Monday, April 29, 2024

తలైవా వెనుకడుగు!

- Advertisement -
- Advertisement -

Farmers concerned that no Minimum Support Price for Crops

సూపర్ స్టార్‌గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా వెలిబుచ్చిన సొంత రాజకీయ పార్టీ స్థాపన సంకల్పాన్ని ఇంతలోనే విరమించుకుంటున్నట్టు ప్రకటించడం దేశ రాజకీయాల్లో అరుదైన పరిణామమే. ఒక మాదిరి ప్రేక్షకాభిమానాన్ని గడించుకున్న మామూలు సినిమా నటులే రాజకీయాల్లో ప్రవేశించడానికి నిర్ణయించుకున్న తర్వా త వెనుకడుగు వేయడం సాధారణంగా ఉండదు. ఇది గతంలో విజయకాంత్ వంటివారి సందర్భాల్లో రుజువైంది. మరో ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే పార్టీని నెలకొల్పి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉత్సాహంతో ముందు కు వెళుతున్నారు. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితమే తగిన వయసులో ఉన్నప్పుడే రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశించాలన్న మక్కువను వ్యక్తం చేశారు. ఆయన దళపతి సినిమా విడుదలైనప్పుడు కరుణానిధి నిన్నటి సిఎం, జయలలిత నేటి ముఖ్యమంత్రి, రజనీకాంత్ రేపటి రథసారథి అంటూ ఆయన అభిమానులు ప్రచారం చేశారు.

2017లో కూడా రజనీకాంత్ తన రాజకీయేచ్ఛను ప్రకటించుకున్నారు. తాజాగా ఈ నెల మొదటి వారంలో వచ్చేస్తున్నా… వచ్చేశా అంటూ తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆశ్చర్యం గొలిపే మార్పును తీసుకు వస్తానని శపథం చేసి రాజకీయ పార్టీ నెలకొల్పే ఉద్దేశాన్ని బయటపెట్టారు. జనవరిలో దానిని ఆవిష్కరించనున్నట్టు తిరుగులేని ప్రకటన చేశారు. ఇంతలో సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చి అస్వస్థతకు గురికావడంతో మనసు మార్చుకొన్నారు. తనకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడని రాజకీయాల్లోకి రాబోడం లేదని మంగళవారం నాడు రజనీకాంత్ చేసిన ప్రకటన విస్మయపరచింది. జనంలోకి వెళ్లకుండా రాజకీయ విజయం సాధించలేమని ప్రజల్లోకి వెళితే కరోనా వైరస్ విజృంభణకు తోడ్పడినట్టు అవుతుందని అందుచేతనే పార్టీ పెట్టే ఉద్దేశాన్ని విరమించుకుంటున్నానని రజనీకాంత్ వివరించారు. ప్రజల మధ్య లేకుండా కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా నెగ్గుకు రావడం కష్టమని కూడా అభిప్రాయపడ్డారు. 70వ పడిలో పడ్డ తనకు ఆరోగ్యపరమైన ప్రతికూల పరిస్థితి పొంచి ఉన్నదనే స్పృహ పార్టీ సంకల్పాన్ని ప్రకటించడానికి ముందే రజనీకాంత్‌లో కలిగి ఉండాలి. మూత్రపిండాల చికిత్స జరిపించుకున్న తనకు రక్తపోటు అదుపు తప్పడమనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య తీసుకు వస్తుందని భావించి రజనీకాంత్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తున్నది.

దీని వెనుక ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా ఉండి ఉండవచ్చు. ఆయన ఆరోగ్యంతో హాయిగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. నాలుగైదు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్న తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ ప్రవేశం అనుకున్నట్టు జరిగి ఉంటే అంతిమ ఫలితం ఎలా ఉన్నా ఆయన రంగంలో ఉన్నందు వల్ల అక్కడ ఈసారి ఎన్నికల రాజకీయాలు బాగా రక్తి కట్టి ఉండేవి. కేవలం అన్నాడిఎంకె, డిఎంకెల ద్వంద్వ యుద్ధంగా మాత్రమే ఇంతకాలంగా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో బలమైన మూడో శక్తిగా రజనీకాంత్ పార్టీ నిరూపించుకుని ఉండేది. అసంఖ్యాకంగా ఉన్న ఆయన అభిమానులు తమ ప్రభావం చూపించి ఉండేవారు. రజనీ రంగ ప్రవేశం జరగదు కాబట్టి ఈసారి కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలైన ఆ రెండు తమిళ పక్షాల సమరంగానే సాగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో బాగా కాలూనుకోడానికి ముఖ్యంగా తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోడానికి ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ జయలలిత మృతి, ఆమె స్నేహితురాలు శశికళ జైలుకు వెళ్లడం తన కలను నెరవేర్చుకోడానికి దోహదపడే పరిణామంగా భావించింది. జయలలిత మరణానంతరం ఆమె పార్టీ ఎఐఎడిఎంకె ప్రభుత్వం కొనసాగడానికి తగిన మద్దతును కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు ఇచ్చారు.

అదే సందర్భంలో బిజెపి స్వయంగా అడుగుపెట్టి తమిళనాడు రాజకీయాలను తనవైపు తిప్పుకోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నది. అందుకు దారి వేయడానికి రజనీకాంత్‌ను ఉపయోగించుకోవాలనుకున్నది. రజనీకాంత్ పార్టీ సంకల్పం ఆ వైపుగా తనకు మేలు చేస్తుందని ఆశించింది. రజనీకాంత్ కూడా ఆధ్యాత్మిక రాజకీయాలంటూ బిజెపిలో అటువంటి ఆశలు కల్పించారు. ఇంకేమైనా అవగాహన కూడా ఏర్పడి ఉండవచ్చు. మొట్టమొదటి సారిగా తమిళ రాజకీయాల్లో బలమైన మూడోశక్తిగా రజనీకాంత్ పార్టీ ఉంటే ఓటర్లు ఆ రెండు ద్రవిడ పార్టీలకు దూరం కావడాన్ని అలవాటు చేసుకుంటారని అది తన ఆకాంక్షను నెరవేరుస్తుందని బిజెపి అనుకున్నది. ఇప్పుడు రజనీకాంత్ తప్పుకున్న తర్వాత కూడా ఆయన బయటినుంచి తనకు మద్దతు ఇస్తాడని అది 1996లో ఆయన మద్దతుతో డిఎంకె కూటమి విజయం సాధించిన విధంగా ఈసారి తనకు, తన చెప్పుచేతల్లోని ఎఐఎడిఎంకెకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నది. ఏమి జరుగుతుందో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తెర మీదనే చూడాలి.

Rajinikanth says will not start political party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News