Monday, April 29, 2024

సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వాలు హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, మన గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. తెలంగాణలో సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారని, వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నామని సిఎం వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నడుచుకుంటున్నాయన్నారు. కేంద్ర నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా? అని అడిగారు. పంచాయతీ గ్రాంట్లు ఆపవద్దని కేంద్రానికి చాలాసార్లు చెప్పామన్నారు.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించడంలేదని కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తున్నాయని, కేంద్రం దయచూపడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు కేంద్రం వద్దే ఉన్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు అందాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ చట్టం తెచ్చామని, గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని పాలసీలు తెచ్చామని కెసిఆర్ స్పష్టం చేశారు. పట్టణీకరణకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను అన్ని ప్రాంతాలకు సమంగా పంచుతున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. మేధావులు, మంత్రివర్గం ఆమోదం తరువాత పంచాయతీరాజ్ బిల్లుకు సవరణ తీసుకొచ్చామన్నారు.

తాము ఏం చేసినా ఒక విధానం ప్రకారమే చేశామని, సర్పంచులకు అన్ని హక్కులు కల్పించి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించామని, గత ప్రభుత్వంలో సర్పంచులకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తయారు చేశామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన చరిత్ర తమదేనని కెసిఆర్ తెలిపారు. గ్రామాల రూపురేఖలను మార్చేస్తున్నామని, సభ ఆమోదంతో చట్టాలు చేసి అమలు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి పంచాయతీరాజ్ కార్యదర్శులను నియమించామని, తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి సమీపంలో ఏ రాష్ట్రం కూడా లేదన్నారు. ప్రజల మధ్య గ్రామ గ్రామాన చర్చ జరగాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై విస్తృతంగా ప్రత్యేక చర్చ జరగాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News