Saturday, April 27, 2024

త్వరలో ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు

- Advertisement -
- Advertisement -

డిఎంకెలో జోరుగా ఊహాగానాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు త్వరలో పదోన్నతి లభించనున్నది. ఆయనకు త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పదవి లభించనున్నట్లు రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడికి ఆ లోపలే ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించనున్నారని డిఎంకె వర్గాలు తెలిపాయి. జనవరి 21న డిఎంకె యువజన విభాగం సమావేశం సేలంలో జరగనున్నది. ఆ సమావేశం తర్వాత ఉదయనిధి పదోన్నతి ప్రకటన ఉండగలదని వర్గాలు తెలిపాయి.

కాగా..ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే విషయం తనకు తెలియదని డిఎంకె సంస్థాగత కార్యదర్శి టికెఎస్ ఇళంగోవన్ అన్నారు. అయితే పార్టీలో ఉదయనిధి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు. ఏదేమైనా తుది నిర్ణయం స్టాలిన్‌దేనని చెప్పిన ఆయన అయినా అందులో తప్పేముందని ప్రశ్నించారు. అయితే దీనిపై ఉదయనిధి వివరణ ఇస్తూ ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టివేశారు. దీనిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి మాత్రమేని ఆయన స్పష్టం చేశారు.

ఇలా ఉండగా..ఈ వార్తలపై ప్రతిపక్ష ఎఐఎడిఎంకె స్పందిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి అవుతారంటూ వస్తున్న వార్తలను ఊహాగానాలుగా కొట్టివేయలేమని, ఇందులో నిజం ఉందని తెలిపింది. గత ఏడాది కాలంగా ఇదే విషయాన్ని తాము చెబుతున్నామని ఎఐఎడిఎంకె ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు. ఉదయనిధికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని, ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు డిఎంకె తెస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

డిఎంకెలో ప్రజాస్వామ్యం లేదని, కుటుంబ రాజకీయాలే ఉన్నాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణని ఆయన చెప్పారు. ఆ పార్టీలో తండ్రి, కుమారుడు, మనవడు, మునివనవడు మాత్రమే అధ్యక్షులుగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీలో కింది స్థాయి కార్యకర్త సైతం పార్టీ అధినేత కాగలరని, కాని డిఎంకెలో ఆ కుటుంబ వారసులే అధినేతలు అవుతారని సత్యన్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News