Monday, April 29, 2024

కాంగ్రెస్ పార్టీ కి షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకీ షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా టిపిసిసి ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి నర్సాపూర్ టికెట్ ఆశించారు. టికెట్ దక్కక పోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం అశోక్ నగర్ లోని తన కార్యకాయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కేసులను సైతం లెక్కపెట్టకుండా కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్యారాచుట్ నేతలకు ప్రాధాన్యతనిస్తూ డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు.

గౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేక బాధతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థిత్వాన్ని ఆశించిన గాలి అనిల్ కుమారుకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తికి లోనైన ఆయన స్థానిక నేతలతో కలిసి కాంగ్రెస్ రెబెల్ గా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే అధిష్టానం బుజ్జగింపులతో ఐక్యంగా కలిసి పని చేస్తామని ప్రకటించిన రెండు రోజులకే గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం విశేషం.

త్వరలో గులాబీ గూటికి..?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్ త్వరలో బిఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు చర్చ జరుగుతుంది. 2001 నుంచి 2018 వరకు బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగిన అనిల్ కుమార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014లో పటాన్ చెరు ఎంఎల్‌ఎ టికెట్ ఆశించారు. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో గాలి అనిల్ కుమార్‌కు నామినేట్ పదవి ఇస్తామని సర్ది చెప్పి గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్ అధిష్టానం గాలి అనిల్ కుమార్‌కు ఇచ్చిన వాగ్దానం విస్మరించడంతో 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ గాలికి మెదక్ పార్లమెంట్ టికెట్ కేటాయించింది. టిపిసిసి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం మొండి చేయి చూపడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒకట్రెండు రోజుల్లో గాలి అనిల్ కుమార్ గులాబీ తీర్థం పుచ్చుకుని సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News