Monday, April 29, 2024

దిగొచ్చిన గవర్నర్..

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సోమవారం తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుకు సోమవారం హుటాహుటిన ఆమోదం తెలిపారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ గేమ్స్ నిషేధ సంబంధిత బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత దీనిని గవర్నర్ 131 రోజుల పాటు తన వద్ద పెట్టుకుని తిప్పి పంపారు. దీనితో అసెంబ్లీ దీనిని తిరిగి ఆమోదించి తిరిగి గవర్నర్‌కు రెండోసారి ఆమోదానికి పంపించింది. అయినప్పటికీ గవర్నర్ నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయమే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం ఆమోదించారు. గవర్నర్ నిర్ణీత సమయంలో బిల్లులకు అనుమతి ఇచ్చేలా చూడాలని, లేకపోతే ప్రజల జీవన్మరణ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందనలు పనికిరాకుండా పోతున్నాయని బిల్లులో పేర్కొన్నారు.

గవర్నరు అనుమతి వెలువరించేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి, కేంద్రానికి ఈ తీర్మానంలో విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానం వెలువడ్డ కొద్ది సేపటికే గవర్నర్ నుంచి సంబంధిత బిల్లుపై ఆమోదం దక్కింది. రాష్ట్ర గవర్నర్ రవి తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతూ వచ్చింది. తాను బిల్లును పెండింగ్‌లో పెట్టడమే కాకుండా ఆయన ఇటీవల సివిల్ సర్వీస్ అభ్యర్థుల బృందంతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బిల్లులను తొక్కిపెట్టి ఉంచడం, వాటిని తిరస్కరించే ఉత్తమ మార్గం అని వ్యాఖ్యానించారు. ఇటువంటి బిల్లులను మృతబిల్లులు అని పేర్కొన్నారు. కొన్ని బిల్లులను చావకుండా బతకకుండా చేయవచ్చునని గవర్నర్ చెప్పడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఆయన వైఖరికి నిరసనగా తీర్మానం వెలువరించింది.

తమిళనాడులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ , ఆన్‌లైన్ గేమ్స్ కార్యకలాపాలతో పలువురు భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడం, చివరికి ఈ జూదాలకు అలవాటుపడి వ్యసనంగా మారడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనితో పలు ప్రాంతాలలో బాధిత కుటుంబాల నుంచి ఆందోళన వ్యక్తం అయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని డిఎంకె ప్రభుత్వం నిషేధ సంబంధిత బిల్లును తీసుకువచ్చింది. గత అన్నాడిఎంకె ప్రభుత్వం కూడా వీటిని నియంత్రిస్తూ చట్టం తీసుకువచ్చినా, కోర్టు ఈ నిర్ణయం చెల్లనేరదని తీర్పు వెలువరించడంతో రాష్ట్రంలో తిరిగి ఆన్‌లైన్ జూదాలు అడ్డగోలుగా సాగింది. డిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత ఆన్‌లైన్ దురాగతాలను తీవ్రంగా తీసుకుని పూర్తి స్థాయిలో దీనికి కళ్లెం వేసేందుకు నిర్ణయించుకుంది.

రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె చంద్రూ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికలోని సిఫార్సులను ప్రాతిపదికగా చేసుకుని బిల్లు తీసుకువచ్చారు. ప్రజలకు ప్రాణాంతకంగా మారిన వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడం వల్ల ప్రజలకు మేలు జరుగుందనే విషయాన్ని గవర్నర్ పట్టించుకోకపోవడం, బిల్లును తొక్కిపెట్టి ఉంచడం ఎంతవరకు సబబు అని, అందుకే ఆయనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురాక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News