Monday, April 29, 2024

అందరి మనిషి -అందని మనిషి

- Advertisement -
- Advertisement -

PV narasimha rao biography in telugu

కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం తీవ్ర స్థాయిని తగ్గించడానికి పివిని ముఖ్యమంత్రింగా చేయవలసి వచ్చింది. అలాగే రాజీవ్‌గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి పదవికి పివి పేరే అందరి మనసులలో మెదిలింది. ఈ విశిష్ట వ్యక్తిత్వ లక్షణం వల్లనే వరిష్ఠ పదవులెన్నో ఆయనను వరుసగా వరించాయి. అంతేకాదు అపారమైన పాలనానుభవం, మూర్తీభవించిన సౌజన్యం, శేఖరీభూతమైన శేముషీ వైదగ్ధం, అసాధారణ వైదుష్యం, నిష్కళంక రాజకీయ చరితం, నిస్వార్థ సేవానిరతి, నిశ్చలమైన నిబద్దపు నిజాయితి, నిర్మలమైన నిరాడంబరత, చెక్కు చెదరని చిత్తశుద్ధి మొదలైన సద్గుణాల గుర్తింపు వల్లనే ఆయనకా పదవులు అయాచితంగా, అప్రయత్నంగా ఆయన ముంగిట వాలాయంటే అతిశయోక్తి కాదు.

పాములపర్తి వేంకట నరసింహారావు పివి గానే అందరి నోళ్లలో నానిన పేరు. తెలుగు వాళ్లకు, ముఖ్యంగా తెలంగాణ వారికి గర్వకారణమైన వ్యక్తి. విద్యార్థి దశలోనే నిజాం వ్యతిరేక వందేమాతరం ఉద్యమంలో పాల్గొని, ఇక్కడ చదువుకోలేక, నాగపూరులో చదువు కొన్న ఉద్యమకారుడు. కరీంనగర్ నుంచి కరి నగరం (హస్తినాపురి ఢిల్లీ) దాకా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఇరవై ఏళ్ల పాటు (1957 నుంచి 1977 వరకు) శాసన సభ్యునిగా, ఇరవై ఐదేళ్లపాటు (1977 నుంచి 1992 వరకు) పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన వ్యక్తి.
ఏడు సార్లు ఎన్నికలలో పోటీ చేసినా, ఏ ఎన్నికలలోనూ ఓటమి ఎరుగని వ్యక్తి. కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం తీవ్ర స్థాయిని తగ్గించడానికి పివిని ముఖ్యమంత్రింగా చేయవలసి వచ్చింది. అలాగే రాజీవ్‌గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి పదవికి పివి పేరే అందరి మనసులలో మెదిలింది. ఈ విశిష్ట వ్యక్తిత్వ లక్షణం వల్లనే వరిష్ఠ పదవులెన్నో ఆయనను వరుసగా వరించాయి. అంతేకాదు అపారమైన పాలనానుభవం, మూర్తీభవించిన సౌజన్యం, శేఖరీభూతమైన శేముషీ వైదగ్ధం, అసాధారణ వైదుష్యం, నిష్కళంక రాజకీయ చరితం, నిస్వార్థ సేవానిరతి, నిశ్చలమైన నిబద్దపు నిజాయితి, నిర్మలమైన నిరాడంబరత, చెక్కు చెదరని చిత్తశుద్ధి మొదలైన సద్గుణాల గుర్తింపు వల్లనే ఆయనకా పదవులు అయాచితంగా, అప్రయత్నంగా ఆయన ముంగిట వాలాయంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్ర రాజకీయాలలో ఉన్నప్పుడు న్యాయ, సమాచార, దేవదాయ, వైద్య ఆరోగ్య, విద్యాశాఖల వంటి పదవులను నిర్వహించి, 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పనులు చేశారు. వాటిలో ముఖ్యమైనవి తెలుగు భాషను సచివాలయ స్థాయిలో అధికార భాషగా చేయడం, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం. ఈ లక్షాలను నెరవేర్చడానికి ‘తెలుగు అకాడమి’ సంస్థను నెలకొల్పి, దానికి తానే ఆరు సంవత్సరాల పాటు అధ్యక్షుడుగా ఉండి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విప్లవాత్మకమైన భూ పరిమితి చట్టాన్ని తెచ్చిన అభ్యుదయవాది.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రిగా హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ వంటి కీలక శాఖలను ఎంతో దక్షతతో, అంకిత భావంతో నిర్వహించారు. ప్రధానమంత్రి (జూన్ 1991 1996 మే) ఉన్నప్పుడు నానాటికీ తీసికట్టుగా దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు సంస్కరణలను చేపట్టడానికి, రాజకీయ నేపథ్యం ఏ మాత్రం లేని సుప్రసిద్ధ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తగినవారని భావించి ఆర్థికమంత్రిగా నియమించుకోవడమొక సాహసోపేతమైన చర్య, సత్ఫలితాన్నిచ్చిన చారిత్రక చర్య. అప్పటి ఆర్థిక సరళీకరణ విధానాలు విజయవంతం కాగా, పివిని ‘ఆర్థిక సంస్కరణల పితామహుడి’ గా పేర్కొంటారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా తీసుకొన్నందువల్లనే తదనంతర కాలంలో రెండు పర్యాయాలు వరుసగా ప్రధానమంత్రి అయ్యారు మన్మోహన్ సింగ్. పివి. తాను ప్రతిభావంతుడు మాత్రమే కాదు, ఇతరుల ప్రతిభను పసిగట్టడంలో దిట్ట. అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివినే. ఆయన కాలంలో అణుబాంబు తయారు కాగా, దాని పరీక్షలు వాజ్‌పేయి కాలంలో జరిగాయి.
ఒక్క క్షణం తీరికలేని రాజకీయాలలో మునిగి తేలుతూ, మరో పక్క ఆయన అనేక భాషలలో అనర్గళంగా భాషించగల అపారమైన పాండిత్యాన్ని గడించి, బహుభాషా కోవిదుడుగా గణుతికెక్కారు. ఆయన రాజకీయ చతురత ఒక ఎత్తు, బహుభాషా భాషణ సామరథ్యం మరొక ఎత్తు. తెలుగు కన్నడం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఉర్దూ వంటి భారతీయ భాషలలోనే కాక, విదేశీ భాషలైన ఇంగ్లీష్, పర్షియన్, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి 17 భాషలలో అసాధారణ పాండిత్యం అలవర్చుకోవడం ఆశ్చర్యకరం. స్వయం కృషితో కంప్యూటర్ జ్ఞానాన్ని కూడా పొందారు. వృద్ధాప్యంలో స్వయంగా ప్రోగ్రామింగ్ చేసుకునే నేర్పును అలవర్చుకొన్నారంటే ఆయన ఓర్పుకు జోహార్లు. నిత్య అభ్యసనశీలి, నిత్య కృషీవలుడు.
విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ నవలను పివి హిందీలోకి అనువాదం చేసి ప్రతిష్ఠాకరమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. హరిహర నారాయణ్ ఆప్టే రాసిన ‘సాపఖ లక్షతో కోన్‌ఘాట్’ అనే మరాఠీ నవలను తెలుగులోకి ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించారు. ‘ఇన్‌సైడర్’ అనే పేరుతో ఆత్మ కథాత్మక నవలను పివి చివరి దశలో రాయగా, దానిని కల్లూరి భాష్కరం తెలుగులోకి అనువదించారు. ప్రముఖ కవయిత్రి జయప్రభ తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు పివి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో తొలి నాళ్లలో ‘గొల్ల రామవ్వ’ కథను కలం పేరుతో రాశారు. ఇవేగాక మరెన్నో వ్యాసాలను కలం పేర్లతో రాశారు. వాటినన్నిటినీ సేకరించి ఆయన పేరు మీద ఈ శత జయంతి సంవత్సరంలో గ్రంథాలుగా ప్రచురిస్తే ఆయన ఎంత రచయిత అయిందీ, ఎంత మేధావి అయిందీ తెలిసివస్తుంది.
సమర్థుడైన సచివుడుగా, సహృదయుడుగా, అసాధారణ ప్రజ్ఞాధునిగా, బహు భాషావేత్తగా, రాజనీతి దురంధరుడిగా, విద్యావేత్తగా, వినయమూర్థిన్యుడుగా, వివేక చూడామణిగా, ఉత్తమ వాగ్మిగా, సమయస్ఫూర్తీ ఔచిత్యమూ ఎరిగిన సరస సంభాషణ చతురుడుగా, స్థితప్రజ్ఞుడుగా, సహస్ర ప్రతిభాసాకారుడుగా, అపర చాణక్యుడుగా, మహా మేధావిగా, సర్వుల ప్రశంసలందుకొన్న ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే’ అని ఎంతో వినమ్రంగా చెప్పుకొని, తెలుగు భాష పట్ల, తెలంగాణ పట్ల తన అనన్యమైన ప్రేమాభిమానాలను చాటుకొన్న పివి శత జయంతి సంవత్సరాన్ని సమధికోత్సాహంతో తెలుగు వారే కాదు, భారతీయులందరూ ఘనంగా జరుపుకోవలసిన తరుణమిది. అంతేకాదు, ఈ శత జయంతి సంవత్సరంలోనైనా పివికి ‘భారత రత్న’ బిరుదు ప్రదానం జరిగేలా పార్టీల భేదాలను మరిచి నాయకులూ, దేశ విదేశాలలోని తెలుగు వారందరూ ముక్త కంఠంతో భారత ప్రభుత్వాన్ని కోరాలి. ఆయనకు తగిన ‘భారత రత్న’ బిరుదు ప్రదానం ఈ శత జయంతి సంవత్సరంలో తప్పక జరుగుతుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు.

ప్రొ జి. చెన్నకేశవ రెడ్డి
9492047027

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News