Tuesday, July 16, 2024

కోల్‌కతాకు పరీక్ష!

- Advertisement -
- Advertisement -

Today match between KKR vs RCB

నేడు బెంగళూరుతో పోరు

దుబాయి: ఐపిఎల్ రెండో దశలో భాగంగా సోమవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. తొలి దశలో అంతంత మాత్రం ఆటతో నిరాశ పరిచిన కోల్‌కతా ఈసారైన మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోంది. యుఎఇ వేదికగా రెండో దశ మ్యాచ్‌లకు ఆదివారం తెరలేచిన విషయం తెలిసిందే. ఇక భారత్‌లో జరిగిన తొలి అంచె మ్యాచుల్లో కోల్‌కతా కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఏడు మ్యాచుల్లో ఐదింటిలో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. దినేశ్ కార్తీక్ స్థానంలో ఇయాన్ మోర్గాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. ఇక యుఎఇలో జరుగుతున్న రెండో దశ మ్యాచ్‌లు కోల్‌కతా చాలా కీలకంగా మారాయి. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి నైట్‌రైడర్స్‌కు నెలకొంది. మరోవైపు కీలక ఆటగాడు పాట్ కమిన్స్ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో లేక పోవడం కోల్‌కతాకు మరింత ప్రతికూలంగా తయారైంది.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కమిన్స్ లోటును భర్తీ చేయడం అనుకున్నంత తేలికేం కాదు. అయితే టిమ్ సౌథి రూపంలో కోల్‌కతాకు మరో మెరుగైన అస్త్రం ఉండడం కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇక తొలి దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి అంచెలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను చిత్తుగా ఓడించింది. ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. డివిలియర్స్, కోహ్లి, పడిక్కల్, మాక్స్‌వెల్, అజారుద్దీన్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌లు బెంగళూరులో ఉన్నారు. అంతేగాక హర్షల్ పటేల్, సిరాజ్, జేమిసన్, చాహల్, హసరంగా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సవాల్ వంటిదే..

కాగా, బెంగళూరుతో సోమవారం జరిగే మ్యాచ్ కోల్‌కతాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. నాకౌట్ రేసులో ఉండాలంటే ఇకపై జరిగే అన్ని మ్యాచుల్లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో నైట్‌రైడర్స్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. ఇక తొలి దశలో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన దినేశ్ కార్తీక్, సునిల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ తదితరులు తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. ఈసారి కార్తీక్ సేవలు జట్టుకు చాలా కీలకంగా మారాయి. నరైన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బాధ్యతలు కూడా మరింత పెరిగాయి. తొలి దశలో బ్యాటింగ్ వైఫల్యం కోల్‌కతాను వెంటాడింది. ఈసారి బ్యాటింగ్ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణాలు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఇక రెండో దశ మ్యాచ్‌లు కెప్టెన్ మోర్గాన్‌కు కూడా చాలా కీలకంగా మారాయి. జట్టులో విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంతో పాటు జట్టును గాడిలో పెట్టక తప్పదు.

ఆశలన్నీ రసెల్‌పైనే..

మరోవైపు కోల్‌కతా ఆశలన్నీ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పైనే నిలిచాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రసెల్ తొలి దశలో అనుకున్న స్థాయిలో ఆడలేక పోయాడు. కనీసం ఈసారైనా అతను తన స్థాయికి తగ్గ ఆటను కనబరచక తప్పదు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే రసెల్ విజృంభిస్తే అతన్ని ఆపడం ఎవరి తరంకాదు. గతంలో ఎన్నో సార్లు కోల్‌కతా సంచలన విజయాలు అందించిన ఘనత రసెల్ సొంతం. ఈసారి కూడా రసెల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వరుణ్ చక్రవర్తి, నాగర్‌కోటి, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ, నరైన్ తదితరులతో కోల్‌కతా బౌలింగ్ బాగానే ఉంది. ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్‌మన్ తమవంతు పాత్రను సమర్థంగా పోషిస్తే ఈ మ్యాచ్‌లో గెలవడం కోల్‌కతాకు అసాధ్యమేమి కాదు.

జోరు సాగిస్తుందా..

ఇక తొలి దశలో నిలకడైన ప్రదర్శనతో అలరించిన బెంగళూరు రెండో అంచెలో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు బెంగళూరులో కొదవలేదు. ఈసారి కూడా కోహ్లితో పాటు పడిక్కల్, మాక్స్‌వెల్, డివిలియర్స్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మొదటి దశలో మాక్స్‌వెల్, డివిలియర్స్ అద్భుతంగా ఆడారు. రెండో దశలో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. కోహ్లి కూడా భారీ స్కోర్లపై కన్నేశాడు. బౌలింగ్‌లో కూడా బెంగళూరు బలంగా ఉంది. హర్షల్ పటేల్, సిరాజ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. ఇలా రెండు విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News