Monday, April 29, 2024

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

 Inter and Tenth Exams

 

నేలమీద కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితిని ఉపేక్షించేది లేదు, కేంద్రాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలు, బల్లల మీదనే కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని, నేల మీద కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈనెల 4 నుంచి ఇంటర్ పరీక్షలు, 19 నుంచి పదవ తరగతి పరీక్షల ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ ఆయా విభాగాల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాల భవనాలు, ఫర్నీచర్, త్రాగునీరు, లైటింగ్, సిసి కెమెరాల తదితర వసతులపై స్పెషల్ సిఎస్ సమీక్షించారు. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు(డిఐఇఒ), జిల్లా విద్యాధికారులు(డిఇఒ) ఆయా జిల్లాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించి ఇంటర్, టెన్త్ పరీక్షల సమయాలు, పరీక్షా కేంద్రాల లోకేటర్ యాప్, హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించేందుకు స్టూడెంట్ కౌన్సిలర్లు విద్యార్థులతో మాట్లాడాలని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సహాయం అందించేందుకు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఆర్‌టిసి, విద్యుత్ శాఖ, పోస్టల్, రెవిన్యూ, ఆరోగ్యశాఖ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.

పరీక్షా కేంద్రాలు సకాలంలో పోలీసు ఎస్కార్ట్‌తో ప్రశ్నపత్రాలు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని డిఇఒలకు సూచించారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే స్టూడెంట్ కౌన్సిలర్ల వివరాలు పత్రికలు, మీడియాలో ప్రచురించాలని కోరారు. ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మార్చి 19 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లాల సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయని, ఈ నెల 12వ తేదీ నాటికి తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.

Strong Arrangements for Inter and Tenth Exams
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News