Monday, April 29, 2024

కుండపోత వర్షం

- Advertisement -
- Advertisement -

Two hours of torrential Rain in Hyderabad

 

హైదరాబాద్‌లో రెండు గంటల పాటు దంచికొట్టిన వాన

ఐదు గంటల పాటు రోడ్లపైనే వాహన, పాదచారుల అవస్థలు

ఉరుములు, మెరుపుల వానతో భయకంపితులైన జనం నదులను తలపించిన నగర వీధులు పలుచోట్ల

బీభత్సమైన ట్రాఫిక్ జామ్ పొంగిపొర్లిన డ్రైనేజీలు జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి

సిబ్బంది, భారీ వర్షంలోనే సహాయక చర్యలు అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15సెం.మీ. వర్షం

 

మన తెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గంటపాటు ఏకధాటిగా కురిసింది. కొద్దిపాటి వర్షం కురిస్తేనే హైదరాబాద్ రహదారులపై వాహన చోదకులు, పాదచారులు నడవలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలాంటిది భారీ వర్షమే కురియడంతో దాదాపు ఐదు గంటల పాటు రహదారులపైనే వాహన చోదకులు, ప్రజలు నిరీక్షించాల్సిన ఆగత్యమేర్పడింది. శుక్రవారం సాయంత్రం గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రోడ్లపై వర్షపు నీరు మోకాళ్ల లోతు నిలిచిపోయింది. సాయంత్రం వేళ ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వచ్చే వేళ వర్షం కురియడంతో వాహన చోదకులు, ప్రజలు పలు ఇబ్బందుల పాలయ్యారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట, టోలిచౌక్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, బోరబండ, ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్‌రోడ్, రాంనగర్, అఫ్జల్‌గంజ్, పురానాపూల్‌లో భారీ వర్షం దంచికొట్టింది. మలక్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ట్రాపిక్‌లో వాహనాలు చిక్కుకుపోయాయి.

పంజాగుట్టకు ఇటు ఐదు కిలోమీటర్లు, అటు ఐదు కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్‌లో సైతం ఏకధాటిగా వర్షం కురిసింది. గచ్చిబౌలి, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఆసిఫ్‌నగర్‌లో 15 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్. జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మిగతా ప్రాంతాల్లో సైతం 5 సెంమీల పైనే వర్షపాతం నమోదైంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక వర్షపాత నమోదుగా చెబుతున్నారు. ప్రధానంగా కోఠి, ఎంజె మార్కెట్, ఆబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్‌లో రహదారులపై వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి వర్షపు నీటిని తొలగించేందుకు మ్యాన్‌హోల్స్‌ని తెరిచారు. మరోవైపు భారీ వర్షంతో ప్రజలు, వాహన చోదకులు మెట్రో కింద తలదాచుకుందామన్న వీలులేని పరిస్థితి తలెత్తింది.

మెట్రో నుంచి సైతం వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు, వాహన చోదకుల పాట్లు అంతా ఇంతా కాదు. వర్షంలో చిక్కుకున్న వారు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వాహనాలను ముందుకు నడిపిద్దామంటే ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి ఉంది. కొద్ది పాటి వర్షానికే భాగ్యనగరం చిత్తడి చిత్తడిగా మారుతుంది. అలాంటిది భారీ వర్షం కురిస్తే ఇక అంతే. అదే పరిస్థితి శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రస్ఫుటీకరించింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి చెరువులుగా మారిన రహదారులపై నిలిచిన వాహనాలను ముందుకు నడిపించేందుకు వాహన చోదకులు పడరాని పాట్లు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తరలించేందుకు ఓ వైపు ప్రయత్నిస్తూనే మరోవైపు రోడ్లపై ముందుకు కదలని వాహనాలను ముందుకు కదిలేందుకు వాహన చోదకులకు సహకరించారు. వర్షం కురిసిన ప్రతిసారి హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కానుండటంపై వాహన చోదకులు, ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

భారీ వర్షం కురుస్తున్న దరిమిలా మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు విద్యుత్ శాఖ సిఎండి సమీక్ష చేశారు. విద్యుత్ తీగలను ప్రజలెవరూ తాకరాదని సూచించారు. విద్యుత్‌లో హైవోల్టెజ్, లో వోల్టేజ్ సంభవించినప్పుడు తమకు సమాచారం అందించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని తరలించేందుకు జిహెచ్‌ఎంసి సిబ్బంది శ్రమిస్తున్నారు. గతం కంటే భిన్నంగా గంట పాటు కురిసిన వర్షానికి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఈ సందర్భంగా గమనార్హం. మెట్రో మార్గం కింద నుంచొనేందుకు సైతం వాహన చోదకులకు అవకాశం లేకుండా వర్షం కురియడమే ఇందుకు తార్కాణంగా చెప్పవచ్చు. భారీ వర్షం కారణంగా మరోవైపు లోతట్టు ప్రాంతాలు పూర్తిస్థాయిలో జలమయమయ్యాయి. గత కొంతకాలంగా తెరపిచ్చిన వాన మళ్లీ ఒక్కసారిగా దంచికొట్టింది. అయితే చిరుపాటి జల్లులు కురిస్తే అది ప్రజలు, వాహన చోదకులకు ఉపశమనం కలిగించేది.

కానీ గంట పాటు ఏకధాటిగా కురవడంతో ప్రజలు, వాహన చోదకులను ఇబ్బందుల పాల్జేసింది. ఇక ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ నియంత్రించే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ వారికి ట్రాఫిక్‌ని నియంత్రించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. మామూలు సమయంలోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ కూడళ్లలో ఒక వాహనం చిక్కుకుందంటే మిగతా వాహనాలన్నీ వరుస వెంబడి ఆగిపోయి ట్రాఫిక్ స్తంభించడం ఆనవాయితీ. మరి అలాంటిది భారీవర్షం కూడా తోడైతే రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు ఏ విధంగా ఉంటాయో చెప్పనలవి కాదు. ఏది ఏమైనా శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఇటు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అటు లోతట్టు ప్రాంత వాసులను ఇక్కట్ల పాల్జేసిందనే చెప్పవచ్చు. కాగా, వర్షం వస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహన చోదకులు ముక్తసరిగా కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News