Monday, April 29, 2024

విప్లవ కిశోరం చంద్రశేఖర్ ఆజాద్

- Advertisement -
- Advertisement -

నేడు సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతోంది. చదువు, ఉద్యోగం, కుటుంబం తప్ప సమాజం, దేశం కోసం పని చేయాలనే తపన తగ్గిపోతోంది. నాకేంటి? అనే స్వార్థం ఆవరిస్తోంది. చుట్టూ అన్యాయం జరుగుతున్నా, నిర్బంధం కొనసాగుతున్నా స్పందించలేకపోతున్నాం. నిర్బంధాన్ని, అణచివేతను తన జీవితంలో ఏ కోశానా ఒప్పుకోని అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తి. ఇయ్యాల ఆయన జయంతి సందర్భంగా ఆ వీరుడి స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఒంట్లో రక్తం మరగకుంటే, మీ నరాల్లో ప్రవహించేది నీరు అనుకోవాలి. యువతలోని ఉత్తేజం మాతృదేశం కోసం ఉపయోగపడకుంటే అది నిస్తేజమే. కాబట్టి మన దేశం స్వేచ్ఛ పొందాల్సిందే. స్వతంత్రం రావాల్సిందే. ఇందుకోసం నేను శత్రువు తూటాలకైన ఎదురొడ్డి నిలబడతాను అంటూ తెల్లదొరల పాలిట సింహ స్వప్నంలా మారిన సమర నినాదం చంద్రశేఖర్ ఆజాద్. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా,

అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీష్ వారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మన దేశం గర్వించదగ్గ అసమాన వీరుడు. భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జులై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు. 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆజాద్ ఆ తరువాత 1921లో మహాత్మా గాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు. అయితే విచారణ సందర్భంగా కోర్టులో నీ పేరేంటి? అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో ఆజాద్ అని అరచి చెప్పారు. ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారత దేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించి భగత్ సింగ్, సుఖదేవ్ తదితరులకు మార్గ నిర్దేశకుడిగా మారిపోయారు. ఆజాద్ 1926లో కకోరీ ట్రైన్ దోపిడీ, అదే సంవత్సరంలో వైశ్రాయి రైలును కాల్చివేయడం, లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగ తీర్చుకోవడానికి 1928వ సంవత్సరంలో లాహోర్‌లో జె.పి. సాండర్స్‌ను హత్య చేయడం తదితర హింసాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఒకానొక దశలో ఆజాద్ బ్రిటీష్ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచారు. పోలీసుల హిట్ లిస్ట్‌ను తయారు చేసుకున్న ఆయన వారిని చంపేదాకా వదిలిపెట్టలేదు. పదిహేనేళ్ల ప్రాయంలో అరెస్టయిన తరువాత బయటికి వచ్చి పోరాటంలో పాలుపంచుకున్న ఆజాద్ ఆ తరువాత తన మరణం దాకా కూడా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు. అయితే 1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు.

ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయే దాకా పోరాడిన ఆయన చివరి క్షణం లో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాశారు. చివరి దాకా ఆజాద్‌ను ప్రాణాలతో పట్టుకోవాలని భావించిన బ్రిటీష్ పోలీసులకు సాధ్యంకాక చివరికి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే ఆజాద్‌కు పట్టినగతే పడుతుందని ప్రజల్ని, ఇతర పోరాటకారులకు హెచ్చరిక జారీ చేస్తూ వారు ఆజాద్ మృతదేహాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆజాద్ మరణం ప్రజల్లో మరింత పట్టుదలను పెంచి, దేశభక్తిని రగిల్చింది. పోరాటంలోకి ఉరికేలా ప్రోత్సహించింది. సాయుధ శక్తులు తమ ప్రాణాలు అర్పించినా అలుపెరుగని పోరాటం చేసినా ప్రధానంగా అహింసాయుత పోరాటంగా రూపుదాల్చిన భారత స్వరాజ్య ఉద్యమం బ్రిటీష్ వారి అరాచక పాలనను నిట్టనిలువునా కూల్చివేసింది. భారత మాతను బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విడిపించిన ఎందరో వీరుల బలిదానం ఫలితమే నేటి మన స్వతంత్ర భారత దేశం. అయితే నేడు మన భారత దేశ జనాభా 140 కోట్లకు చేరింది.

దేశ ప్రజల సగటు వయసు 29 సంవత్సరాలకు చేరుకుంది. అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అత్యంత యువ సంపన్న దేశంగా భారత్ నిలిచింది. మన దేశంలో 64% మంది యువతే ఉన్నారు. అయితే నేటి తరం యువతలో పరమత సహనం, దేశభక్తి, నైతిక విలువలు క్షీణించాయి. ఆజాద్ స్ఫూర్తితో దేశం కోసం, సమాజం కోసం ముందుకు కదలాలి. అప్పుడే ఆయన ఆశయాలకు సార్థకత. నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నారు. ఆజాద్ పోరాడిన తీరు భారత దేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News