఖ్యంగా వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవల నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కాగా వ్యవసాయ రంగంపై క్యాబినెట్ సమగ్రంగా చర్చించింది. రాష్ట్ర రైతాంగం క్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలల్లోనే ధాన్యం సేకరణ చేసినట్లు, ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా గత అనుభవాలను దృష్టిలోఉంచుకుని ధాన్యం సేకరణ చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో సుమారు 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ప్రతి రైతు పంటలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని ప్రభుత్వం కోరింది. కాగా, ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ,తాలు పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతాంగాన్ని క్యాబినెట్ కోరింది. రాబోయే సీజన్ లో రాష్ట్రంలో సాగుచేయబోయే మొక్కజొన్న అంశం పై క్యాబినెట్ చర్చించింది. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండా పోవడంపై, ఇందుకు కేంద్రం నిర్ణయాలు కారణం కావడం పట్ల.,క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని అభిప్రాయం వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడడంపై క్యాబినెట్ ఆవేదన వ్యక్త చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ దేశ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనుకునే కేంద్రం ఆలోచన పట్ల క్యాబినెట్ విస్మయం వ్యక్తం చేసింది. సాంప్రదాయంగా మొక్కజొన్నపంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతు ధర రాకుండాపోయే గడ్డుకాలం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వ విఫణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి వుండడంతో పాటు, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో, మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

ఏ గ్రేడ్‌కు రూ.1888, సాధారణకు రూ.1868గా నిర్ణయం

రాష్ట్రంలో వానాకాలం పంట వరిధాన్యం సేకరణకు ప్రభుత్వం 5690 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు శనివారం జి.ఓను జారీ చేశారు. ఐకేపి, పిఏసిఎస్, డిసిఎంఎస్ కేంద్రాల ద్వారా వచ్చే వరిధాన్యాన్ని సివిల్ సప్లై సంస్థ కోనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక హాకా ఆధ్వర్యంలో జిసిసి, ఎఎంసి కేంద్రాల ద్వారా 9 జిల్లాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసే వరికి ఏ గ్రేడ్‌కు రూ.1888, సాధారణ రకానికి రూ. 1868 కనీస మద్దతు ధరను కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా సిఎంఆర్ బియ్యాన్ని15 రోజుల్లోగా ప్రభుత్వానికి అందించాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ హెచ్చరించింది. అంతేగాక పిడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

మిల్లర్లు ఇచ్చే బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్ ఫ్రీ నంబరు 18004 25003331967ని సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఈ వానాకాలంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ధాన్య కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News