Monday, April 29, 2024

అద్భుతమైన అభివృద్ధి దిశగా తెలంగాణ: ఎమ్మెల్యే వొడితల

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: ప్రభుత్వ పాలన వ్యవస్థ గ్రామస్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు అని తద్వారా అద్భుతమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తుందని సిఎం కెసిఆర్ దార్శనికతకు నిదర్శనం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరించారు. అంతకుముందు పట్టణంలోని స్థానిక ఎంపిడిఓ ఆఫీస్ ఆవరణలో అర్ అండ్ బి జాతీయ ఉప కార్యనిర్వాహన ఇంజనీరింగ్ కార్యాలయం తోపాటు మార్కెట్ యార్డ్ పక్కన ఆర్ అండ్ బి సబ్ డివిజనల్ ఆఫీస్ కార్యాలయంను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ జిల్లాల విభజనతో పాలన వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సమీకృత ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు నిర్మాణంతో పలు ప్రభుత్వ విభాగాలు అన్నిటిని ఒకే ఆవరణలోకి తీసుకురావడంతో ప్రజల సమయం వృధా కాకుండా సత్వరం వారి సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రక్షాళన సంస్కరణల అమలుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రగతి పథంలో శరవేగంగా దూసుకుపోతుందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం సబ్బండ వర్గాల సంక్షేమ అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిచిందని, సుమారు 7 వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గం అన్ని రంగాలలో సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక హుస్నాబాద్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటు తోపాటు సుమారు 13 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ నియోజకవర్గానికి తలమానికంగా నిలుస్తుందని, త్వరలోనే ప్రాజెక్టు గోదావరి నీటితో నిండుకుండలా మారనుందని తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. బిసి, మైనారిటీ ,ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ క్లాస్ తోపాటు ఇంటర్మీడియట్ కేజీబీవీలు, మోడల్స్ స్కూల్ లు ప్రారంభించడంతో హుస్నాబాద్ ప్రాంతం విద్య హబ్‌గా మారిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు.

మిషన్ కాకతీయ ద్వారా సుమారు 700 చెరువులు పునర్నిర్మాణం చేసుకోవడంతో జలకళ సంతరించుకుందని తెలిపారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడగల ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ఆర్థిక, వైద్యా రోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో శంకుస్థాపన, ప్రారంభించుకోవడం జరిగిందని తద్వారా ఈ ప్రాంతంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. మండలంలోని పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయం మండపం అభివృద్ధి కోసం సుమారు 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ భవన నిర్మాణంను సుమారు రెండు కోట్ల రూపాయలతో ప్రారంభించగా అదనపు నిధుల కోసం మంత్రి కెటిఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని, ఎంపిడిఓ ఆఫీస్ కూడా నిర్మించుకోవడం, 2500 టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ యార్డ్ గోదాములను పదివేల టన్నుల సామర్థ్యం గల గోదాములు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

సుమారు మూడు కోట్లతో బంజారా భవన్, వ్యవసాయ మార్కెట్ ఆఫీస్, రైతు వేదికలు, 16 సబ్ స్టేషన్లు, 1100 యూనిట్ల దళిత బంధు గ్రౌండ్ చేశామని త్వరలోనే మూడు వేల గృహలక్ష్మి యూనిట్లు మంజూరు అవుతాయని తెలిపారు. ప్రతి మండలానికి 8 ట్రాక్టర్ల చొప్పున మొత్తం 56 ట్రాక్టర్లు రైతులకు సబ్సిడీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 103 కోట్ల కళ్యాణ లక్ష్మి, 695 కోట్ల ఆసరా పెన్షన్, 810 కోట్ల రైతుబంధు, 60 కోట్ల రైతు బీమా అందించడం జరిగిందని వివరించారు. హుస్నాబాద్ పట్టణంలో అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్ల సౌకర్యం, మున్సిపల్ కాంప్లెక్స్ కూరగాయల మార్కెట్, ఏఎంసి ద్వారా రైతు బజార్ నిర్మించడం జరిగిందని, నేషనల్ హైవే రావడం, ఇందుర్తి నుంచి హుస్నాబాద్ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

రైతుల సాగునీరుకు ప్రత్యేక కృషి

రాష్ట్రం ఏర్పడక సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ రైతుల సాగునీరుకు ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సుమారు 27 వేల ఎకరాలకు, దేవాదుల ద్వారా ధర్మసాగర్ నుండి ఎలుకతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు 17 ఎకరాలకు, సింగరాయ ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. 0.5 టిఎంసి నుంచి 1 టిఎంసి పెంపు ద్వారా శనిగరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేసి 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 70000 ఎకరాలకు సాగునీరు మొత్తం 1 లక్ష 6 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఎంపిపిలు లకావత్ మానస, లక్ష్మీ బిల్ నాయక్, జడ్పిటిసి భూక్యమంగా, ఏఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News