Monday, April 29, 2024

తమిళనాడులో వన్నియార్ల రిజర్వేషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -

 

Tamil Nadu's 10.5% Vanniyar Quota Cancelled By Supreme Court
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల అడ్మిషన్లలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి) కమ్యూనిటీకి చెందిన వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేస్తూ ఇదివరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. వన్నియార్ కమ్యూనిటీ సాపేక్ష వెనుకబాటును చూపించడానికి తగిన డేటా లేకుండా, కేవలం సంఖ్యల ఆధారంగా మాత్రమే కల్పించారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఎంబిసిలలోని ఇతరులతో పోలిస్తే వన్నియార్ కులస్థులను ప్రత్యేక సమూహంగా పరిగణించడానికి చట్టం ఎటువంటి గణనీయమైన ప్రాతిపదికను అందించలేదని అభిప్రాయపడింది. కాబట్టి 2021 చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. చట్టాన్ని రూపొందించే రాష్ట్ర అధికారంపై ఎటువంటి సంకెళ్లు వేయనప్పటికీ, అటువంటి అంతర్గత రిజర్వేషన్లకు కులమే ప్రాతిపదికగా ఉన్నప్పటికీ, అది ఏకైక ప్రాతిపదిక కాదని కోర్టు తీర్పు చెప్పింది.
ఇంద్ర సాహ్ని కేసులో సుప్రీంకోర్టు తీర్పును బెంచ్ ప్రస్తావిస్తూ ‘కుల ఆధారిత వర్గీకరణ సమస్యపై కులమే ప్రారంభ బిందువు కావొచ్చు. కానీ ఏకైక ప్రాతిపదిక కాదని పేర్కొంది. అదేవిధంగా, అంతర్గత రిజర్వేషన్లు అందించడానికి కులం ప్రారంభ బిందువు కావచ్చు, అయితే నిర్ణయం సహేతుకతను సమర్థించడం, కులం మాత్రమే ఆధారం కాదని నిరూపించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.
ఎన్నికలకు కొద్ది సమయం ముందు అప్పటి ఎఐఎడిఎంకె ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వనియార్ల సామాజికవిద్యా స్థితిపై గణించదగిన డేటా లేకుండా చేసిందని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడు వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ సిఫార్సులను ఆమోదించడంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని, వాటి ఆధారంగా జనార్థనం కమిషన్ నివేదిక ఆధారంగా చట్టం చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News