Monday, April 29, 2024

తమిళ గవర్నర్ మరో అతిక్రమణ!

- Advertisement -
- Advertisement -

హద్దులు మీరడం అలవాటైపోయిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరొక సారి అదే పనికి పాల్పడ్డారు. గతంలో శాసన సభ వేదిక మీది నుంచి ప్రభుత్వం తరపున చదవవలసిన ప్రసంగ పాఠంలో సొంత అభిప్రాయాలు చొప్పించి అందుకు పాలక పక్షం నుంచి అభ్యంతరం వెల్లడి కాగానే అర్ధంతరంగా సభను వీడి వెళ్ళిపోయిన రవి ఈసారి తన అధికార పరిధిని అతిక్రమించి తనంతట తానుగా ఒక మంత్రిని తొలగించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి నాలుక కరచుకొని ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొన్నట్టు వార్తలు చెబుతున్నాయి. కాళ్ళు కడుగుకొన్నం త మాత్రాన అడుసు తొక్కిన వాస్తవం చెరిగిపోదు కదా! మొదటి నిర్ణయం గైకొన్న తర్వాత కొంత సేపటికి ఆయనలో జ్ఞానోదయమైనట్టు దానితో ఆ నిర్ణయాన్ని ఊగిసలాటలో వుంచుతున్నామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు రాజ్‌భవన్ వర్గాలు తెలియజేశాయని సమాచారం.

కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల బొత్తిగా భయ, గౌరవాలు లేవని ఇటువంటి గవర్నర్ల నడవడిక వల్ల బోధపడుతున్నది. కేరళ, తెలంగాణ, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు పని కట్టుకొని అక్కడి ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బందుల్లో పెడుతున్న సంగతి బహిరంగ రహస్యమే. సెంథిల్ బాలాజీ అనే తమిళనాడు మంత్రిని ఆయనపై గల గత కాలపు ఆరోపణలకు సంబంధించి ఇడి ఈ నెల 14న అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయనను తొలగించాలని గవర్నర్ పట్టుపడుతూ వచ్చారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు వున్న కారణంగా ముఖ్యమంత్రి స్టాలిన్ అప్పగించిన శాఖ నుంచి ఆయనను తొలగించి మంత్రిగా మాత్రం కొనసాగిస్తున్నారు. ఇది గిట్టని గవర్నర్ గురువారం నాడు తనంత తానుగానే ఆయనను బర్తరఫ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సలహా మేరకే తాను తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నానని గవర్నర్ ప్రకటించారు. గవర్నర్ ఏమి చేయాలో, ఏమి చేయకూడదో రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నది. 155వ అధికరణ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

156వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి సమ్మతి వున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతారు. గవర్నర్‌కు ఆ పదవిలో కొనసాగే ఉద్దేశం లేకపోతే రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పించి తప్పుకోవచ్చు. 163 అధికరణ ప్రకారం గవర్నర్‌కు సహకరించడానికి, సలహా ఇవ్వడానికి రాష్ట్రంలో మంత్రి మండలి ఒకటి ఏర్పాటవుతుంది. 164 ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. మంత్రులను ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ నియమిస్తారు. ఈ నిర్ధారణల ప్రకారం ముఖ్యమంత్రి సిఫారసు మేరకే మంత్రిని నియమించే అధికారం గవర్నర్‌కు వుంటుంది. అలాగే క్షమాభిక్షలు పెట్టడం వంటి కొద్ది విషయాల్లో తప్ప గవర్నర్ పూర్తిగా మంత్రివర్గ సిఫారసుల మేరకే పని చేయవలసి వుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాలు ప్రజలెన్నుకొనే శాసన సభలో మెజారిటీ ప్రకారం నియమితులవుతారు. గవర్నర్లు మాత్రం కేవలం కేంద్రం నియమించే దాని ఏజెంటుగా మాత్రమే రాజ్‌భవన్లను అలంకరిస్తారు. శాసన సభల సంయుక్త సమావేశాల్లో లేదా శాసన సభ సమావేశాల్లో గవర్నర్ల ప్రసంగాలు కూడా వారి సొంత ఇష్టం మీద ఆధారపడి రూపొందవు.

పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి (ఆర్టికల్ 87) ప్రసంగాన్ని గాని, శాసన సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని గాని, వారి సొంత మాటలతో కూర్చడానికి వీలు లేదు. అవి ఆయా ప్రభుత్వాల అభిప్రాయాలనే కలిగి వుంటాయి. ఆ ప్రభుత్వాలు తయారు చేసిన ప్రసంగాలనే రాష్ట్రపతి గాని, గవర్నర్ గాని చదవవలసి వుంటుంది. గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గం సిఫారసుల మేరకే వ్యవహరించవలసి వుండాలని ఇంత స్పష్టంగా వున్నప్పుడు ఆ పదవిలోని వ్యక్తి ఇంకొక విధంగా వ్యవహరించడానికి వీలు లేదు. ముఖ్యంగా మంత్రుల నియామకానికి సంబంధించి శాసన సభలో మెజారిటీ మద్దతును అనుభవిస్తున్న ముఖ్యమంత్రిదే అధికారం అని తేటతెల్లంగా వుంది. అటువంటప్పుడు గవర్నర్ తనకు ఏ మంత్రి విషయంలోనైనా అభ్యంతరాలుంటే ఆ సంగతిని ముఖ్యమంత్రికి తెలియజేయాలే గాని,

తనంత తానుగా ఆ మంత్రిని బర్తరఫ్ చేయడానికి బొత్తిగా వీలు లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు గవర్నర్ సమ్మతి మేరకే కొనసాగాలని వున్నప్పటికీ ప్రజలెన్నుకొన్న శాసన సభలలో మెజారిటీయే అంతిమంగా ఆ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం కొనసాగించడం లేదా కొడిగట్టడం అనే దానిని నిర్ధారిస్తుంది. ఇంత సూక్ష్మంగా తన అధికార పరిధులు నిర్వచించబడినప్పటికీ బిజెపి హయాంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు తమ హద్దులు మీరి వ్యవహరిస్తూ వుండడం రాజ్యాంగానికే ముప్పును సూచిస్తున్నది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికైనా తమ గవర్నర్లను దారిలో పెట్టి రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News