Monday, April 29, 2024

తెలంగాణ పారిశ్రామిక విధానాలు భేష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో ప్రముఖ ఫార్మా దిగ్గజం కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్రిస్ జియోఫ్రాయ్ (Fabrice Geoffroy), అన్నపూర్ణ దాస్ ఇండియా, సౌత్ ఏషియా జనరల్ మేనేజర్‌లు గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. వీరితో పాటు శాంతా బయోటెక్ చైర్మన్ కెఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపైన చర్చించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల పట్ల సానుకూలంగా ఉన్నట్లు కెటిఆర్‌కు సనోఫి ప్రతినిధి బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, నూతన పెట్టుబడులను ఆకర్షించడానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాక్సిన్ క్యాపిటల్ గా రూపాంతరం చెందిందన్నారు. ఇక్కడ వ్యాక్సిన్ తయారీకి, సంబంధిత రంగాల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇకో సిస్టమ్, దాన్ని మరింత బలపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యకలాపాలను మంత్రి కెటిఆర్ వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉండటంతో పాటు అద్భుతమైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2021 సంవత్సరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇప్పటికే అనేక ఫార్మా దిగ్గజం కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం లో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో సనోఫి కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాల కోసం కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకుకైన తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశాంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు.

Sanofi delegation Meet with Minister KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News