Monday, April 29, 2024

సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని సెప్టెంబర్ 26న అధికారికంగా ప్రతీ యేడాది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జివో 2086 విడుదల చేసింది. దీంతో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని ఆయన నివాసంలో కలిసిన రజక సంఘాల నేతలు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి క్రుతజ్ణతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి గంగుల జీవో కాపీని రజక సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్పూర్తి అని, తెలంగాణ యావత్ సమాజానికి భానిసత్వాన్ని బద్దలు కొట్టే చైతన్యాన్ని అందించిన ఉద్యమ జ్వాల అని కొనియాడారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపురం లో 1895 సెప్టెంబర్ 26న జన్మించిన ఐలమ్మ భూస్వామ్య పెత్తందారి వ్యవస్థలకు, భానిస వెట్టిచాకిరి విముక్తికి ఎనలేని పోరాటం చేసారన్నారు.

ఆడదంటే అబల కాదని, స్వాభిమానం నింపుకున్న చాకలి ఐలమ్మ, పండించిన పంటపై ప్రాణం పోయినా హక్కుల్ని వదులుకోనని భూస్వామికి వ్యతిరేకంగా పంటను తీసుకొచ్చి రక్షణగా కొడవలి ఎత్తి నిలిచి నాడు చేసిన ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా చైతన్య స్పూర్తిని రగిల్చిందన్నారు. కొడుకుని కోల్పోయినా, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని సంకల్పంతో నాటి విస్నూర్ దేశ్ముక్ రాపాక రాంచంద్రారెడ్డికి ఎదురునిలిచి చేసిన పోరాటం అనన్యసామాన్యమన్నారు మంత్రి గంగుల కమలాకర్. చాకలి ఐలమ్మ పోరాటం ఫలితంగానే నాడు తెలంగాణలో భూపోరాటం ఉద్రుతమయ్యి దాదాపు 10లక్షల ఎకరాల భూమి నిరుపేద వెనుకబడిన వర్గాలకు దక్కిందన్నారు. ఈ వీరవనితను స్మరించుకోవడం, ఆస్పూర్తిని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చాకలి ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తూ సాగుతుందని, బడుగు, బలహీన వర్గాలకు సంపూర్ణ అండగా ఉంటూ అనేక సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను బిసి సంక్షేమ శాఖ పక్షాన రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈనెల 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్ని నిర్వహిస్తామన్నారు.ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘాల నేతలు ప్రభుత్వం రజకులకు పూర్తి అండగా ఉంటుందని, రజకుల సంక్షేమం కోసం ఆదునిక దోబీ ఘాట్లు, 250 యూనిట్ల ఫ్రీ కరెంటు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, రజకులు సైతం ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉంటామని రజక సంఘం నేతలు పేర్కొన్నారు.

TS Govt to organise Chakali Ilamma birth anniversary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News