Monday, April 29, 2024

అమ్మభాషలోనే బోధన!

- Advertisement -
- Advertisement -

శిశువు మొదటిసారిగా తాను ఒక భాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి భాషణాన్ని అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భాషే మాతృభాష. శిశువు జన్మించినప్పటి నుంచి తన గృహ వాతావరణంలో లేదా సంఘ వాతావరణం లో ఏ భాషనైతే నేర్చుకుంటుందో లేదా ఏ భాషలో తన భావాలను, ఆలోచనలను స్పష్టంగా ధారాళంగా ఎట్టి తడబాటు లేకుండా ప్రకటించగలుగుతుందో అదే ఆ శిశువు మాతృభాష అని చెప్పవచ్చు. మాతృ స్తన్యంతో పాటు శిశువుకు ఏ భాష సంక్రమిస్తుందో అదే ఆ శిశువు మాతృభాష -అని మహాత్మ గాంధీ, శిశువు తన జాగ్రదావస్థలో ఏ భాషలో మాట్లాడతాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాష అని రైబార్న్ బల్లార్డ్, బాల్యం నుండి పరిచయాధిక్యం కలిగిన భాషయే మాతృభాష అని నెల్లుట్ల వెంకటేశ్వరరావు మాతృభాషను నిర్వచించారు. ‘మదర్ టంగ్’ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా నేడు మాతృభాష అనే పదం తెలుగులో వ్యవహారం ఉంది. మనకు మాతృభాష అనే పదం వాడుకలోకి రాకముందు అంటే 18వ శతాబ్దం వరకు భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న భాషలను దేశ భాషలని వ్యవహరించేవారు. అన్ని విద్యలకు భాషే ముఖ్యాధారం. విద్యాభ్యాసం పరభాషలో అభ్యసించడం కంటే మాతృభాష ద్వారా సులభంగా అభ్యసించడం జరుగుతుంది. పూసలలో దారం ఉన్నట్లు మాతృభాష అన్ని విషయాలలో అంతర్గతంగా ఇమిడి ఉంటుంది. కాబట్టి విద్యకు, భాషకు ఎంతో సంబంధం ఉందని చెప్పవచ్చు. మానవుడు మాతృభాష అభ్యసనం ద్వారా ఉన్నతమైన విలువలను పొందుతాడు. మాతృభాష బోధన విలువలు రెండు రకాలు. అవి 1. సామాన్య విలువలు 2. ప్రత్యేక విలువలు. మనిషి సంఘజీవి కావున సంఘంలో ఉన్న మానవులందరు ధర్మం, న్యాయం, సత్యం, నీతి, దయ, ప్రేమ, స్నేహం మొదలైన విలువలను కలిగి ఉండాలి. సామాన్య విలువలు వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని రెండు విధాలు. ప్రతి వ్యక్తికి కొన్ని అంతర్గత లక్షణాలు ఉంటాయి. మాతృభాష బోధన వల్ల దుష్ట లక్షణాలు సమసిపోయి మంచి లక్షణాలు అలవడుతాయి. మాతృభాషలోని ఉత్తమ సాహిత్యపఠనం ద్వారా మనిషిలో మంచి విలువలు పెంపొందుతాయి. మంచి వైఖరులు కలుగుతాయి. వీటినే వైయక్తిక విలువలు అంటారు. వైయక్తిక విలువల నుంచే సామాజిక విలువలు కలుగుతాయి. ఐకమత్యం, దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహం మొదలగునవి సామాజిక విలువలు. ఇవి సాహిత్యం ద్వారా పెంపొందుతాయి. కళారాధన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మాతృభాష ఇతోధికంగా తోడ్పడుతుంది. మాతృభాష బోధన వల్ల కొన్ని ప్రత్యేక విలువలు అలవడుతాయి. మానవ చరిత్ర, దేశ చరిత్రలను పరిశీలించడం ద్వారా మానవ అభ్యుదయానికి కొన్ని ప్రత్యేక విలువల ఆవశ్యకత ఉందని తెలుస్తుంది. ఆ విలువలు కలిగి ఉంటే శాంతి సద్భావనలు నిలుస్తాయి. ఇందుకోసం మాతృభాష ఉపయోగపడుతుంది. కవులు, రచయితలు, సంఘసంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించడం ద్వారా ప్రత్యేక విలువలను పెంపొందించవచ్చు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరి మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన అనేది తప్పనిసరి చేయాలి. కర్నాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల మాదిరిగా కనీసం ప్రాథమిక పాఠశాల విద్య వరకైనా మాతృభాషా మాధ్యమంలో బోధించేటట్లుగా తప్పనిసరి చేయాలి. ప్రతి విద్యాదశలోను మాతృభాషను అందరూ చదవడం అవసరం. బ్రిటిష్ వారు అనుసరించిన మెకాలే విద్యా విధానం తరహాలో కనీసం ప్రాథమిక స్థాయిలోనైనా మాతృభాషా మాధ్యమంలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉంటుందని లేకపోతే ఉండదని ప్రభుత్వం ఒక జిఒజారీ చేస్తే తప్పనిసరిగా మాతృభాషా మాధ్యమానికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో రోజురోజుకు ఆంగ్ల భాషకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు, పాలకులు, అధికారులు ఆంగ్లభాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని మాతృభాషా మాధ్యమానికి ప్రాధాన్యతనిస్తూ దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసి మాతృభాషా మాధ్యమంలోనే విద్యా బోధన జరిగేటట్లు ప్రభుత్వం, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృభాషలు మనగలుగుతాయి. లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. మన మాతృభాషయైన తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News