Saturday, April 27, 2024

మేడిగడ్డలో మీటనొక్కితే.. తెలంగాణ సాగరమే

- Advertisement -
- Advertisement -

Ranganayakasagar

 

జల త”రంగనాయకం” ప్రారంభోత్సవంలో కెటిఆర్
రంగనాయక్ సాగర్‌కు నీటివిడుదల చేసిన కెటిఆర్, హరీష్‌రావు
త్వరలోనే కోటి ఎకరాల మాగాణి
సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో
హరీశ్‌రావుది కీలక పాత్ర
దేశంలోనే అగ్రశేణి
రాష్ట్రంగా నిలువనున్న తెలంగాణ
రాష్ట్రంలోని 40 వేల చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉండాలన్నదే కెసిఆర్ లక్షం
కాలంతో పోటీపడి పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
రాష్ట్రంలో అబ్బురపరిచే నాలుగు విప్లవాలు రాబోతున్నాయి
ప్రతి రైతు కెసిఆర్ తరహాలో కథానాయకుడు కావాలి
ఆనాడు భగీరథుడు దివి నుండి(ఆకాశం) భువికి( నేల) నీటిని తీసుకొస్తే.. ఇవాళ అపరభగీరథడు సిఎం కెసిఆర్ తెలంగాణలో కింది నుండి పైకి గోదావరి నది నీటిని తీసుకురావడం ఒక అద్భుతం

                                                  – రంగనాయక్‌సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వదిలిన సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : సిఎం కెసిఆర్ నాయకత్వంలో త్వరలోనే తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు ఎత్తిపోసే నాలుగు మోటర్లను మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారన్నారు. రా్రష్ట్రంలోని 46 వేల చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నిండు కుండల్లా నింపాలన్నదే సిఎం కెసిఆర్ ముఖ్య లక్షంగా పెట్టుకున్నారన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క బటన్ నొక్కితే రాష్ట్రంలోని అన్ని చెరువులకు గోదావరి జలాలు ప్రవహించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదన్నారు.

నీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే దశాబ్దాల కాలం పట్టేదని, దీన్ని అధిగమించి కాలంతో పోటీపడి కాళేశ్వరంను సిఎం కెసిఆర్ రికార్డు సమయంలో నిర్మించేలా అహర్నిశలు కృషి చేశారన్నారు. కాలువల ద్వారా సాగునీరు అందినప్పుడే పంటలు అత్యధికంగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల నాయకత్వంలో ఇరిగేషన్ బృందాలు శ్రమించి కింది నుండి మీదికి 80 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో మేడిగడ్డ నుండి కొండపోచమ్మసాగర్ వరకు 618 మీటర్ల ఎత్తు నుండి వందలాది మీటర్ల మేర గోదావరి జలాలు తరలించడం సామాన్యమైన విషయం కాదన్నారు. తెలంగాణలో త్వరలో నాలుగు విప్లవాలు రాబోతున్నాయన్నారు. యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచి అగ్రశేణిగా నిలువబోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ, నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టుల కింద ఉన్న భూములకు సైతం సాగునీరు అందనుందన్నారు.

తెలంగాణలో మత్స సంపద అపారంగా పెరిగి దేశ ప్రజలకు అవసరపడే చేపలను అందించే విశ్వాసం ఉందన్నారు. అలాగే పాడి పంటల్లో అబ్బురమైన దృశ్యాలను చూడబోతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలపడడంతో పాటు కుల వృత్తుల వారికి చేతి నిండా పని లభిస్తుందన్నారు. పింక్ రెవెల్యూషన్ కింద మాంసపు ఉత్పత్తుల ప్రక్రియకు బీజం వేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధకుడిగా ఈ ప్రాంతం నుండే ఉద్భవించి తెలంగాణ జాతికి దిశానిర్ధేశం చేశారన్నారు. అదే తరహాలో హరీశ్‌రావు సైతం సిద్దిపేట జిల్లాను అబ్బురపరిచే విధంగా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. సిద్దిపేట ప్రజలు ధన్యజీవులని, హరీశ్‌రావు నాయకత్వంలో ఈ జిల్లా యావత్ దేశానికే ఆదర్శంగా నిలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా జిల్లాలోని 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రతి రైతు కేసీఆర్ తరహాలో కథానాయకుడు కావాలని కోరారు. సిద్దిపేటకు రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమలు వస్తాయన్నారు.

అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాం : హరీశ్
అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి తెలంగాణలోని బీడు భూములకు గోదావరి జలాలు ప్రవహించేలా చేశామని రా్రష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 90 మీటర్ల నుండి గోదావరి జలాలను 490 మీటర్ల ఎత్తులో ఉండే సిద్దిపేటకు తరలించేందుకు ఎంతో శ్రమించామన్నారు. కేసీఆర్ సీఎం కావడంతోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యాయన్నారు. దశాబ్దాల కలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాల కాలం పట్టేదని, అదే సీఎం కేసీఆర్ మూడు సంవత్సరాల్లో కాళేశ్వ రం ప్రాజెక్టును పూర్తి చేసి చరిత్ర సృష్టించారన్నారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆకలి చావులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు గోదావరి జలాలు రావడంతో పంటలు ఎక్కువగా పండి రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయన్నారు.

ఇక ముందు రైతులు కాలంతో, కరెంట్‌తో పనిలేకుండా కాలువల ద్వారా వచ్చే గోదావరి జలాలతో రెండు పంటలను పండించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి నీరే జీవనాధమన్నారు. నీళ్లు ఉన్నచోటే పరిశ్రమలు ఎక్కువగా ఏర్పడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే సిద్దిపేటను జిల్లాగా మార్చుకోవడంతో పాటు గోదావరి జలాలను తెచ్చుకున్నామని, త్వరలోనే రైలు కూత సైతం వినబడబోతుందన్నారు. రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురి కాలేదని, అలాగే ఏ ఒక్క కేసు నమోదు కాకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. 170 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహించి రంగనాయకసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలా లు రావడంతో తన జన్మ సార్థకమైందన్నారు. సిద్దిపేటకు ఐటీ, పరిశ్రమలు వచ్చేలా చొరవ చూపాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నానన్నారు. రంగనాయకసాగర్ ప్రాజె క్టు నిర్మాణంలో నిరంతరం కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతిధులు, ఇంజనీర్లు, కూలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, వొడితెల సతీష్‌కుమార్, రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీఛైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్, కాళేశ్వరం ఈఎన్‌సీ హరేరామ్ ఉన్నారు.

 

Started by Ranganayakasagar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News