Monday, April 29, 2024

రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నబ్ గోస్వామి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Republic TV editor Arnab Goswami arrested

రెండేళ్ల క్రితం నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అర్నబ్ అరెస్టు
పోలీసులు తనను కొట్టారంటూ కోర్టులో అర్నబ్ ఫిర్యాదు
అర్నబ్‌కు వైద్య పరీక్షలు చేయించాలంటూ కోర్టు ఆదేశం

ముంబయి: రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామిని బుధవారం ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఒక 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలపై అర్నబ్‌ను అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడి లోయర్ పరేల్‌లోని నివాసంలో బుధవారం ఉదయం అర్నబ్‌ను అలీబాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. పోలీసు వాహనంలోకి బలవంతంగా అర్నబ్‌ను పోలీసులు ఎక్కించిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కాగా, తన ఇంట్లోకి చొరబడిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అర్నబ్ ఆరోపించారు.

ఐపిసిలోని 306 సెక్షన్, 34 సెక్షన్ కింద అలీబాగ్ పోలీసులు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేశారని, 2018లో ఒక ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేశామని, తమ వద్ద ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. అరెస్టుకు సంబంధించిన కాగితాన్ని అర్నబ్ గోస్వామి భార్యకు అందచేయగా ఆమె చించివేశారని ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసు అధికారి చెప్పారు.

ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్‌కు అర్నబ్‌ను తీసుకుని వచ్చిన వెంటనే ఆయనను స్థానిక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అర్నబ్‌ను పోలీసులు కొట్టారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో అర్నబ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించవలసిందిగా కోర్టు ఆదేశించింది. అర్నబ్ ఇంట్లోకి ఉదయం చొరబడిన పోలీసులు ఆయనపై భౌతిక దాడి చేశారని అర్నబ్ తరఫు న్యాయవాది గౌరవ్ పార్కర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల తర్వాత అర్నబ్‌ను తిరిగి కోర్టులో హాజరుపరుస్తారని, వైద్య పరీక్షల నివేదికలను కోర్టు పరిశీలించి రిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటుందని పార్కర్ చెప్పారు. తనను, తన కుమారుడిని పోలీసులు కొట్టారని, తన అత్తమామలను కూడా కలుసుకోవడానికి పోలీసులు అనుమతించలేదంటూ అర్నబ్ పోలీసు వ్యానులో నుంచి అరవడం కనిపించింది.

కాగా.. కాంకార్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అన్వయ్ నాయక్, ఆయన తల్లి 2018లో ఆత్మహత్య చేసుకున్నారు. రిపబ్లిక్ టివి తనకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించని కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అన్వయ్ ఒక లేఖ రాసి రాసి ఆత్మహత్య చేసుకున్నారు. రిపబ్లిక్ టివికి చెందిన అర్నబ్ గోస్వామి రూ. 83 లక్షలు, ఐక్యాస్ట్‌ఎక్స్/స్కై మీడియాకు చెందిన ఫిరోజ్ షేక్ రూ. 4 కోట్లు, స్మార్ట్ వర్క్‌కు చెందిన నితీష్ సర్దా రూ. 55 లక్షలు తనకు బాకీ పడ్డారని తన ఆత్మహత్య లేఖలో అన్వయ్ నాయక్ రాసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ లేఖలో పేర్కొన్న మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇలా ఉండగా..బకాయిలు చెల్లించలేదన్న ఆరోపణలను రిపబ్లిక్ టివి ఒక ప్రకటనలో ఖండించింది. కాంకార్డ్‌కు చెల్లించాల్సిన బకాయిలన్నిటినీ ఇదివరకు చెల్లించామని ఒక ప్రకటనలో తెలిపింది.కాగా, ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ఈ కేసుపై తాజా దర్యాప్తునకు ఆదేశించినట్లు ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. రిపబ్లిక్ టివి ఇవ్వాల్సిన బకాయిలపై అలీబాగ్ పోలీసులు దర్యాప్తు జరపలేదని, తన తండ్రి, నానమ్మ ఆత్మహత్యలకు ఈ బకాయిలే కారణమంటూ ఆమె ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News