Monday, April 29, 2024

ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

Telangana govt buying Rice

 

జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. శనివారం స్థానిక వైష్ణవి గార్డెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరం కరోనా కష్ట కాలంలో ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన తెలిపారు. గతంలో జిల్లా అంతటా కరువు ఉండేదని, ఇప్పుడు ఎండాకాలంలో చెరువులు అలుగు పారుతున్నాయని అన్నారు. దేవాదులతో భూగర్భజలాలు పెరిగి, ప్రతి చెరువు, బావుల్లో నీరు పుష్కలంగా చేరిందని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తు, పంట పెట్టుబడి, సాగునీరు ఇచ్చామని, పంట కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

కేంద్రం వరి కొనట్లేదని, భారత ఆహార సంస్థ చాలా ఇబ్బంది పెడుతున్నదని ఆయన అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. వ్యవసాయ అధికారులు యాసంగిలో ఏ పంట వేస్తే, ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది, ఎక్కువ లాభం వుంటుందో సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్య పరుస్తారని ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు రైతులకు ఈ దిశగా అవగాహన కల్పించాలన్నారు. వరితో పాటు ఇతర పంటలు లేపాక్షి పల్లి పంట వేస్తే ఎకరాకు 2 నుండి 3 లక్షలు, డ్రాగన్ ఫ్రూట్ పంటతో ఎకరానికి కనీసం 5 లక్షల లాభాలు ఉంటాయని, మార్కేట్ లో ఎంతో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. జిల్లాలో తేమశాతం పెరగడంతో పామ్ ఆయిల్ సాగుకు అనుకూలంగా ఉంటుందని, జిల్లాలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ మూడేండ్లలో సిద్ధం కానున్నట్లు ఆయన అన్నారు.

పామ్ ఆయిల్ పంటకు కోతుల, రోగాల బెడద ఉండదని, ఎకరాకు 36 వేల సబ్సిడీ వస్తుందని, లాభసాటిగా ఉంటుందని, ఈ పంట వేసేట్లు రైతులను ప్రోత్సాహించాలన్నారు. వరి కంటే ఎక్కువ లాభాలు వచ్చే పంటలను ప్రోత్సాహించాలన్నారు. దేశంలో వేరే ఏ రాష్ట్రంలో వరిని కొనడం లేదని, ప్రతి సంవత్సరం 2 వేల 5 వందల కోట్లు నష్టం వస్తున్న రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి కోరారు.

సర్పంచులు, ఎంపిటిసిలు రవాణాపరంగా కొనుగోలు కేంద్రాల వారికి సహకరించాలని ఆయన తెలిపారు. ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించి ప్రక్రియ పర్యవేక్షణ చేయాలన్నారు. నవంబర్ 6 నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన కోరారు. వడ్లు దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో లక్షా ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 93 ఐకెపి, 65 పిఏసిఎస్, ఒకటి ఇతర, మొత్తం 159 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసామన్నారు. ప్రతి కేంద్రంలో బ్యానర్ ఏర్పాటుచేయాలని, బ్యానర్ పై మద్దతు ధర ప్రదర్శించాలని ఆయన అన్నారు. కేంద్రంలో కనీస మౌళిక వసతుల కల్పన బాధ్యత కేంద్ర నిర్వాహకులదేనని ఆయన తెలిపారు. కేంద్రంలో రాత్రి పూట వెలుతురు ఉండేలా చూడాలని, మహిళలకు తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాటు చేయాలని అన్నారు.

కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ,  ఒకప్పుడు త్రాగునీరు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు సాగునీరు నిండుగా ఉందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలన్నారు.
కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, రైతును రాజుగా చేయడానికి, రైతు కష్టాలు తీర్చడానికి, రైతు ఆత్మహత్యల నివారణకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంట పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందించడంలో పాటు, రైతుల మౌళిక అవసరాలన్ని తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం రావాలని, ఈ దిశగా రైతులు చైతన్యం కావాలని అన్నారు.
ఈ సమావేశంలో డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణా రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బి. విజయ, జనగామ ఆర్డీవో మధు మోహన్, డిసిఓ కిరణ్ కుమార్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట నారాయణ గౌడ్, జిల్లా అధికారులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, కేంద్రాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News