Monday, April 29, 2024

దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు..

- Advertisement -
- Advertisement -

Talasani and Indrakaran review on Orchard lands Protection

మనతెలంగాణ/హైదరాబాద్: దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, భూములను ఆక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు బుధవారం దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ భూముల పరిరక్షణకు, నిరుపయోగంగా ఉన్న ఆలయ భూములను గుర్తించి వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రులు దిశానిర్ధేశం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహారించాలని వారు అధికారులను ఆదేశించారు.
లీజు నిబంధనలు మార్చి మరింత ఆదాయం వచ్చేలా..
లీజు నిబంధనలు మార్చి దేవాదాయ శాఖకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. దశాబ్ధాల క్రితం నాటి లీజ్‌లతో పాటు అద్దెలను పునః సమీక్ష చేసుకోవాలన్నారు. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో రూ.55 కోట్ల వ్యయంతో 13 ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, కళ్యాణమండపాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని కమిషనర్ అనిల్‌కుమార్ మంత్రులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా 1300 ఎకరాల ఆలయ భూములను గుర్తించి వెనక్కి తీసుకున్నామని, 21 వేల ఎకరాల ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
కోర్టు కేసులు గెలిచేలా లీగల్ ఆఫీసర్లను నియమించాలి
దీర్ఘకాలికంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దేవాదాయ శాఖ భూములపై ఉన్న వివాదాలను పరిష్కరించేం దుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అవసరమైతే లీగల్ ఆఫీసర్లను నియమించాలని మంత్రులు సూచించారు. పోలీసు శాఖ సమన్వయంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, భూ ఆక్రమదారులను ఖాళీ చేయించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, దేవాదాయ శాఖ అండ్ విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ శేఖర్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్, సికింద్రాబాద్ సహాయక కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Talasani and Indrakaran review on Orchard lands Protection

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News