Monday, April 29, 2024

ఐసిస్ పై అమెరికా మళ్లీ దాడి

- Advertisement -
- Advertisement -

U.S. forces airstrikes on ISIS suicide bomber

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఘటన
పేలిన శకటంలో భారీ విస్ఫోటకాలు
రాకెట్ దాడిలో బాలుడు మృతి

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో ఐసిస్ ఆత్మాహుతి దళంపై అమెరికా సేనలు ఆదివారం వైమానిక దాడికి దిగింది. కాబూల్ ఎయిర్‌పోర్టును లక్షంగా చేసుకుని అఫ్ఘన్ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్ధ (ఐఎస్‌ఐఎస్ కె) బహుళ సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లను రంగంలోకి దింపింది. ఈ బాంబర్లు ఓ శకటంలో సంచరిస్తూ ఉన్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో అమెరికా సేనలు గగనతలం నుంచి దాడికి దిగాయని అధికారులు తెలిపారు. కాబూల్‌లోని కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్లను అమెరికా సేనల సాయంతో స్వదేశానికి తరలిస్తూ ఉన్నారు. ఈ తరలింపు ప్రక్రియను విచ్ఛిన్నం చేసేందుకు ఐసిస్ మూకలు రంగంలోకి దిగాయి. తమను తాము విమానాశ్రయంలో పేల్చుకుని తద్వారా అమెరికా సేనలకు, తరలివెళ్లే అమెరికన్లకు ముప్పు వాటిల్లేలా చేయాలని వ్యూహం పన్నారు. అయితే దీనిని విఫలం చేస్తూ అమెరికా సకాలంలోనే ముందస్తుగా ఈ శకటాన్ని టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు.

మరో వైపు ఎయిర్‌పోర్టుకు వాయవ్యంగా అతి సమీపంలోని ఓ కుగ్రామంలో దూసుకువచ్చిన ఓ రాకెట్ ధాటికి అక్కడున్న ఓ బాలుడు మృతి చెందిన ఘటన గురించి కూడా పూర్తి సమాచారం వెలువడలేదు. తమ వైమానిక దాడి విజయవంతం అయినట్లు ఇద్దరు అమెరికా సైనికాధికారులు అనధికారికంగా తెలిపారు. తాము గురిపెట్టి కొట్టిన శకటంలో భారీ స్థాయి పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయని, తమ వైమానిక దాడి తరువాతి దశలో ఆ తరువాత రెండు మూడు సార్లు పేలుళ్ల ప్రతిధ్వనులు విన్పించాయని, దీనిని బట్టి ఐసిస్‌లకు భారీ నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఐసిస్ దళాలను లక్షంగా చేసుకుని అమెరికా సేనలు చేపట్టిన రెండో దాడి ఇది. ఒక్కరోజు క్రితం దేశంలోని నంగర్హార్ ప్రొవిన్స్‌లో జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు ప్రధాన ఐసిస్ సూత్రధారులు హతులు అయ్యారు. అయితే ఇప్పుడు జరిగిన దాడిలో ఎందరు ఐసిస్‌లు హతులు అయ్యారు? ఇతర వివరాలు ఏమిటీ? అనేది వెల్లడికాలేదు.

దాడిని నిర్థారించిన తాలిబన్ల ప్రతినిధి

ఎయిర్‌పోర్టు వద్ద అమెరికా జరిపిన వైమానిక దాడిని తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. ఓ సూసైడ్ బాంబరు తన ఆయుధ భరిత శకటంలో సంచరిస్తూ ఉండగా గమనించి దీనిపై వైమానిక దాడి జరిగిందని తెలిపారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

కుజ్వా బుగ్రా ప్రాంతంలో రాకెట్ దాడి

కాబూల్‌కు సమీపంలోని కుజ్వా బుగ్రా వద్ద ఓ రాకెట్ దాడి జరిగింది. ఈ ప్రాంతంలోని ఓ భవనంలో నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్లు గమనించినట్లు కాబూల్ పోలీసు ఉన్నతాధికారి రషీద్ తెలిపారు. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకూ ఏ సంస్థ ప్రకటన వెలువరించలేదు. అయితే దేశంలోని పలు తీవ్రవాద సంస్థలకే రాకెట్ దాడుల అనుభవం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News