Monday, April 29, 2024

చావునోట్లో బొగ్గు పెల్ల

- Advertisement -
- Advertisement -

Ravinder Singareni transfer worker survived

రెస్కూ టీమ్ కృషితో ప్రాణాలతో బయటపడ్డ సింగరేణి బదిలీ వర్కర్ రవీందర్
ఆసుపత్రికి తరలింపు

మన తెలంగాణ/ యైటింక్లయిన్ కాలనీ/రామగిరి : 24 గంటల రెస్కూ సిబ్బంది ఆపరేషన్ ఫలించింది. ప్రాణాలతో పోరాడుతున్న కార్మికుడిని బయటకు విజయవంతంగా తీసుకురాగలిగారు. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులలో ఇద్దరిని సోమవారం నాడే రెస్కూ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఏరియా రక్షణాధికారి జయ్‌రాజ్, అసిస్టెంట్ మేనేజర్ తేజ, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్‌తో పాటు బదిలీ వర్కర్ రవీందర్ శిథిలాల కింద చిక్కుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రవీందర్ నుంచి సంకేతాలు వచ్చాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయనను మంగళవారం మధ్యాహ్నం బయటకు తీసుకొని రాగలిగారు. రవీందర్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మిగతా ముగ్గురు కోసం రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటు అధికారులు, అటు గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. రవీందర్ సురక్షితంగా బయటకు రావడంతో మిగిలిన ముగ్గురు సైతం ప్రాణాలతో బయటకు రావాలని గని బయట ప్రతి ఒక్కరు దేవుళ్లను మొక్కుతున్నారు. కాగా, రవీందర్ బొగ్గు పెల్లల మధ్యే 24గంటల పాటు ఉండిపోవడంతో నీరసించిపోయారు. అతనికి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేస్తున్నారు. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

సాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్

రామగుండం రీజియన్ సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో సోమవారం సంభవించిన ప్రమాదంలో పడ్డ కార్మికులను గని నుంచి బైటకు తీసుకువచ్చేందుకు రెస్కూ బ్రిగ్రేడియర్స్ గనిలో జాడ కోసం గాలింపులు చేస్తూనే ఉన్నారు. 3 మీటర్ల ఎత్తులో సుమారు 30 మీటర్ల పొడవున బొగ్గు గని పైకప్పు కూలడంతో వారి జాడకోసం రెస్కూ సిబ్బంది మంగళవారం సాయంత్రం వరకూ గాలింపులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చిక్కుకోగా ఇద్దరిని వెను వెంటనే బైటకు తీసుకురాగా, మంగళవారం రవీందర్ అనే మరో కార్మికుడిని బైటకు తీసుకువచ్చారు. కాగా, ఏరియా సెప్ట్ ఆఫీసర్ జయరాజ్, డిప్యూటీ మేనేజర్ తేజ చైతన్య, హెల్ప్‌ర్ తోట శ్రీకాంత్ కోసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా.. 26 గంటలు గడుస్తున్నప్పటికీ తమ వారి జాడ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సురక్షితంగా బైటపడిన కార్మికుడు రవీందర్‌ను గనిలో పరిస్థితిపై ఉన్నతాధికారులు ఆరా తీయగా.. ప్రమాద ప్రాంతం నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినట్టు సమాచారం. కాగా, రెస్కూ బృందం బొగ్గు పెచ్చులను తొలగించే చర్యల్లో నిమగ్నమయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపి వెంకటేష్ నేత, జడ్పి చైర్మన్ పుట్ట మధు తదితరులు గనిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించి వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News