Monday, April 29, 2024

కేంద్రానికి వ్యతిరేకంగా 2 తీర్మానాలు

- Advertisement -
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఆమోదం

చెన్నై: కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదలను అడ్డుకుంటూ తమిళనాడు శాసనసభ రెండు తీర్మానాలను బుధవారం ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్ర శాసనసభ ఈ విధంగా తీర్మానాలను ఆమోదించకపోవడం విశేషం. తాజా జనాభా గణాంకాల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం, అసెంబ్లీలకు, లోక్‌సభకు జమిలి ఎన్నికలు నిర్వహించే ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ జనాభా నియంత్రణను పటిష్టంగా అమలు చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు. జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు బహుమానం ఇచ్చే విధంగా ఈ ప్రతిపాదన ఉందని ఆయన అన్నారు.

ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రక్రియను నిర్వహిస్తే తమిళనాడుతోసహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు అధికారంతోపాటు తమ హక్కులను కూడా కోల్పోవలసి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1971లో తమిళనాడు, బీహార్ జనాభా ఒకే విధంగా ఉందని, గత ఐదున్నర దశాబ్దాలలో బీహార్ జనాభా తమిళనాడు కన్నా ఒకటిన్నర రెట్లు పెరిగిందని స్టాలిన్ తెలిపారు. ఇప్పటికే 39 మంది ఎంపీలు ఉండి కూడా తాము కేంద్రాన్ని అడుక్కుంటున్నామని, ఈ సంఖ్య మరింత తగ్గితే తమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఒక దేశం, ఒకే ఎన్నికలు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ప్రజాస్వామిక వికేంద్రీకరణకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఇది ఆచరణ సాధ్యం కానిదని, రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని ఆయన అన్నారు.

భారత్ వంటి విస్తృత, భిన్న ప్రజా సంబంధ సమస్యల ఆధారంగా వివిధ సమయాలలో స్థానిక సంస్థలు, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమంట్ ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. డిఎంకె మిత్రపక్షాలైన కాంగ్రెస్, సిపిఐ తదితర పార్టీలు ఈ తీర్మానాన్ని బలపరిచాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె సెల్వపెరుంతగై మాట్లాడుతూ ఎన్నికల వల్ల దేశంపై అధిక భారతం పడుతోందన్న వాదన నిజం కాదని, దేశ బడ్జెట్‌లో ఇది కేవలం ఒక శాతం మాత్రమేనని అన్నారు.

ఇటీవలే బిజెపితో సంబంధాలు తెగతెంపులు చేసుకున్న ప్రధాన ప్రతిపక్షం ఎఐఎడిఎంకె ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి షరతులతో కూడిన మద్దతు ఇవ్వగా నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతును తెలిపింది. కాగా, బిజెపి శాసనసభ్యుడు వానతి శ్రీనివాసన్ నియోజకవర్గాల పునర్విభజన తీర్మానాన్ని బలపరచగా ఒక దేశం, ఒకే ఎన్నికల తీర్మానాన్ని వ్యతిరేకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News