Monday, April 29, 2024

నెలాఖరులోగా వరంగల్ ఆస్పత్రికి టెండర్లు

- Advertisement -
- Advertisement -

Tenders for Warangal Hospital by end of Dec:Harish rao

జనవరి మొదటివారంలో
నిర్మాణాలు ప్రారంభించాలి
వేగవంతంగా ఎనిమిది
మెడికల్ కాలేజీల భవన
నిర్మాణాలు త్వరలో నాలుగు
టిమ్స్ ఆస్పత్రులకు సిఎం
కెసిఆర్ శంకుస్థాపన ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఉచితంగా కార్పొరేట్
వైద్యం : ఆరోగ్య మంత్రి
టి.హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరా బాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రూ. 1,100 కోట్లతో నిర్మాణానికి పరిపాలన అనుమతులు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అన్నారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో నూతనంగా నిర్మించే 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నలువైపులా నిర్మించే నాలుగు టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో శంకుస్ధాపన చేస్తారని మంత్రి వెల్లడించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై సోమవారం బిఅర్‌కె భవన్‌లో ఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా కాలేజీలకు సంబంధించిన డిజైనింగ్ ఏజెన్సీలు, అధికారులతో మంత్రి చర్చించారు. కాలేజీల నమూనాలను సిఎస్, హెల్త్ సెక్రెటరీ, సంబంధిత ఇతర వైద్య అధికారులతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. ఇదే సమయంలో 8 నూతన మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే మారుమూల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు

నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం ఉండాలని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట డిజైన్లు ఎన్‌ఎంసి నిబంధనల ప్రకారం రూపొందించాలని చెప్పారు. వైద్యాధికారులు, ఇంజినీరింగ్ విభాగం, ఎన్‌ఎంసి నిబంధనల మేరకు మరోసారి మంగళవారం సమీక్షించుకుని పూర్తి స్థాయి నమూనాలను, అంచనాలను రూపొందించాలని అన్నారు. ఆధునిక పద్దతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా రూపొందించాలని పేర్కొన్నారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా అన్ని కళాశాలల నమూనాలను వీక్షించారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబిబిఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయని తెలిపారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టర్షియరి కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కర్యదర్శి సోమేష్ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస రావు, కాళోజీ వర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, అర్ అండ్ బీ ఇఎన్‌సి గణపతి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎయిమ్స్ తరహా సేవలతో టిమ్స్

“ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్‌బినగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కంటోన్మెంట్, ఎయిర్ పోర్టు ఇతర సంస్థల నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకుని నమూనాలు తయారు చేయాలని” మంత్రి హరీశ్‌రావు కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News