Sunday, April 28, 2024

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రసిద్ధ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర్ రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సవత్సరాలు. అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పొత్తూరి వెంకటేశ్వర్ రావు 1934 ఫబ్రవరి 8న ఆంధ్రలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఆంధ్రజనత పత్రికలో పాత్రికేయుడిగా 1957లో ప్రవేశించిన పొత్తూరి జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం,వార్తా పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకుడిగా అనేక సంవత్సరాలు విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో నాటిపత్రికల మేటివిలువలు, 2001 సంవత్సరంలో చింతన, చిరస్మరణీయులు, విధి నాసారథి, పారమార్థిక పదకోశం పుస్తకాలు రచించారు.

మాజీ ప్రధాని పివి పై రాసిన ఇయర్ ఆఫ్ పవర్‌కు సహరచయితగా పనిచేశారు. పొత్తూరి వెంకటేశ్వర్ రావు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.పొత్తూరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమసమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీష్‌రావు.వేముల ప్రశాంత్ రెడ్డి,జగదీష్ రెడ్డి పొత్తూరి వెంకటేశ్వర్ రావు కు సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను మంత్రులు గుర్తు చేస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.జర్నలిజానికి వన్నెతెచ్చిన వ్యక్తుల్లో ఒకరిగా చరిత్రలో పొత్తూరి నిలిచిపోతారని కెటిఆర్ పేర్కొన్నారు.

Senior Journalist Potturi Venkateswara Rao passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News