Monday, April 29, 2024

ఇరు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

Punjab Kings will take on Rajasthan Royals today

నేడు పంజాబ్‌తో రాజస్థాన్ పోరు

దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్‌లో జరిగిన తొలి అంచె మ్యాచుల్లో ఇరు జట్లు మూడేసి విజయాలు సాధించాయి. ఇక నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లో కూడా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్, పంజాబ్ సారథి కెఎల్.రాహుల్‌కు ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లు చాలా కీలకంగా మారాయి. తమ తమ జట్లను ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. ఇటు రాజస్థాన్, అటు పంజాబ్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అయితే కీలకమైన జోస్ బట్లర్ టోర్నమెంట్‌కు దూరం కావడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. బట్లర్ లోటును పూడ్చుకోవడం రాజస్థాన్‌కు శక్తికి మించిన పనిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

దీనికి తోడు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇలాంటి స్థితిలో కెప్టెన్ శాంసన్ బాధ్యతలు మరింత పెరిగాయి. ఇటు బ్యాటింగ్ అటు కెప్టెన్సీలో శాంసన్ మెరుగైన ప్రతిభ కనబరచక తప్పదు. కాగా, ఈసారి కూడా రాజస్థాన్ యువ ఆటగాళ్లపైనే ఆధారపడనుంది. తొలి దశలో నిలకడగా రాణించిన రాహుల్ తెవాటియా,రియాన్ పరాగ్, చేతన్ సకారియా, మన్నాన్ వోహ్రా తదితరులపై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ తదితరులతో రాజస్థాన్ బలంగానే ఉంది. సమష్టిగా రాణిస్తే సీజన్14లో నాకౌట్‌కు అర్హత సాధించడం రాజస్థాన్‌కు కష్టమేమీ కాకపోవచ్చు. ఇక సౌతాఫ్రికాకు చెందిన టి20 స్పెషలిస్ట్ బౌలర్ తబ్రేస్ శమ్సిని రాజస్థాన్ జట్టులోకి తీసుకుంది. అతని రాకతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతంగా తయారైంది.

అందరి కళ్లు గేల్‌పైనే..

మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రాజస్థాన్‌తో పోల్చితే పంజాబ్‌లో ప్రపంచ శ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉండనే ఉన్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకుని గేల్ విజృంభిస్తే ఆపడం ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చాలా కష్టంతో కూడుకున్న అంశమే. అంతేగాక కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా పంజాబ్‌కు భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో కూడా పంజాబ్ బలంగా ఉంది. షమి, అర్ష్‌దీప్ సింగ్, ఆదిల్ రశీద్, జోర్డాన్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇలా రెండు విభాగాల్లో బలంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News